సెలక్షన్ మ్యాచ్‌లో మూడు వికెట్లతో ఆకట్టుకున్న లెగ్‌స్పిన్నర్ కులశేఖర్
శ్రీకాకుళం న్యూకాలనీ : భావి క్రికెటర్లు ప్రతిభ చాటుకుంటున్నారు. మండుటెండలో చెమటోడ్చుతున్నారు. ఎలాగైనా తమ కళలను సాకారం చేసుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్) కళాశాల మైదానంలో జరుగుతున్న జిల్లా అండర్–14 బాలుర క్రికెట్ జట్టు సెలక్షన్ మ్యాచ్‌ల్లో రెండోరోజు శనివారం పలువురు క్రీడాకారులు తలుక్కున మెరిశారు. ఈ మ్యాచ్ గురువారం ప్రారంభం కాగా.. శుక్రవారం ప్రతికూల వాతావరణం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేశారు. కొనసాగింపు మ్యాచ్‌ను యథావిధిగా శనివారం నిర్వహించారు.
పర్యవేక్షకులు, సెలక్టర్లు రాక..
ఎంపికల మ్యాచ్‌ను స్వయంగా నార్త్‌జోన్ క్రికెట్ కార్యదర్శి జి.వి.సన్యాసిరాజు హాజరై పర్యవేక్షించారు. ఆయనతో పాటు ఏసీఏ అండర్–14 చీఫ్ సెలక్టర్ ఎం.వైకుంఠరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రాబబుల్స్ జట్టుకు ఎంపికైన మొత్తం 34 మంది క్రీడాకారులకు పలు సూచనలు చేశారు. ప్రతిభతో రాణించిన క్రీడాకారులకు మాత్రమే తుది జట్టులో చోటు కల్పిస్తామని స్పష్టం చేశారు. క్రికెట్ సంఘ ప్రతినిదులు ఎం.యోగేశ్వరరావు, కోచ్‌లు కె.సుదర్శన్, రాజబాబు, శ్రీనివాస్, వరహాలు పాల్గొన్నారు. సిబ్బంది మల్లిఖార్జున్, క్యురేటర్ శరత్ మ్యాచ్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. కాగా ఆదివారం రెండో సెలక్షన్ మ్యాచ్ ప్రారంభం కానుందని నిర్వాహకులు వెల్లడించారు.
ఆకట్టుకునే ప్రతిభ..
– బ్యాటింగ్ విభాగంలో వి.గణేష్ 84 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. చూడచక్కటి బౌండ్రీలతో ఆకట్టుకున్నాడు. అలాగే డి.తేజ 44, డేవిడ్‌రాజు 41, పి.శివ 33, ఎం.నాగరాజు 27, ఎం.సాయియశ్వంత్ 26, ఎస్‌బీఎంవి ప్రసాద్ 25 పరుగులతో రాణించారు.
– బౌలింగ్ విభాగంలో ఎం.సుధీర్‌కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టగా, డి.కులశేఖర్, కె.గణేష్, ఎం.శ్రీవత్సలు మూడేసి వికెట్లతో విజృంభించారు. ఇక సాయియశ్వంత్, డి.వశిష్ట, సంహిత్‌యాదవ్, ఢిల్లీరావు, పూర్ణచంద్రలు రెండేసి వికెట్లు సాధించారు. తదుపరి మ్యాచ్‌లో రాణింపు కోసం సాయంత్రం నెట్స్‌లో కఠోర సాధన చేశారు.