కరెంట్ కష్టాలకు చెక్
-
పెద్దూరులో 220 కేవీ సబ్‌స్టేషన్
-
రూ.7.67 కోట్లతో మరో ఆరు సబ్ స్టేషన్లు
-
‘సెస్’ పరిధిలో మెరుగైన విద్యుత్ పంపిణీ
సిరిసిల్ల: సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ ప్రజల కష్టాలు తీరనున్నాయి. లోవోల్టేజీ సమస్యలు దూరంకానున్నాయి. సిరిసిల్ల మండలం పెద్దూరులో రూ.80కోట్లతో 220/132 కేవీ విద్యుత్‌సబ్‌స్టేషన్ పనులు సాగుతున్నాయి. సబ్‌స్టేషన్ నిర్మాణంతో సిరిసిల్ల ప్రాంతంలోని వ్యవసాయం, వస్త్రోత్పతికి లోవోల్టేజీ లేని మెరుగైన విద్యుత్ సరఫరా చేయనున్నారు.
చకచకా పనులు
సిరిసిల్ల మండలం పెద్దూరులో 220/132 కేవీ సబ్‌స్టేషన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. 2014 ఆగస్టులో ఈ సబ్‌స్టేషన్ నిర్మాణానికి మంత్రి కె.తారకరామారావు శంకుస్థాపన చేశారు. టెండర్లు పూర్తయి పనులు మొదలయ్యేందుకు ఆలస్యమైనా.. ఇప్పుడు మాత్రం చకచకా సాగుతున్నాయి. 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణంతో సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని 132/33 కేవీ సబ్‌స్టేషన్లకు, 33/11 కేవీ సబ్‌స్టేషన్లకు మెరుగైన విద్యుత్ అందే అవకాశం ఉంది. విద్యుత్‌గ్రిడ్ నుంచి నేరుగా పెద్దూరుకు కరెంట్ సరఫరా అవుతుంది.
మరో ఆరు సబ్ స్టేషన్లు
సిరిసిల్ల నియోజకవర్గంలో మరో ఆరు విద్యుత్ సబ్‌స్టేషన్లు నిర్మాణంలో ఉన్నాయి. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్, కోరుట్లపేట, సిరిసిల్ల మండలం లక్ష్మీపూర్, కస్బెకట్కూర్, ముస్తాబాద్ మండలం మోహినికుంట, గంభీరావుపేట మండలం నాగంపేటల్లో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లు రూ.7.67 కోట్లతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే వీటి పనులు పూర్తయ్యాయి. ఆపరేటర్ల నియామకానికి టెండర్లు పిలిచారు. కాంట్రాక్టు ఒప్పందం పూర్తికాగానే ఈ సబ్‌స్టేషన్లు వినియోగంలోకి రానున్నాయి. కొత్తగా నిర్మిస్తున్న ఉపకేంద్రాలతో రైతులకు పగటి పూట తొమ్మిది గంటల విద్యుత్ సరఫరాకు, సిరిసిల్ల పట్టణంలో వస్త్రోత్పత్తికి నిరంతర విద్యుత్ పంపిణీ చేయనున్నారు.
రెండు గ్రామాలకో సబ్‌స్టేషన్
– కె.నాంపల్లిగుట్ట, ‘సెస్’ మేనేజింగ్ డైరెక్టర్
పెద్దూరులోని 220 కేవీ సబ్‌స్టేషన్ వినియోగంలోకి వస్తే మెరుగైన విద్యుత్ సరఫరాకు అవకాశం లభిస్తుంది. రెండు గ్రామాలకు ఓ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ ప్రతిపాదనలు అడిగారు. ఈ మేరకు నిర్మిస్తే భవిష్యత్‌లో విద్యుత్ సరఫరాలో లోవోల్టేజీ సమస్యలుండవు. వినియోగదారులకు నాణ్యమై విద్యుత్ అందుతుంది.