సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు
రాష్ట్రంలో దుశ్శాసన పాలన
Published Thu, Aug 4 2016 12:04 AM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
–సమాజం తలదించుకునేలా చంద్రబాబు తీరు
–ప్రత్యేక హోదాకు ఉద్యమించడం పాపమా?
–చంద్రబాబు క్షమాపణకు మహిళానేతల డిమాండ్
– సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా
– భూమన, చెవిరెడ్డి,నారాయణస్వామిలు మద్దతు
తిరుపతి మంగళం:
‘ అధికారంలోకి వస్తే మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలను తీసుకొస్తా..మహిళలపై దాడులు జరగకుండా వీధికొక మహిళా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తానంటూ’ గొప్పలు చెప్పిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పోలీసుల ద్వారా దుశ్శాసన పాలన సాగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా, నగర అధ్యక్షులు గాయిత్రీదేవి, చెలికం కుసుమ ఆరోపించారు. మంగళవారం తిరుపతిలో నిర్వహించిన ప్రత్యేక హోదా బంద్‌లో పోలీసులు మహిళలపట్ల వ్యవహరించిన తీరుకు నిరసనగా బుధవారం తిరుపతి సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కుసుమ ఆధ్వర్యంలో భారీసంఖ్యలో మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మహిళల ఆందోళనకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కళత్తూరు నారాయణస్వామి మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా పార్టీ మహిళా విభాగం జిల్లా, నగర అధ్యక్షురాళ్లు గాయిత్రీదేవి, చెలికం కుసుమ మాట్లాడుతూ సభ్యసమాజం తలదించుకునేలా మహిళ పట్ల చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఉద్యమ పోరాటాలు చేయలేరని, చేసేవారిని అణగతొక్కేందుకు మహిళలు అని కూడా చూడకుండా పోలీసుల చేత బూటు కాళ్లతో తొక్కించి, మహిళల చీరలను చింపి, తాళిబొట్టును సైతం తెంపించాడంటే మహిళల పట్ల చంద్రబాబుకు ఉన్న గౌరవం ఏపాటిదో అర్ధమవుతోందన్నారు. పోలీసులచేత పైశాచిక దాడులు చేయించిన చంద్రబాబు బహిరంగంగా మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర మహిళా లోకాన్ని ఏకం చేసి ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
సిగ్గుచేటు సంఘటన...
కరుణాకరరెడ్డి మాట్లాడుతూ తెలుగు సంస్కతి సంప్రదాయాలకు, మహిళల కట్టుబొట్టులకు ఒకప్రత్యేక ఉందని దానిని మంటగలుపుతున్నాడని మండిపడ్డారు. మహిళల పట్ల మగ పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించి పైశాచిక దాడులకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ పోలీసుల చేత చంద్రబాబు చేయించిన పైశాచిక దాడులు మహిళాలోకం సిగ్గుతో తలదించుకునేలా ఉందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమిస్తే దాడులు చేయించడం చంద్రబాబు చేతగానీ తనానికి నిదర్శనమన్నారు. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి మాట్లాడుతూ రాష్ట్ర అభివద్ధిని, ప్రజాసంక్షేమాన్ని చంద్రబాబు కేంద్రానికి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక హోదా కోసం ఉద్యమ పోరాటాలు చేస్తుంటే మద్దతు తెలపాల్సింది పోయి మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తారా?అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనంతరం సబ్‌కలెక్టర్ ఏవో అబ్దుల్ మునాఫ్‌కు మహిళా నేతలు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకురాళ్లు పుష్పలత, గీతాయాదవ్, పుష్పాచౌదరి, రమణమ్మ, లక్ష్మీరెడ్డి, శాంతారెడ్డి, శారద, మునీశ్వరమ్మ, శ్యామల, పద్మావతమ్మ, రాణెమ్మ, ప్రమీల, చిత్ర, పార్వతమ్మ, లక్ష్మి, భారతి పాల్గొన్నారు. సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద భారీగా మహిళా పోలీసు బలగాలను మోహరించారు.
Advertisement