మోసం తీసిన ప్రాణం
Published Wed, Nov 30 2016 11:03 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
- అప్పు తీసుకుని తిరిగివ్వని బంధువు
- మనస్తాపంతో రుణగ్రహీత ఇంట్లోనే ఆత్మహత్య
- డబ్బు ఇచ్చేంత వరకు మృతదేహాన్ని తీసుకెళ్లమంటున్న కుటుంబీకులు
పత్తికొండ: సొంత బంధువు నమ్మకంగా తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వనందుకు ఓ వ్యక్తి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆలూరు మండలం పెద్ద హోతూరు గ్రామానికి చెందిన కురువ మల్లికార్జున (40) వద్ద నాలుగేళ్ల క్రితం తుగ్గలి మండలం మారెళ్ల గ్రామానికి చెందిన అతని చిన్నాన్న కుమారుడు అశోక్ జేసీబీ కొనుగోలు చేసేందుకు రూ. 3.50 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. జేసీబీ కొనుగోలు చేసి కొంత సంపాదించాడు. ఏడాది క్రితం మల్లికార్జునకు తెలియకుండా జేసీబీ అమ్మేశాడు. ఆ తర్వాత అప్పు తిరిగి ఇవ్వమని మల్లికార్జున పలుమార్లు కోరినా అశోక్ ఇవ్వకుండ దాటవేశాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం అప్పు వసూలు చేసేందుకు మల్లికార్జున మారెళ్లకు చేరుకున్నాడు. డబ్బు ఇస్తేనే పోతానంటూ నిలదీశాడు. అయితే అప్పు ఇవ్వలేమని ఆశోక్‌తో పాటు అతని తల్లిదండ్రులు తేల్చీ చెప్పారు. దీంతో జీర్ణించుకోలేని మల్లికార్జున అక్కడే పురుగు ముందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతడిని పత్తికొండ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని మృతుడి కుటుంబీకులకు సమాచారం ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆసుపత్రికి చేరుకున్న కుటుంబీకులు, భార్య మల్లేశ్వరి, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. అప్పు ఇవ్వకపోతే మృతదేహాన్ని మారెళ్లకు తీసుకెళ్తామని మృతుడి బంధువులు పూజారి హనుమంతు, హోటల్ పరమేష్, తిక్కయ్య, విశ్వనాథ్, రామప్ప, నల్లన్న తేల్చీచెప్పారు. పోస్టుమార్టం చేయకపోవడంతో మృతదేహం ఆసుపత్రిలోనే ఉంది. ఇరువర్గాల పెద్దలు ఈ విషయంపై చర్చలు జరుపుతున్నారు.
ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తాం: కేశవులు, తుగ్గలి ఎస్‌ఐ
ఇంతవరకు మృతుడి మల్లికార్జున బంధువులు ఫిర్యాదు చేయలేదు. ఎవరైన ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తాం. విషయం తెలుసుకొని ఆసుపత్రికి వెళ్లాం. మృతుడి తరుపు ఎవరు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు.
Advertisement
Advertisement