రైతులకు చేయూతనిస్తున్న ప్రభుత్వం
- మెదక్ ఏఎంసీ చైర్మన్ కృష్ణారెడ్డి
- దళారులను నమ్మి మోస పోవద్దు
మెదక్:తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎంతగానో చేయూత నిస్తుందని , వారి శ్రేయస్సుకోసం ప్రభుత్వం ఏమైన చేస్తుందని మెదక్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అకిరెడ్డి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తన ఛాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. రైతులకోసం ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. రైతులు పండించిన పంటను నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవదన్నారు. రైతుబంధు పథకాన్ని అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ పథకం కింద రైతుల పంటకు గిట్టుబాటు «ధర దొరక్కపోతే వారు పండించిన ధాన్యాన్ని నేరుగా ఏఎంసీలోకి తరలించి, అక్కడి గోదాంలో నిల్వ చేసి పంట ఉత్పత్తిపై 75 శాతం రుణాన్ని వడ్డీ లేకుండా తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు.
ఆరునెలల వరకు రైతులు తమ ఉత్పత్తులు నిల్వ చేసుకునే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రతి మండల ప్రధాన కేంద్రంలో పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణం చేయించిందన్నారు. ప్రస్తుతం మెదక్ మార్కెట్ యార్డ్‌లో గల ఉల్లినిల్వ గోదాములను కూలదోసి వాటి స్థానంలో నూతనంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి, వాటిల్లో ఎరువులు, మందులు విక్రయ కేంద్రాలను ఇక్కడే ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మార్కెట్‌యార్డ్‌లో జరుగుతున్న వారాంతపు పశువుల సంతను కొనసాగిస్తుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఈ విషయాన్ని డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సంతను మరోచోటకు తరలిస్తామని తెలిపారు. దసరా రోజున నూతన జిల్లా ఏర్పాటు అవుతున్న సందర్భంగా రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం పలకాలని ఆయన కోరారు