జీహెచ్‌ఎంసీ కమీషనర్‌కు మట్టి విగ్రహాలను బహుకరిస్తున్న విద్యార్థులు
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: మానవాళికి హాని కల్గించే వినాయక విగ్రహాన్ని తయారుచేసి పూజించటం సరికాదని జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్థన్‌రెడ్డి అన్నారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జనవిజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రసాయన వినాయకుడు వద్దు – మట్టి వినాయకుడే ముద్దు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కమిషనర్ మాట్లాడుతూ.. ఏ పండగనైనా పర్యావరణానికి అనుకూలంగా నిర్వహించుకోవాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు.
విద్యార్థులు క్రీడల పట్ల మక్కువ కనబరచాలని, బాడ్మింటన్ క్రీడాకారిణి సింధు ఆత్మ విశ్వాసాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సభకు ముందు ఉస్మానియా యూనివర్సిటీ ఎన్‌సీసీగేటు నుంచి సుందరయ్య పార్కు వరకు మట్టి విగ్రహాల ప్రయోజనాలపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర మహిళా సభ కళాశాల విద్యార్థులు కమిషనర్‌కు మట్టి విగ్రహాలను బహూకరించారు. జేవీవీ నగర అధ్యక్షులు నాగేశ్వర్‌రావ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, జేవీవీ జాతీయ కార్యదర్శి టి. రమేష్ తదితరులు పాల్గొన్నారు.