విమానాశ్రయ భూసేకరణ గందరగోళం
దగదర్తి:
దగదర్తి మండలం కొత్తపల్లి కౌరుగుంటలో విమానాశ్రాయ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కోసం ఏర్పాటు చేసిన గ్రామసభ ఆదివానం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జాబితాల్లో తప్పిదాలు, అధికారుల అవకతవకలతో గ్రామస్తుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. దామవరం వద్ద విమానాశ్రయ నిర్మాణం అవసరమై భూసేకరణ కోసం కొత్తపల్లి కౌరుగుంటలోని 335 సర్వేనంబర్‌లో 119మంది రైతుల నుంచి 153.80 ఎకరాల భూమి కోసం అధికారులు కౌరుగుంటలో గ్రామసభ ఆదివారం ఏర్పాటు చేశారు. తహసీల్దార్ వై.మధుసూదన్‌రావు ఆధ్వర్యంలో గ్రామసభ ప్రారంభించిన వెంటనే లబ్ధిదారులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అధికారులు తొలుత ప్రకటించిన జాబితాలకు, తాజాగా విడుదల చేసిన జాబితాలకు పొంతన లేదంటూ అధికారులపై ధ్వజమెత్తారు. మరోవైపు రెవెన్యూ రికార్డుల్లో తమ పేర్లు ఉంటే జాబితాల్లో మరొకరి పేర్లు ఉన్నాయంటూ మరికొంత మంది వాదనకు దిగారు. అభ్యంతరాలు వ్యక్తమైన భూములను పెండింగ్‌లో ఉంచి విచారణ నిర్వహిస్తామని హామీ ఇవ్వడంతో లబ్ధిదారులు శాంతించారు.
ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల పేర్లు తొలగింపుపై ఆందోళన
కొత్తపల్లి కౌరుగుంట సర్వేనంబర్ 335లో 40 మంది లబ్ధిదారుల పేర్లు తొలగింపుపై బాధితులు,ప్రజా సంఘాల నాయకులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. 1978లో ఒక్కో కుటుంబానికి రెండెకరాల వంతున 84 మందికి భూమిని పంపిణీ చేశారని, వీరిలో ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా అధికారులు 40 మంది పేర్లు తొలగించి అనర్హులు, స్థానికేతరుల పేర్ల చేర్చారని ధ్వజమెత్తారు.అధికారులు బాధితుల నుంచి అర్జీలు స్వీకరించి పరిశీలిస్తామని తహశీల్దార్ వై.మధుసూదన్‌రావు హామీ ఇచ్చారు.