మోసం..చంద్రబాబు నైజం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి
ఆత్మకూరు: ప్రజలను మోసగించడమే సీఎం చంద్రబాబు నైజమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు. రైతు భరోసా యాత్ర సందర్భంగా ఆత్మకూరు పట్టణం గౌడు సెంటర్లలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తప్పుడు హామీలతో రాష్ట్ర ప్రజలను టీడీపీ అధినేత మోసగించి అధికారం దక్కించుకున్నారన్నారు. రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టులను దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేసి 80శాతం పూర్తి చేస్తే.. తాను పూర్తిచేశానని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. జిల్లాలోని పలు ప్రాజెక్టులతో పాటు ఎత్తిపోతల పథకాలన్నీ వైఎస్ రాజశేఖరరెడ్డి చలువేనన్నారు. టీడీపీ నేతలు ఈ విషయాన్ని మరువరాదన్నారు.
చంద్రబాబు పాలనలో కరువు
చంద్రబాబు పాలన అంటేనే కరువు అని వైఎస్సార్‌సీపీ పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత అన్నారు. గతంలో చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో కరువు కాటకాలతో రైతులు తల్లడిల్లారని గుర్తుచేశారు. మళ్లీ మూడేళ్లలోగా అదే పరిస్థితులు పునరావృతమయ్యాయన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసగించారని, వడ్డీ రుణాల పేరుతో మహిళలను ఆర్థికంగా చిదిమేశారన్నారు. పొదుపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి కేవలం రూ. 3వేలు మాత్రమే ఇవ్వడం సిగ్గు చేటన్నారు. విద్యార్థులను, ఉద్యోగులను మోసగించిన చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు.
పార్టీ మారడం సిగ్గుచేటు
వైఎస్సార్‌సీపీ జెండాపై గెలిచిన కొందరు నాయకులు.. టీడీపీ ప్రభోలాలకు లొంగి డబ్బులకు అమ్ముడుబోయి మరో పార్టీలో చేరడం హేయమైన చర్య అని ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అన్నారు. గౌడ్ సెంటర్‌లోని బహిరంగ సభా ప్రాంగణంలో మాట్లాడుతూ పార్టీలు ఫిరాయించడం ప్రజలను మోసగించడమేనన్నారు. వైఎస్సార్‌సీపీ అంటే పాండవుల లాంటి పార్టీ అనానరు. పాండవులు పరిపాలిస్తే కరువు కాటకాలు లేకుండా ప్రజలు సుఖశాంతులతో జీవిస్తారన్నారు. కానీ రాష్ట్రంలో కౌరవుల పాలన ఉండడం వల్ల కరువు కాటకాలతో తల్లడిల్లుతున్నారన్నారు. టీడీపీ పాలనకు చమరగీతం పాడాలని పిలుపునిచ్చారు.
భవిష్యత్ వైఎస్సార్‌సీపీదే
టీడీపీ పాలనకు ప్రజలు చమర గీతం పాడాలని డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజారెడ్డి పిలుపునిచ్చారు. భవిష్యత్ వైఎస్సార్‌సీపీదేనన్నారు. అర్హులందరికీ వృద్ధాప్య పింఛన్లు, పక్కాగృహాలు అందాలంటే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావాలన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తేనే పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. రాష్ట్ర ప్రజలు మంచి పాలన కావాలంటే అది వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమన్నారు.