పార్టీని ఏం చేయాలనుకుంటున్నారు | Chandrababu fires on TDP district leaders | Sakshi
Sakshi News home page

పార్టీని ఏం చేయాలనుకుంటున్నారు

Published Mon, Mar 6 2017 12:08 AM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM

పార్టీని ఏం చేయాలనుకుంటున్నారు - Sakshi

పార్టీని ఏం చేయాలనుకుంటున్నారు

టీడీపీ జిల్లా నాయకులపై చంద్రబాబు ఫైర్‌

అధికారంలో ఉన్నా తిరుగుబాట్లు ఎందుకు వస్తున్నాయని నిలదీత
అభ్యర్థుల ఎంపికలో తప్పు చేశామా అని అంతర్మథనం
అభ్యర్థులు ముగ్గురూ దూసుకుపోలేక పోతున్నారని సీఎం అసహనం
సునాయసంగా గెలిచే వాతావరణాన్ని నాశనం చేశారని మండిపాటు
మూడూ గెలవకపోతే మీ సంగతి చూస్తానని ఆగ్రహం


సాక్షి ప్రతినిధి, నెల్లూరు : స్థానిక సంస్థల, పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాల అభ్యర్థుల ఎంపికలో తప్పు చేశామా..? అని తెలుగుదేశంపార్టీ హైకమాండ్‌ అంతర్మథనంలో పడింది. పార్టీ అధికారంలో ఉన్నా స్థానిక సంస్థల ఓటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతోపాటు తిరుగుబాట్లు కూడా చోటు చేసుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అసహనంతో ఉన్నారు. నల్లేరు మీద నడకే అనుకున్న మూడు ఎమ్మెల్సీల స్థానాల్లో ఎదురీదాల్సిన పరిస్థితులు ఎదురుకావడంతో చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్‌ నేరుగా రంగంలోకి దిగారు.

శనివారం వారు మంత్రి నారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర, పొలిట్‌ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డితో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.  జిల్లాలో వైఎస్సార్‌సీపీ ఆధిపత్యాన్ని కట్టడి చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలు, పార్టీకోసం పనిచేసేవారిని తొక్కేయడం లాంటి చర్యల కారణంగా జిల్లాలో పార్టీ పరువు పోయే పరిస్థితి తెచ్చారని చంద్రబాబు, లోకేష్‌ జిల్లా నాయకుల మీద మండిపడ్డారు. స్థానిక సంస్థల అభ్యర్థి ఎంపిక కోసం నిర్వహించిన ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో ఆదాల ప్రభాకర్‌రెడ్డికి మొదటి స్థానం వచ్చినా మంత్రి నారాయణ గెలుపు బాధ్యతలు తీసుకుంటానని ముందుకు రావడంతోనే వాకాటి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశామని, ఇప్పుడు పరిస్థితి మొత్తం రివర్స్‌ అయిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్‌ నివేదికల్లో కూడా మూడు స్థానాల్లో ఎదురీత తప్పదనే సమాచారం వచ్చిందని, ఇంత మంది నాయకులు ఉండి పార్టీకి ఈ గతి పట్టించారని అసహనం వ్యక్తం చేశారు.

నాయకులు విఫలం
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో 158 మంది ఓటర్లు మెజార్టీ ఉన్నా వైఎస్సార్‌సీపీ దూకుడు తట్టుకోలేకపోతున్నారని పార్టీ నాయకులు స్థానిక సంస్థల ఓటర్లను నిలుపుకోవడంలో తీవ్రంగా విఫలమయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయగిరి బిట్‌–1 ఎంపీటీసీ ఎస్‌కే ముర్తుజా హుసేన్‌ శనివారం టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరుతున్నా పసిగట్టలేకపోయారని అసహనం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు ముగ్గురు అభ్యర్థుల మధ్య ఏమాత్రం సమన్వయం లేదని, ఎవరిపాటికి వారు ప్రచార ఆర్భాటం చేసుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో పనిచేయడంలేదని చంద్రబాబు నాయకుల మీద మండిపడ్డారు.

ఎంపీటీసీ సభ్యులు, పట్టభద్రుల ఓటర్లకు అభ్యర్థులు ఖర్చులకు కూడా డబ్బులు సర్దుబాటు చేయడంలేదని ఫిర్యాదులు వచ్చాయని, ఇలా అయితే ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారని నాయకులకు చంద్రబాబు తల అంటారు. కోవూరు నియోజకవర్గంలో ప్రారంభమైన తిరుగుబాట్లు సూళ్లూరుపేట, ఆత్మకూరు నియోజకవర్గాలకు కూడా వ్యాపించాయని సోమవారం నాటికి ఈ పరిస్థితులన్నీ సర్దుబాటు చేయకపోతే తానే నెల్లూరుకు వచ్చి కూర్చుంటానని హెచ్చరించారు. మీరంతా కలసి పార్టీని ఏ గతి పట్టించాలనుకుంటున్నారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.

కార్యకర్తలు, పార్టీ సీనియర్‌ నాయకులు ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కప్పి పెట్టి ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు పార్టీని ముంచేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మూడు ఎన్నికలు ఒకేసారి జరుగుతుండడంతో సమన్వయం లోపించిందని, దీనికి తోడు ఎవరికి వారు ఇది తమకు సంబంధంలేని ఎన్నికలు అనే భావంలో ఉన్నారని చంద్రబాబు చెప్పారు. చేతిలో అధికారం ఉండి అధికారులను ఉపయోగిం చుకునే అవకాశం ఉన్నా ఎందుకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయని ప్రశ్నించారు. శుక్రవారం ఆత్మకూరులో నిర్వహించిన అభ్యర్థి పరిచయ కార్యక్రమానికి గూటూరు కన్న బాబు మద్దతుదారులైన ఎంపీటీసీ సభ్యులు డుమ్మా కొట్టడం ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు పంపుతుందని నిలదీశారు.

చంద్రబాబు  సీరియస్‌
కోవూరు, ఆత్మకూరు, సూళ్లూరుపేట, గూడూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో టీడీపీకి చెందిన అనేక మంది ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ వైపు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్‌ సమాచారం అందిందని, అదే జరిగితే అందరి సంగతి తేలుస్తానని చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. ఓటర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జీలదేనని, సమస్యలు ఏమైనా ఉంటే ఎన్నికల తర్వాత మాట్లాడుకుందామని చెప్పారు. మంత్రి నారాయణ ఉపాధ్యాయులు, పట్టభధ్రుల ఎన్నికలు, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను సమన్వయం చేసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు.

ఏం చేసైనా సరే మూడు స్థానాల్లో గెలవకపోతే ఈ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ మీద పడుతుందనే విషయం గుర్తించుకుని పనిచేయాలని హెచ్చరించారు. అభ్యర్థులు ముగ్గురు ఆశించిన స్థాయిలో దూసుకుపోలేకపోతున్నారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ జిల్లా నాయకులకు వివరించారు. ప్రతిరోజూ ఉదయం నాయకులందరితో సీఎం, తాను మాట్లాడుతామని లోకేష్‌ చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement