చిరుత పులి
ఎస్వీయూలో చిరుత సంచారం
యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీలో విద్యార్థులకు చిరుత భయం పట్టుకుంది. వారం రోజులుగా అప్పుడప్పుడు క్యాంపస్‌లోకి చిరుత వస్తుండడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. వారం క్రితం ఐ–బ్లాక్ సమీపంలో చిరుతను కొందరు విద్యార్థులు చూశారు. తాజాగా సోమవారం రాత్రి 12 గంటల సమయంలో కొందరు పరిశోధక విద్యార్థులు హెచ్–బ్లాక్ సమీపంలో చిరుతను చూశారు. విషయాన్ని పోలీసులు, ఎస్వీయూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు, ఎస్వీయూ సెక్యూరిటీ సిబ్బంది సోమవారం రాత్రంతా క్యాంపస్ చుట్టూ చిరుత కోసం గాలించారు. అన్ని హాస్టళ్లకు వెళ్లి రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు రావద్దని హెచ్చరించారు. మంగళవారం కూడా క్యాంపస్ సెక్యూరిటీ సిబ్బంది హాస్టల్ విద్యార్థులను అప్రమత్తం చేశారు. ఎస్వీయూ హెచ్–బ్లాక్ ఫార్మశీ భవనం, వేదిక్ వర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ శేషాచలం అడవులకు దిగువ ప్రాంతంలో ఉండడంతో అప్పుడప్పుడు జింకలు, కుందేళ్లు వస్తుంటాయి. వాటికోసం చిరుత తరచూ వస్తోంది.
చిరుత రాకుండా చర్యలు తీసుకోవాలి..
క్యాంపస్‌లో అప్పుడప్పుడు చిరుత సంచారం కనిపిస్తోంది. సోమవారం రాత్రి 12గంటల సమయంలో నేను సినిమాకు వెళ్లి వస్తుండగా ఐ–బ్లాక్, హెచ్–బ్లాక్ మధ్య చిరుత కనిపించింది. కుక్కలు అరుస్తూ ఉన్నాయి. దూరంగా చూస్తే చెట్ల మధ్య చిరుత కనిపించింది. భయంతో హాస్టల్‌కు వెళ్లిపోయాను. తర్వాత సెక్యూరిటీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాను.
– డి.లోకనాథం, పరిశోధక విద్యార్థి