రుణ మాఫీ చేయిస్తామంటూ..
వృద్ధ దంపతులకు మాయమాటలతో వల
నగదుతో ఉడాయించిన అగంతకులు
నరసరావుపేట టౌన్: రుణమాఫీ నగదు ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి ఓ ప్రబుద్ధుడు వృద్ధ దంపతులకు టోకరా వేసి నగదుతో ఉడాయించిన ఘటన శనివారం పట్టణంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. యద్దనపూడి మండలం అనంతారం గ్రామానికి చెందిన రావి వెంకటాద్రికి మెడ భాగంలో నొప్పిగా ఉండటంతో చికిత్స చేయించుకొనేందుకు శనివారం ప్రకాష్ నగర్ ఓవర్‌బ్రిడ్జి సెంటర్ వద్ద ఉన్న ఓ ప్రై వేటు వైద్యశాలకు భార్య వెంకాయమ్మతో కలసి వచ్చాడు. వైద్య పరీక్షల అనంతరం హాస్పటల్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఓ గుర్తు తెలియని యువకుడు వచ్చి అనంతారం గ్రామానికి చెందిన కొంతమందికి రుణమాఫీ నగదు వచ్చాయని తనతోపాటు బ్యాంక్ వద్దకు వస్తే నగదు ఇప్పిస్తానని న మ్మబలికాడు. గ్రామంలోని కొంతమంది పేర్లు చెప్పడంతో నిజమేనని నమ్మిన ఆ దంపతులు అతని వెంట బ్యాంక్‌కు వెళ్ళేందుకు పయనమయ్యారు. మార్గమధ్యంలో పాత కన్యల హాస్పటల్ వద్దకు వెళ్ళే సరికి దరఖాస్తు ఫారాలు, స్టాంప్‌లు కొనుగోలు చేసి తీసుకొస్తాను.. అప్పటి వరకు అక్కడే ఉండమని చెప్పి వారి వద్ద రూ.1,650 నగదు తీసుకొని ఉడాయించాడు. ఎంతసేపటికీ రాకపోవడంతో దారిన వచ్చేపోయే వారిని నిలిపి ఆ యువకుడి కోసం ఆరా తీయడం మొదలుపెట్టారు. చివరకు మోసపోయామని గ్రహించారు. వెంట తెచ్చుకొన్న సొమ్ము మొత్తం ఇవ్వడంతో స్వగ్రామం వెళ్ళేందుకు చార్జీకి డబ్బులు లేక లబోదిబోమంటూ రోదించడం మొదలు పెట్టారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న వైఎస్సార్ సీపీ యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు రామిశెట్టి కొండ విషయం తెలుసుకొని వృద్ధ దంపతులకు తన వంతు సాయంగా రూ. వెయ్యి ఇచ్చి స్వగ్రామం వెళ్ళేందుకు సహకరించారు.