
మహానాడులో నేనూ ఓ కార్యకర్తనే: చంద్రబాబు
తిరుపతి : టీడీపీ మహానాడులో తాను కూడా ఓ సాధారణ కార్యకర్తనే అని ఆపార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పుట్టినరోజు తెలుగు జాతికి పండుగ రోజు అని ఆయన పేర్కొన్నారు. తెలుగు జాతి గుండెల్లో ఉన్న ఏకైక నేత ఎన్టీఆరే అని అన్నారు. శుక్రవారం తిరుపతిలో జరుగుతున్న మహానాడులో చంద్రబాబు ప్రసంగిస్తూ... 'పార్టీలో నేనే మొట్టమొదటి క్రమశిక్షణ గల కార్యకర్తను. సొంత కుటుంబం కంటే ఎక్కువగా పార్టీ చూసుకుంటున్నాను.
పార్టీ జెండా మోసిన కార్యకర్తలందరికీ పాదాభివందనం. టీడీపీ కార్యకర్తలు చేసుకునే ఏకైక పండుగ మహానాడు. టీడీపీ అంటేనే త్యాగాలకు మారుపేరు. పేదలు, బడుగు, బలహీన వర్గాలకు, మహిళల అభ్యున్నతికి టీడీపీ కృషి చేస్తోంది. 35 సంవత్సరాలుగా తెలుగు జాతి గుండెల్లో పెట్టుకుని అభిమానిస్తున్నారంటే ఎన్టీఆర్ వల్లే. ఎన్నో జెండాలు, పార్టీలు వచ్చాయి. జెండాలు పీకేశారు. పార్టీలు చరిత్రలో కలిసిపోయాయి. లోక్సభలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించిన ఏకైక ప్రాంతీయ పార్టీ టీడీపీనే.
దేశంలో మొదటిగా కిలో రెండు రూపాయలకు బియ్యం ఇచ్చిన ఘనత ఎన్టీఆర్దే. ప్రపంచ పటంలో హైదరాబాద్ను పెట్టిందే టీడీపీ. హైదరాబాద్ను ఉద్యోగాలు కల్పించే నగరంగా తీర్చిదిద్దాం. ఏపీని నెంబర్ వన్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నా. విభజన ఇబ్బందులు ఎదుర్కొనేందుకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. విద్యాపరంగా ముందుకు వెళితేనే బ్రహ్మాండమైన అభివృద్ధి. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసుకోవాలి. రాయలసీమను రతనాల సీమగా మార్చుతాం. పట్టిసీమను సకాలంలో పూర్తి చేస్తాం.' అని తెలిపారు.