
బాబు దెబ్బకు నలిగిపోతున్న 'ఉండవల్లి'
సెప్టెంబర్ కరెంట్ బిల్లు రూ.1,10,905
బ్యారేజీ నుంచి నివాసం దాకా 215 వీధిలైట్లు
బిల్లులు చెల్లించలేని దుస్థితిలో పంచాయతీ
గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు జిల్లా ఉండవల్లి పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసుకున్న నివాసం ఆ పంచాయతీకి ఆర్థిక భారాన్ని మోపుతోంది. అసలే అంతంత మాత్రం ఆదాయం కలిగిన ఆ పంచాయతీ.. సీఎం కారణంగా నెలకు రూ.లక్ష పైనే విద్యుత్తు చార్జీలను చెల్లించాల్సి వస్తోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి సీఎం నివాసం వరకు ఏర్పాటు చేసిన 215 వీధిలైట్లకు సెప్టెంబర్ కరెంటు బిల్లు రూ.1,10,905 వచ్చింది. 20 వేల జనాభా కలిగిన ఉండవల్లి పంచాయతీకి సాలీనా రూ.కోటి వరకు ఆదాయం లభిస్తోంది.
ఇంటిపన్ను, నీటి పన్నుల రూపంతో రూ.24 లక్షలు, ఇసుక రీచ్‌ల నుంచి సీనరేజి రూపంలో రూ.70 లక్షల ఆదాయం లభిస్తోంది. పారిశుధ్యం, ఇతర పనులు చేస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు నెలకు రూ.2.40 లక్షల వేతనాలు చెల్లిస్తోంది. మిగిలిన నిధులను మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగిస్తున్నారు. ముఖ్యమంత్రి ఉండవల్లి పంచాయతీ పరిధిలోని కృష్ణానది కరకట్ట పక్కనే నివాసం ఏర్పాటు చేసుకోవడంతో భద్రత కారణాల రీత్యా ప్రకాశం బ్యారేజి నుంచి నివాసం వరకు వీధిలైట్లను ఏర్పాటు చేశారు. రాత్రి సమయాల్లో ఈ లైట్లన్నింటినీ వినియోగించడంతో సెప్టెంబర్‌లో కరెంటు బిల్లు తడిసి మోపెడైంది.