చంద్రబాబుకు కన్నీళ్లు రప్పించండి | chandrababuku nanneellu rappinchandi | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు కన్నీళ్లు రప్పించండి

Published Fri, Oct 14 2016 1:13 AM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM

చంద్రబాబుకు కన్నీళ్లు రప్పించండి

చంద్రబాబుకు కన్నీళ్లు రప్పించండి

భీమవరం :‘మీరెవరూ అధైర్య పడకండి. పోలీస్‌ దౌర్జన్యాలను.. సర్కారు గూండాగిరికి భయపడి కన్నీరు పెట్టకండి. ఇదే ఉద్యమ స్ఫూర్తితో ప్రభుత్వంపై పోరాడండి. చంద్రబాబుకు కన్నీళ్లు రప్పించండి’ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపీ బృందాకరత్‌ ఆక్వా ఫుడ్‌పార్క్‌ బాధిత గ్రామాల ప్రజలకు పిలుపునిచ్చారు. తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్క్‌ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ భీమవరం పాత బస్టాండ్‌లో గురువారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో గూండా రాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు. ఆక్వా పార్క్‌ నిర్మాణం వల్ల సహజ వనరులు పూర్తిగా దెబ్బతింటాయని, తాగు, సాగునీటి వనరులు కలుషితమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల తుందుర్రు సమీపంలోని సుమారు 40 గ్రామాల ప్రజలకు
ఇబ్బందులు తప్పవన్నారు. ఆక్వా పార్క్‌ నిర్మాణం కారణంగా ఆ ప్రాంత ప్రజల్లో ఆనందం కరువై జీవచ్ఛవాల్లా గడపాల్సి వస్తోందన్నారు. వేలాది మంది వ్యతిరేకిస్తున్నా ఫుడ్‌పార్క్‌ నిర్మాణం కోసం పోలీసులను ఉపయోగించి ప్రజలపై దౌర్జన్యాలు చేయడం సరికాదని ఆమె దుయ్యబట్టారు. ప్రజల అంగీకారం లేకుండా పార్క్‌ ఎలా నిర్వహించగలరని ప్రశ్నిం చారు. ఆక్వా పార్క్‌ అవసరాలకు  ప్రతిరోజు లక్ష లీటర్ల నీటిని వాడతారని, 50 వేల లీటర్ల కలుషిత నీటిని విడుదల చేస్తారని చెప్పారు. ఈ కారణంగా తాగు, సాగునీరు కలుషితమై ప్రజలకు ఇబ్బందులు తప్పవన్నారు. ఆక్వా పార్క్‌ యాజమాన్యం భూములు కొనుగోలు చేసే సమయంలో అక్కడి రైతులకు చేపల చెరువులు తవ్వుతామని నమ్మించిం దన్నారు. ఆ భూముల్లో కాలుష్యాన్ని వెదజల్లే ఆక్వా పార్క్‌ నిర్మిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు అదే యాజమాన్యానికి కొమ్ముకాయడంలో ఆంతర్యం ఏమిటని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు సాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలన కారణంగా రైతులు, రైతు కూలీలు, మత్స్యకారుల జీవనం దుర్భరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు : శేషుబాబు
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ ప్రజలను జైలులో పెట్టి ఆక్వా పార్క్‌ నిర్మించాలనుకుంటున్న ప్రభుత్వానికి వారే తగిన గుణపాఠం చెబుతారన్నారు. రాష్ట్రాభివృద్ధికి, ఫ్యాక్టరీల నిర్మాణానికి వైఎస్సార్‌ సీపీ వ్యతిరేకం కాదని, ప్రజలు వ్యతిరేకిస్తున్న తుందుర్రు ఆక్వాఫుడ్‌ పార్క్‌ను వేరే ప్రాంతానికి తరలించాలని కోరారు. పార్టీ నాయకుల బృందం ఆక్వా పార్క్‌ ప్రభావిత గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుకుందని, అక్కడి పరిస్థితులను పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లిందని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎండీ రఫీయుల్లాబేగ్‌ మాట్లాడుతూ  ఇప్పటికే ఇసుక మాఫియగా తయారైన టీడీపీ నేతలు ఫ్యాక్టరీల పేరిట మరింత దోచుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఐద్యా రాష్ట్ర కార్యదర్శి ఎం.