నిందితుడు దేముడు
ఘోషాస్పత్రిలో ఘటన
విజయనగరంఫోర్ట్: పారితోషికం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించిన ఓ మోసగాడిని ఘోషాస్పత్రి సెక్యూరిటీ గార్డు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే ఘోషాస్పత్రిలో గంట్యాడ మండలం మధుపాడ గ్రామానికి ఓ గర్బిణి రెండు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరి మంగళవారం ప్రసవించింది. విషయం తెలుసుకున్న గంట్యాడ మండలం కొర్లాం గ్రామానికి చెందిన రంభదేముడు అనే వ్యక్తి గర్బిణి భర్త దగ్గరకు వెళ్లి తనకు డాక్టర్ తెలుసనీ... పారితోషికంగా రూ. 36వేలు ఇప్పిస్తాననీ.. అందుకు అధార్ కార్డు, బ్యాంకు ఖాతా, రేషన్ కార్డు జెరాక్సులు, రూ.1800 కట్టాలని చెప్పాడు. వాటిని నమ్మి డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆస్పత్రి ద్వారం వద్ద సెక్యూరిటీ గార్డు దేముడును అడ్డుకున్నారు. గత నెల 16వతేదీన కూడా దేముడు ఓ రోగి బంధువు నుంచి ఇదే మాదిరిగా రూ. 2500 దండుకుని పరారయ్యాడు. అది సీసీ కెమెరాలో రికార్డు అయింది. అదిగమనించి సెక్యూరిటీ గార్డు పట్టుకుని రెండవ పట్టణ పోలీసులకు అప్పగించారు. ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ రవిచంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘోషాస్పత్రిలో రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తామన్నారు. ఏ ఒక్కరికి డబ్బు చెల్లించనవసరం లేదనీ, అపరిచిత వ్యక్తులు డబ్బులు అడిగితే 8008553404, 8008553390 సెల్ నంబర్లకు ఫోన్ చెయ్యాలని డిప్యూటీ సూపరింటెండెంట్ తెలిపారు.