రుబెల్లాతో తట్టుకు చెక్
►పిల్లల్లో ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ
►9 నెలల నుంచి 15 ఏళ్ల పిల్లలకోసం
►ఉచితంగా ఇవ్వనున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
►ఈనెల17 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభం
►విస్తృత ప్రచారం చేపడుతున్న జిల్లా వైద్యారోగ్యశాఖ
జ్యోతినగర్: ఒక్క టీకా..జీవితకాలం రక్ష. అదే ఎంఆర్ వ్యాక్సిన్. తట్టు వ్యాధి నిర్మూలనకోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కొత్త టీకాను కనిపెట్టింది. చిన్నారులకు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కల్పించేందుకు రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ను ఆగస్టు 17 నుంచి వేసేందుకు వైద్య శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. తొమ్మిదినెలల నుంచి పదిహేనేళ్లలోపు పిల్లలకు ఈ టీకా వేయనున్నారు. ఈనెల17 నుంచి ఐదు వారాలపాటు ఈ వ్యాక్సిన్ వేయనున్నారు.
మీజిల్స్ అంటే..
∙ మీజిల్స్ (తట్టు) అనేది ప్రాణాంతకమైన వ్యాధి. చిన్నారులలోని వైకల్యాలు, మరణాలకు ప్రధాన కారణాల్లో ఇది ఒక్కటి.
∙ ఇది అంటువ్యాధి. ఇది సోకిన వ్యక్తి దగ్గడం, తుమ్మడం వల్ల వ్యాపిస్తుంది.
∙ పిల్లల్లో నిమోనియా, డయేరియా, మెదడు సంక్రమణాల వంటి ప్రాణాంతక రోగాలకు మీజిల్స్ కారణమవుతుంది.
∙ ఎక్కువ జ్వరంతో కూడిన ఎర్రటి దద్దుర్లు, దగ్గు, ముక్కు కారడం, కళ్లు ఎర్రబడడం ద్వారా మీజిల్స్‌ను సాధారణంగా గుర్తించవచ్చును.
రుబెల్లా అంటే
మహిళకు గర్భం దాల్చిన తొలిదశలో రుబెల్లా ఇన్‌ఫెక్షన్ సంక్రమిస్తే ఫలితంగా కంజెనైటేల్ (పుట్టుకతో సక్రమించే) రుబెల్లా సిండ్రోమ్ సీఆర్‌ఎస్ కలగవచ్చు. అది గర్భస్త శిశువులకు, నవజాత శిశువులకు తీవ్రతరమైన ప్రాణాంతకమైన పరిణామాలను కలుగజేస్తుంది. గర్భంతో ఉన్న తొలి దశలో రుబెల్లా ఇన్‌ఫెక్షన్ సోకిన తల్లులకు పుట్టిన చిన్నారుల్లో కళ్లు బెబ్బతినడం, చెవులు, మెదడు (చిన్నసిరస్తు, బుద్దిమాంద్యాం) గుండె సంబంధిత లోపాలు కలిగే దీర్గకాలిక జన్మసిద్ధ ఇబ్బందులు తలెత్తుతాయి. రుబెల్లా సోకిన గర్భిణులకు గర్భస్త్రావం, గర్భపాతం, మృతశిశువు జన్మించడం కలగుతాయి.
ఎవరెవరికి వ్యాక్సినేషన్
∙ తేలికపాటి శ్వాస సంబంధింత ఇబ్బందులు, అతిసారం, తక్కువ గ్రేడ్ జ్వరం వంటి అస్వస్తలకు గురైన చిన్నారులకు కూడా ఈ టీకాను వేయించవచ్చు.
ఎవరికి వేయవద్దు..
∙ అధిక జ్వరం, ఇతర తీవ్రమైన వ్యాధులు, ఉదాహరణ: సృహలో లేకపోవడం, అపస్మారకంలో ఉన్న వారికి ఈ టీకాలు వేయవద్దు.
∙ అసుపత్రిలో చేరిన చిన్నారులకు, గతంలో మీజిల్స్, రుబెల్లా టీకా వల్ల తీవ్రమైన అలర్జీ, ప్రతిచర్యకు లోనైన వారు.
టీకాలు ఎక్కడ వేస్తారు..
∙ జిల్లా వ్యాప్తంగా టీకా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. కార్యక్రమం మొదటివారంలో అన్ని పాఠశాలల్లో టీకాలు వేస్తారు.
∙ పాఠశాలలకు వెళ్లని మిగతా చిన్నారులను గుర్తించి టీకాలు వేస్తారు. మొబైల్ టీమ్‌లను కూడా ఏర్పాటు చేశారు. మొదటి దశలో టీకాలు వేయించుకోని వారిని గుర్తించి 4వ వారంలో మళ్లీ టీకాల కార్యక్రమం చేపడుతారు.
టీకా ప్రయోజనాలు..
∙ ఒక్కసారి ఈ వ్యాక్సిన్ తీసుకుంటే జీవిత కాలం పని చేస్తుంది.
∙ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
∙ కంటి చూపు మందగించడం, చెవుడు, గుండె జబ్బులను నిరోధిస్తుంది.
∙ అమ్మతల్లి తట్టు దూరం.
∙ వివాహం తర్వాత పుట్టే బిడ్డలకు కడుపులో వ్యాధుల నుంచి రక్షణ.
∙ తక్కువ నెలలో పిల్లలు పుట్టడం, గ్రహణమొర్రి, గుండె జబ్బుల నివారణ.