లక్ష్మి మాట్లాడుతూ గోదావరి జిల్లాల ప్రజలు చుట్టూ నది ప్రవహిస్తున్నా తాగునీరు కొనుక్కోవాల్సిన దుస్థితిలో ఉన్నారని.. పర్యావరణానికి హాని కలిగించే ఆక్వా పార్క్‌ వంటివి నిర్మిస్తే రానున్న రోజుల్లో ఆక్సిజన్‌ కూడా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. సభకు అధ్యక్షత వహించిన సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బల రామ్‌ మాట్లాడుతూ ఆక్వా పార్క్‌ ప్రభుత్వ వాటాతో నిర్మిస్తున్నట్టు అసత్య ప్రచారం చేస్తున్నారని, దీని ఒప్పంద పత్రంలో ప్రైవేట్‌ కంపెనీ అని స్పష్టంగా ఉందని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి, ప్యాక్టరీల నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, ప్రజల జీవనాన్ని చిన్నాభిన్నం చేసే ఫుడ్‌పార్క్‌ను జనావాసాలు లేని ప్రాంతాలకు తరలించాలని డిమాండ్‌ చేశారు. తుందుర్రులో ఆక్వా పార్క్‌కు బదులుగా ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆక్వా పార్క్‌ ప్రభావిత గ్రామాల్లో 144 సెక్షన్, పోలీస్‌ శిబిరాలను, నిర్బంధాలను తక్షణమే తొలగించి ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని కోరారు. ఫుడ్‌పార్క్‌ నిర్మాణం నిలిపివేసేవరకు పోరాటం ఆగదన్నారు. బహిరంగ సభలో వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పేరిచర్ల విజయనరసింహరాజు, భీమవరం, నరసాపురం మునిసిపాలిటీల్లో వైఎస్సార్‌ సీపీ ఫ్లోర్‌ లీడర్స్‌ గాదిరాజు వెంకట సత్యసుబ్రహ్మణ్యంరాజు (తాతరాజు), ద్వారా సాయినాథ్‌ ప్రసాద్, సీపీఐ నాయకురాలు పెన్మెత్స దుర్గాభవాని, ఎంసీపీఐ నాయకుడు శానంపూడి నాగరాజు, సీపీఎం రాష్ట్ర నాయకురాలు డి.రమాదేవి, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గన్నాబత్తుల సత్యనారాయణ, మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొల్లాటి శ్రీనివాస్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు డి.కల్యాణి, తుందుర్రు ఎంపీటీసీ జవ్వాది వెంకటరమణ, నాయకులు గంగరాజు, పెందుర్తి దుర్గాభవాని, జేఎన్‌వీ గోపాలన్‌ పాల్గొన్నారు.
భారీగా తరలివచ్చిన జనం
బహిరంగ సభకు భీమవరం, మొగల్తూరు, నరసాపురం, వీరవాసరం మండలాల నుంచి పెద్దసంఖ్యలో జనం తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలు ఆటోలు, వ్యాన్లు వంటి వాహనాలపై చేరుకున్నారు. ఆక్వా పార్క్‌ ప్రభావిత ప్రాంతాల నుంచి మహిళలు చంటిబిడ్డలతో హాజరుకావడంతో ఆక్వా పార్క్‌ నిర్మాణంపై ప్రజల నుంచి ఏ మేరకు వ్యతిరేకత ఉందో అవగతమవుతోందనే వ్యాఖ్యలు వినిపించాయి.
మహిళలతో మమేకమైన బృందాకరత్‌
బృందాకరత్‌ బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకున్న వెంటనే సభకు హాజరైన మహిళల వద్దకు వెళ్లి వారితో మమేకమయ్యారు. వారు ఎదుర్కొం టున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మహిళలు అధైర్యపడవద్దని, తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement