విజయవాడ రైల్వేస్టేషన్‌కు మహర్దశ | central railway minister visits vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడ రైల్వేస్టేషన్‌కు మహర్దశ

Published Thu, Jun 15 2017 9:28 AM | Last Updated on Tue, Sep 5 2017 1:42 PM

విజయవాడ రైల్వేస్టేషన్‌కు మహర్దశ

విజయవాడ రైల్వేస్టేషన్‌కు మహర్దశ

► ప్రభుత్వ, ప్రయివేట్‌ భాగస్వామ్యంతో కార్పొరేట్‌ హంగులు
► నేడు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
► విజయవాడకు రానున్నరైల్వేమంత్రి సురేష్‌ ప్రభు


విజయవాడ రైల్వేస్టేషన్‌లోని ప్రతి ప్లాట్‌ఫాం అత్యాధునిక ఎస్కలేటర్లతో ప్రయాణికులకు ఆహ్వానం పలకనున్నాయి. 1, 6, 7, 8, 9 ప్లాట్‌ఫాంలపై అత్యాధునిక ఫుడ్‌కోర్టులు ఏర్పాటు కానున్నాయి. వీటితోపాటు మల్టీఫంక్షన్‌ హాల్‌లు, థియేటర్స్, షాపింగ్‌ మాల్స్, ఎగ్జిక్యూటివ్‌ లాంజ్‌లు, ఏసీ వెయిటింగ్‌ హాల్‌లు, పిల్లలకు ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం మినీ థియేటర్స్‌ ప్రయాణికులకు వరల్డ్‌క్లాస్‌ సౌకర్యాలను తలపించనున్నాయి.

రైల్వేస్టేషన్‌  (విజయవాడ): ప్రభుత్వ, ప్రయివేట్‌ భాగస్వామ్యంతో విజయవాడ రైల్వే స్టేషన్‌కు కార్పొరేట్‌ హంగులు అమరునున్నాయి. రాజధాని నేపథ్యంలో విజయవాడకు ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అయ్యింది. రీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు కింద 195 కోట్లతో పి.పి.పి(ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం) పద్ధతిలో పనులు చేపట్టనున్నారు. రైల్వేమంత్రి సురేష్‌ ప్రభు విజయవాడలో గురువారం పనులను ప్రారంభించనున్నారు. నెలాఖరుకు బిడ్లను ఖరారు చేస్తారని రైల్వే వర్గాలు తెలిపాయి.

విజయవాడ నగర శివార్లలో, రాయనపాడు సమీపంలో ఇప్పటివరకు నిరుపయోగంగా ఉన్న వందలాది ఎకరాల రైల్వే స్థలాలను సైతం పి.పి.పి పద్ధతిలో అభివృద్ధి చేయనున్నారు. దీంతో డివిజన్‌తోపాటు విజయవాడ రైల్వేస్టేషన్‌ ఆదాయం కూడా గణనీయంగా పెరగనుంది. నిత్యం విజయవాడ మీదుగా 350కి పైగా ఎక్స్‌ప్రెస్, పాసింజర్‌ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. నిత్యం అన్‌సీజన్‌లో లక్ష, సీజన్‌లో లక్షన్నర మందికి పైగా ప్రయాణికులు ఈ స్టేషన్‌ గుండా రాకపోకలు సాగిస్తుంటారు. రీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో భాగంగా విమానాశ్రయ తరహాలో సౌకర్యాలు అమరనున్నాయి.

ప్రతి ప్లాట్‌ఫాంకు ఎస్కలేటర్‌...
స్టేషన్‌లోని పది ప్లాట్‌ఫాంలపై అత్యాధునిక ఎస్కలేటర్లు,  1, 6, 7, 8, 9 ప్లాట్‌ఫాంలపై అత్యాధునిక ఫుడ్‌కోర్టులు, మల్టీఫంక్షన్‌ హాల్‌లు, థియేటర్స్, షాపింగ్‌ మాల్స్, ఎగ్జిక్యూటివ్‌ లాంజ్‌లు, ఏసీ వెయిటింగ్‌ హాల్‌లు, చిల్ట్రన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం మినీ థియేటర్స్‌ను నిర్మించనున్నారు. ఇప్పటికే వైఫై, డీజీ పే వంటి సౌకర్యాలు  ప్రయాణికులకు అమరాయి.  వివిధ రైళ్ల రాక ఆలస్యమైన ప్రయాణికులకు వినోదాన్ని అందించటానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.

పీపీపీ పద్ధతిలో రైల్వే స్థలాల అభివృద్ధి...
సత్యనారాయణపురం, సింగ్‌నగర్, రాయనపాడులో ఖాళీగా ఉన్న 200 ఎకరాల రైల్వే స్థలాలను పి.పి.పి పద్ధతిలో అభివృద్ధి చేయనున్నారు. అదే విధంగా ప్రయాణికులు బస చేసేందుకు అత్యాధునిక విశ్రాంతి మందిరాలను ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ స్టేషన్‌ ఎదురుగా ఉన్న 2 ఎకరాల స్థలంలో అత్యాధునిక మల్టీలెవల్‌ ఫంక్షన్‌ హాల్, విశాలమైన కార్‌ పార్కింగ్‌ స్టాండ్, ద్విచక్రవాహనాల పార్కింగ్‌ స్టాండ్‌లను నిర్మించనున్నారు. ప్రయాణికుల లగేజీని భద్రపరుచుకునేందుకు అత్యాధునిక క్లోక్‌ రూంలను నిర్మించనున్నారు.

గురువారం కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్‌ ప్రభు పనులను ప్రారంభించనున్నారు. జూన్‌ నెలాఖరుకు టెండర్లను ఖరారు చేస్తారని రైల్వే వర్గాలు తెలిపాయి. వీటితో పాటు కొత్త రైళ్లు, పలు అభివృద్ధి పనులు ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారని సమాచారం. ఇప్పటికే రైల్వేస్టేషన్‌కు రోజుకు సుమారు రూ.80లక్షల ఆదాయం వస్తోంది. ఈ అత్యాధునిక సౌకర్యాల ఏర్పాటుతో ఈ ఆదాయం మరింత పెరగనుంది.  అత్యాధునిక సౌకర్యాల కల్పనతో విజయవాడ రైల్వేస్టేషన్‌ ప్రయాణికులకు వరల్డ్‌ క్లాస్‌ స్టేషన్‌ అనుభూతిని కలిగించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement