రవాణాశాఖలో దిద్దుబాటు చర్యలు
– అవినీతి ఆరోపణల నేపథ్యంలో నంబర్ ప్లేట్ల విభాగం మూసివేత
అనంతపురం సెంట్రల్ : రోడ్డు రవాణాశాఖ ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. రవాణా వ్యవస్థ మొత్తం ఆన్‌లైన్ అవుతున్నా అవినీతి ఆరోపణలు మాత్రం తగ్గలేదు. దీంతో అవినీతికి కళ్లెం వేసేందుకు పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల ఏఎంవీఐ సంతకం ఫోర్జరీతో వాహనాలను విడుదల చేశారనే కారణంతో ఓ హోంగార్డును పోలీసు శాఖకు సరెండర్ చేశారు. దీంతో ఆ శాఖ ఉద్యోగుల్లో మొత్తం కలవరం మొదలైంది. తాజాగా కార్యాలయ ఆవరణలో నంబర్ ప్లేట్ల విభాగాన్ని బయటకు తరలించాలని నిర్ణయించారు. దీంతో గురువారం ఆ కార్యాలయం తలుపులు తెరుచుకోలేదు. నిబంధనల ప్రకారం వాహన రిజిస్ట్రేషన్ తర్వాత నంబర్ ప్లేట్లను వాహనదారులు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రభుత్వానికి చెల్లించే రిజిస్ట్రేషన్ ఫీజులోనే నంబర్ ప్లేట్స్ కూడా వాహనదారులు చెల్లించి ఉంటారు. ప్లేట్లు అమర్చేటప్పుడు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. రూ.50 నుంచి రూ.300 వరకూ వాహనం ఆధారంగా తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓ ప్రైవేటు కంపెనీ దీని టెండర్‌ను దక్కించుకుంది. దీంతో ఆ అంశం మాది కాదు అనే భావన వ్యక్తం చేశారు. అయితే వాహనదారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తుండటంతో కొంతమంది సమాచార హక్కు చట్టం ద్వారా రవాణాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో నంబర్ ప్లేట్ల విభాగాన్ని బయటకు తరలించాలని నెలాఖరు వరకూ గడువు విధించారు.