ఖాతాదారుణ్ణి నమ్మించి డబ్బు అపహరణ
Published Sat, Oct 8 2016 2:06 AM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM
ద్వారకాతిరుమల : స్థానిక ఆంధ్రాబ్యాంకు బ్రాంచిలో డబ్బు డిపాజిట్ చేసేందుకు వచ్చిన ఓ ఖాతాదారుడిని ఇద్దరు ఘరానా మోసగాళ్లు మాటలతో నమ్మించి మోసం చేశారు. శుక్రవారం జరిగిన ఈ తతంగమంతా బ్యాంకు సీసీ కెమేరాలో రికార్డయింది. బాధితుడి కథనం ప్రకారం.. ద్వారకాతిరుమలకు చెందిన మారగాని హరిబాబు స్థానిక ఒక బ్రాందీ షాపులో సర్వర్. అతను శుక్రవారం మధ్యాహ్నం రూ. 23 వేలను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వచ్చాడు. ఎలా డిపాజిట్ చేయాలో తెలీక బ్యాంకు బయట వేచి ఉండగా, ఇద్దరు అక్కడకు వద్దకు వచ్చారు. దీంతో హరిబాబు తన వద్ద ఉన్న రూ. 23 వేలను వారికి ఇచ్చి బ్యాంకులో ఫారాలు పూర్తిచేసి, డిపాజిట్ చేయాలని కోరాడు. దీంతో వారిలో ఒక వ్యక్తి తాను బ్యాంకు ఉద్యోగినేనని చెప్పి బాధితుడిని నమ్మించాడు. ఫారాలు పూర్తిచేసి.. పాస్ బుక్ జిరాక్సు తీయించుకురావాలని హరిబాబును బయటకు పంపాడు. ఈ తర్వాత బ్యాంకు మేనేజర్ శేషగిరిరావు వద్దకు వెళ్లి తాను రూ.10 లక్షలు డిపాజిట్ చేస్తానని మాటల్లోపెట్టి టేబుల్‌పై ఉన్న బ్యాంకు రబ్బరు స్టాంపును దొంగిలించాడు. ఆ తరువాత ఖాతాదారునికి ఇవ్వాల్సిన రసీదులపై స్టాంపుతో ముద్రలు వేసి సంతకం చేశాడు. ఇంతలో అక్కడకు వచ్చిన హరిబాబుకు ఆ రసీదులను ఇచ్చి, పని అయిపోయిందని చెప్పాడు. దీనిని నమ్మిన బాధితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ వెంటనే ఆ మోసగాళ్లు అక్కడి నుంచి జారుకున్నారు. కొద్దిసేపటి తరువాత హరిబాబు మళ్లీ బ్యాంకుకు వచ్చి, పాస్‌బుక్‌లో పోస్టింగ్ వేయించుకున్నాడు. సొమ్ములు జమ కాలేదని సిబ్బంది చెప్పడంతో హరిబాబు లబోదిబోమంటూ బ్యాంకు మేనేజర్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బ్యాంక్ మేనేజర్ శేషగిరిరావు సీసీ కెమేరాలను పరిశీలించగా, మోసం వ్యవహారమంతా అందులో రికార్డయింది.
Advertisement
Advertisement