
'జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారు'
అన్నదాతలు, చేనేత కార్మికుల జీవితాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆటలు ఆడుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో రెండోరోజు రైతు భరోసాయాత్రలో భాగంగా ఆయన ధర్మవరంలో గురువారం మధ్యాహ్నం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..
- రాష్ట్రంలో జరుగుతున్న పాలన, ఎన్నికలకు ముందు బాబు చెప్పిన మాటలు, ఎన్నికల తర్వాత ఆయన రైతులను, డ్వాక్రా అక్క చెల్లెళ్లను, చేనేతలను, పిల్లలను వదలకుండా అన్ని వర్గాలను మోసం చేశారో అందరికీ కనిపిస్తున్న సత్యం
- ఎన్నికలు జరిగేరోజున ఏ టీవీ ఆన్ చేసినా, చంద్రబాబు చేసిన ప్రసంగాలు వినిపించేవి. ప్రకటనలు కనిపించేవి. ఫ్లెక్సీలకు లైట్లు పెట్టి ప్రకటించేవాళ్లు
- బ్యాంకులో బంగారం బయటకు రావాలంటే బాబు సీఎం కావాలనేవాళ్లు.
- రైతుల రుణాలన్నీ బేషరతుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని అనేవారు
- డ్వాక్రా రుణాలన్నీ పూర్తిగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పేవారు
- జాబు కావాలంటే బాబు సీఎం కావాలని చెప్పేవాళ్లు
- తర్వాత తాను సీఎం అయ్యారు. ఆ తర్వాత ఈవాళ పరిస్థితి చూస్తున్నాం
- ఉన్నజాబులు ఊడబీకుతున్నారు
- రెండువేల నిరుద్యోగ భృతి ఏమైనా వస్తోందా?
- ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు.. నిరుపేదలందరికీ ఇళ్లు కట్టిస్తాం, గుడిసెలు లేకుండా చేస్తాం అన్నారు
- మీ అందరికీ కనీసం ఒక్క ఇల్లయినా కట్టించారా?
- చివరకు అన్నదాతలను కూడా వదల్లేదు
- పెన్షన్లు ఇస్తామన్నారు.. ఇచ్చేది కొద్దిమందికి, కత్తిరించేది ఎక్కువమందికి అయిపోయింది
- అన్నదాతల జీవితాలతో ఆయన ఎలా చెలగాటం ఆడుతున్నారంటే.. బియ్యం కూడా కటింగ్ చేస్తున్నారు
- బాబు పరిపాలన అంతా మోసం, దగాగా ఉంది
- చేనేత కార్మికుల రుణాలన్నీ మాఫీ చేస్తామని, ప్రతి కార్మికుడికీ ఇల్లు, షెడ్ కట్టిస్తామని చెప్పారు
- ఒక్కరికి కూడా కట్టించిన పాపాన పోలేదు
- ప్రతి చేనేత కుటుంబానికి లక్షన్నర వడ్డీ లేకుండా ఇస్తామన్నారు
- రుణాలు మాఫీ చేస్తామన్నారు
- ఏ ఒక్కరికీ మాఫీ కాలేదు, కొత్త రుణాలు రాలేదు
- సీఎం చంద్రబాబు అయిన ఈ 20 నెలల్లో ఇదే ధర్మవరంలోనే 16 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు
- బహుశా దేశచరిత్రలోనే ఎక్కడా ఇలా జరిగి ఉండదు
- వాళ్ల కుటుంబాలకు చేసింది సున్నా.. రూపాయి ఇవ్వలేదు, రుణాలు మాఫీ చేయలేదు
- ఒక్క బ్యాంకు కూడా వాళ్లకు రుణాలు ఇవ్వలేదు
- అందరి బతుకుల్లో బాధలే కనిపిస్తున్నాయి
- కందిపప్పు కిలో 150-180 వరకు ఉంటోంది.. ఏం కొనేట్టు లేవు, తినేట్టు లేవు
- ఇంటికి పోతే కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి, బజారుకు పోతే కూరగాయల ధరలు షాక్ కొడుతున్నాయి
- చంద్రబాబుకు జ్ఞానోదయం కలిగి, ఇప్పటికైనా వీళ్లకు అండగా నిలవాలి
