పార్సిల్‌లో వచ్చిన బొమ్మలు చూపుతున్న బాధితుడు రమేష్
♦ రూ.4వేలు కడితే రూ.16వేల ఫోన్ ఇస్తామంటూ ఫోన్
♦ రేకుల బొమ్మలు రావడంతో ఖంగు తిన్న గిరిజనుడు
ఉప్పరగూడెం(కురవి): ‘మీ సెల్ నంబర్‌కు బంపర్ ప్రైజ్ వచ్చింది... డ్రాలో మీరు ఈ బహుమతి గెలుచుకున్నారు’ అంటూ వచ్చిన ఫోన్‌తో ఉబ్బితబ్బిబ్బయ్యాడు ఓ గిరిజనుడు.. ఆ తర్వాత ఫోన్ చేసిన వ్యక్తి మాటన్నీ నమ్మేశాడు. ఇంకేం ఆయన చెప్పినట్లుగా డబ్బులు కట్టగా బహుమతి మాటేమో కానీ.. ఇనుపు రేకుతో చేసిన ప్రతిమలు ఉండడంతో మోసపోయానని గుర్తించాడు. ఈ మేరకు వివరాలిలా ఉన్నాయి.
కురవి మండలంలోని ఉప్పరగూడెం శివారు తుకా తండాకు చెందిన బానోతు రమేష్ ఫోన్‌కు ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి ఫోన్(9136160142) చేశాడు. ‘మీ నంబర్ డ్రాలో వేశాం.. బంపర్‌ప్రైజ్ వచ్చింది.. రూ.18వేల సామ్‌సంగ్ ఫోన్ బహుమతిగా ఇవ్వనున్నాం.. దీని కోసం రూ.4వేలు చెల్లించాల్సి ఉంటుంది’ అని నమ్మబలికారు. అయితే, రూ.4వేలకు రూ.16వేల ఫోన్ ఇస్తారా అని రమేష్ ప్రశ్నిస్తే ‘డ్రాలో మీ నంబర్ వచ్చింది కాబట్టి బహుమతిగా ఇస్తున్నాం’ అని ఆగంతకుడు చెప్పాడు. దీంతో రమేష్ అంగీకరించాడు. ఈ మేరకు బుధవారం పోస్టాఫీస్‌కు రమేష్ పేరుపై ఒక పార్సిల్ వచ్చింది. పోస్ట్‌మెన్‌కు రూ.4వేలు చెల్లించి ఆ పార్సిల్ తీసుకున్న రమేష్ తెరిచి చూడగా నాలుగు ఇత్తడి రంగులో ఉన్న రేకుల బొమ్మలు కనిపించాయి. ఒకటి తాబేలు, శ్రీచక్రం, లక్ష్మీదేవి, పాదుకల బొమ్మలు ఉండడంతో ఖంగు తిన్న రమేష్ తాను మోసిపోయినట్లు గుర్తించాడు. ఈ మేరకు తనను మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని రమేష్ కోరారు.