జీరో’ బంగారు వ్యాపారానికి చెక్
- పోలీసుల అదుపులో ఇద్దరు గుమస్తాలు
- 24.10 లక్షలు స్వాధీనం
ఆదోని టౌన్: ఆదోని పట్టణంలో జీరో బంగారు వ్యాపారం చేస్తున్న వ్యాపారుల ఆట కట్టించారు. ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా బంగారాన్ని కొనుగోలు చేసేందుకు వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. శనివారం సాయంత్రం డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు నిందితులను మీడియా ఎదుట ప్రవేశ పెట్టి వివరాలను వెల్లడించారు. గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం మేరకు ఎస్‌ఐలు బాబు, సునీల్‌కుమార్, హరిప్రసాద్ ఉదయం ఏడు గంటలకు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. బెంగళూరు ట్రైన్ కదిలే సమయంలో హడావుడిగా ఎక్కుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని సోదా చేయగా రూ. 6 లక్షలు బయటపడ్డాయి. విచారించగా ఖాజీపురానికి చెందిన సిరాజ్ అహ్మద్, జంఖాన్ వాడీకి చెందిన అబ్దుల్ ఖాదర్‌గా తేలింది.
బంగారు కొనుగోలు చేసేందుకు వెళ్తున్నట్లు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. కేవలం 6 లక్షలతో ఇద్దరు వ్యక్తులు ఎలా వెళ్తారని, మిగతా డబ్బు ఎక్కడ దాచారని నిలదీయడంతో చొక్కా దిగువన లోపలి వైపు ప్రత్యేకంగా కుట్టిన జేబులను చూయించారు. జేబుల్లో డబ్బు కట్టలు పేర్చి ఇన్ షర్ట్ చేయడంతో పోలీసులు గుర్తించలేక పోయారు. నిందితులు డబ్బుల కట్టలు ఒక్కక్కటి బయటకు తీశారు. మొత్తం రూ. 24.10 లక్షలు బయటపడ్డాయి. వారిపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. విచారణ నిమిత్తం డబ్బును ఆదాయపు పన్ను శాఖకు బదిలీ చేసి పూర్తి స్థాయి విచారణ చేపడుతామన్నారు. సమావేశంలో సీఐలు గంటా సుబ్బారావు, రామానాయుడు, చంద్రశేఖర్, ప్రత్యేక బృందం అ«ధికారులు పాల్గొన్నారు.