రెండు వ్యాధులకు చెక్
►17న మీజిల్స్ రూబెల్లా టీకా పంపిణీ
►జిల్లాలో 2.72 లక్షల చిన్నారులు
పిల్లలకు వచ్చే తట్టు, రూబెల్లా వ్యాధులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం మీజిల్స్ రూబెల్లా టీకాను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో విజయవంతంకాగా.. ఈనెల 17 నుంచి మన రాష్ట్రంలో ప్రారంభించనున్నారు. ఈమేరకు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ టీకాను 9 నెలల నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకు వేయనున్నారు. జీవితంలో ఒకేసారి ఒకే మోతాదులో వేస్తారు.
కరీంనగర్‌హెల్త్: మీజిల్స్(తట్టు) ప్రాణాంతకవ్యాధి, వైరస్ ద్వారా సోకే అంటువ్యాధి. చిన్నపిల్లల్లో అత్యంత వేగంగా సోకుతుంది. సెలైవా, మ్యుకస్ వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. శ్వాసకోశాలకు ఇన్‌ఫెక్షన్ కల్గిస్తుంది. తీవ్రమైన అతిసారంతో ప్లేట్‌లేట్లు తగ్గిపోయే ప్రమాదం ఉంది. జ్వరం, వంటిపై దద్దుర్లు, కళ్లు ఎర్రబడి, తుమ్ములు, దగ్గు వస్తుంటాయి. దీని ద్వారా మనదేశంలో మూడు నిమిషాలకు ఒకరు మరణిస్తున్నారు.
రూబెల్లా
రూబెల్లా వ్యాధి చిన్న పిల్లలకే కాకుండా పెద్దవారికి సైతం వైరస్ ద్వారా సోకుతుంది. ఈ వ్యాధి వచ్చిన వారి చర్మంపై ఎర్రటి దద్దుర్లు వచ్చి, తీవ్ర జ్వరం, తలనొప్పి, కళ్లు గులాబీ రంగులోకి మారుతాయి. ఒక్కోసారి మరణం సంభవించే అవకాశాలున్నాయి. గర్భిణులకు ఈ వ్యాధి సోకితే నవజాత శిశువుకు కూడా సోకే ప్రమాదం ఉంటుంది. వినికిడిలోపం, మెదడు లోపాలు, మానసిక వైకల్యం, గుండె దెబ్బతింటాయి. కొన్ని సందర్భాల్లో గర్బస్రావం, నర్జీవ జననాలు సంభవిస్తాయి. దీనికి చికిత్స లేదు. వ్యాక్సిన్ ద్వారా మాత్రమే నివారించగలం. ఆర్థిక, సామాజిక సమస్యగా గుర్తించి 2020 వరకు అదుపు చేయాలనే ఈ టీకాను ఉచితంగా పిల్లలకు చేస్తోంది ప్రభుత్వం.
తప్పనిసరిగా వేయించాలి
గతంలో ఈ వ్యాక్సిన్ వేయించినా మళ్లీ వేయించాలని వైద్యాధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం వేసే డోసు అదనపు శక్తినిచ్చి మరింత రక్షణ కల్పింస్తుందని పేర్కొన్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టీకా తప్పనిసరిగా వేయించాలని డీఎంహెచ్‌వో రాజేశం తెలిపారు.
2,72,779మంది పిల్లలకు..
జిల్లాలో 2లక్షల 72వేల 779మంది 9నెలలు నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకు మీజిల్స్ రూబెల్లా టీకా వేయనున్నారు. 2,80,000 మందికి సరిపడేలా 30,728 ఇంజక్షన్ బుడ్లు అందుబాటులో ఉంచారు. ఈనెల 17న ప్రారంభించి ఒకే రోజు ఒకగ్రామంలో టీకా వేయనున్నారు. మొదటి రెండు వారాలు పాఠశాలలు, తర్వాత రెండు వారాలు బయట, సంచార ప్రదేశాల్లో మొబైల్ టీమ్‌ల ద్వారా వేస్తారు. ఈ కార్యక్రమంలో వేసుకోని పిల్లలను గుర్తించి ఐదో వారంలో వేయనున్నారు.
వ్యాక్సినేషన్‌కు టీమ్
మీజిల్స్ రూబెల్లా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు నలుగురు సభ్యులు టీమ్‌గా వ్యవహరిస్తారు. ఇందులో ఏఎన్‌ఎం లేదా హెల్త్‌అసిస్టెంట్, ఆశా వర్కర్, అంగన్‌వాడీవర్కర్, వలంటీర్ ఉంటారు. ఈ టీమ్‌ను వైద్యాధికారి ఆమోదించాల్సి ఉంటుంది.