- ఎన్నికలప్పుడు ఏం చెప్పారు, ఈవాళ పరిపాలన ఏం చేస్తున్నారో గుండెల మీద చేతులు వేసుకుని తనను తాను పరిశీలించుకోవాలి
- లేకపోతే చంద్రబాబు పురుగులు పడిపోతాడని చెబుతున్నా
- మన బాధలేంటో చంద్రబాబుకు అర్థమయ్యేలా చెప్పగలిగాం
- ఇప్పటికైనా మార్పు వస్తుందని ఆశిస్తున్నాం.. మార్పు రాకపోతే దేవుడు ఉతికి ఆరేస్తాడు, బంగాళాఖాతంలో ముంచేస్తాడు
- మన పాలన వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి
- చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా మీరే గడ్డిపెట్టండి
మీటింగుకు వెళ్తే కార్డులు కట్
జగన్ సమావేశానికి వెళ్తే బియ్యం కార్డులు తీసేస్తామని బెదిరిస్తున్నారు. రావాలని చాలామందికి ఉన్నా, ఇలా బెదిరించడంతో రాలేకపోతున్నారు. ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారు, పింఛన్లు ఇవ్వడం లేదు. బ్యాంకులకు పోతే జగన్ పార్టీ వైపు వెళ్తున్నావని రుణాలు కూడా ఇవ్వట్లేదు. 600 రూపాయల సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. లక్షన్నర రూపాయల వడ్డీ లేని రుణం కాదు కదా.. వడ్డీలకు వడ్డీలు పెంచి బ్యాంకులో రుణాలు ఎక్కువ కట్టించుకున్నారు. చంద్రబాబు చెప్పారు గానీ, అవి తమవరకు రాలేదని, అందువల్ల మొత్తం వడ్డీ కట్టాల్సిందేనని బలవంతపెడుతున్నారు. ఆ వడ్డీలు కట్టలేక చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
-చేనేత కార్మికురాలు
వడ్డీలకు వడ్డీలు కడుతున్నాం
నేను చేనేత కార్మికురాలిని, డ్వాక్రా గ్రూపులో కూడా లేవు. ఇంతకుముందు పావలావడ్డీ పడేది. 70 వేల రూపాయల రుణం ఉంది. దానికి వడ్డీకి వడ్డీలు కడుతూనే ఉన్నాం గానీ, మాఫీ మాట లేనే లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక అందరికీ దరిద్రం పట్టుకుంది. బ్యాంకుల్లో కూడా రుణాలు ఇవ్వడం లేదు. మనిషికి 3 వేలు ఇచ్చేవాళ్లు, ఇప్పుడు అవి కూడా మా సంఘానికి పడలేదు. ఇన్నాళ్లబట్టి ఎవరికీ చెప్పలేక ఊరికే ఉన్నాం. ముడిసరుకుల రేటు ఇంతకుముందు కంటే పెరిగింది. 3,500 వరకు పెట్టాల్సి వస్తోంది. ఒక మగ్గానికి 50 వేల పెట్టుబడి అవుతుంది. ఇంత పెట్టి చీరలు నేస్తే, ఎక్కువ ధరలకు కొనేవాళ్లు లేరు. చాలా ఇబ్బందుల్లో పడుతున్నాం. రైతులతో పాటు చేనేత కార్మికులదీ ఇదే పరిస్థితి.
-మీనాక్షి, మరో నేత కార్మికురాలు
బంగారం వేలం వేసేశారు
ఆర్టిజాన్ కార్డు ఉన్నా, బంగారం కుదువపెట్టి బ్యాంకులో రుణం తీసుకున్నాను. కానీ రుణమాఫీతో ఆ బంగారం బయటకు రాకపోగా.. వేలం వేసేస్తామంటూ నోటీసులు ఇచ్చారు. వేలం పోగా, నేనే ఇంకా వడ్డీ బాకీ ఉన్నానని.. అది కట్టాలని బ్యాంకు వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. చేనేత లోన్ పెట్టుకుంటే 20 బ్యాంకుల చుట్టూ తిరిగినా ఇంకా పెండింగ్ పెట్టారు. డబ్బు అన్నా కట్టాలని.. లేకపోతే వార్డు టీడీపీ నాయకుడితో మాట చెప్పిస్తే రుణం ఇస్తారన్నారు.
-గోపాల్, చేనేత కార్మికుడు, ధర్మవరం