ganesha statues
-
Ganesh Chaturthi 2022: ఏకశిలలో భారీ ఏకదంతుడు
సాక్షి, నాగర్‌కర్నూల్: ఇది దేశంలోనే ఎత్తైన ఏకశిలా వినాయకుడి విగ్రహం. ఇది నాగర్‌కర్నూల్ జిల్లాలోని తిమ్మాజిపేట మండలం ఆవంచలో ఉంది. దుందుభి వాగు తీరంలో వెలసిన ఈ వినాయకుడికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. కర్ణాటకలోని శ్రావణబెళగోళలో ఉన్న గోమఠేశ్వరుడు, చాముండీ కొండపై నందీశ్వరుడితోపాటు ఆవంచలోని గణపతి ఏకశిలా విగ్రహాలుగా అతిపెద్దవిగా ప్రసిద్ధి. ఏటా వినాయక చవితి సందర్భంగా వేలాదిమంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు. స్థానికులు ఐశ్వర్య గణపతిగా పిలిచే ఈ గణనాథుడికి ఆలయం లేదు. నాటి ఆవుల మంచాపురమే.. నేటి ఆవంచ.. పశ్చిమ చాళుక్యుల కాలంలో ప్రముఖులైన జగదేక మల్లుడు, భువనైక మల్లుడు, తైలోక్య మల్లుడు ఆవుల మంచాపురాన్ని రాజధానిగా చేసుకుని పాలించారు. నాటి ఆవుల మంచాపురాన్నే కాలక్రమంలో ఆవంచగా పిలుస్తున్నారు. తెలుగు నేలను పాలించిన ఇక్ష్యాకులు గణపతి భక్తులు కావడంతో క్రీ.శ.12వ శతాబ్దంలో 26 అడుగుల ఎత్తైన ఏకశిలా గణపతిని ఏర్పాటు చేసినట్లు చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. పశ్చిమ చాళుక్యుల కాలంలో వెలుగొందిన ఆవంచ గ్రామంలో లభించిన విగ్రహాలు, శిల్పాలను మహబూబ్‌నగర్ జిల్లాలోని పిల్లలమర్రి మ్యూజియం వద్ద భద్రపర్చారు. వీరి కాలంలోనే గ్రామశివారులోని భైరవ ఆలయంలోని ప్రతిమలు, మరో స్తంభంపై శివ పంచాయతనం చెక్కినట్లు స్పష్టమవుతోంది. ఆదరణ లేక పూజలందుకోని గణనాథుడు దేశంలోనే అతిపెద్ద వినాయక ఏకశిలా విగ్రహంగా ప్రసిద్ధి చెందిన ఐశ్వర్య గణపతికి నీడ లేకుండాపోయింది. ఆలయం నిర్మాణం జరగకపోవడంతో ఈ విగ్రహం వందల ఏళ్లుగా ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తోంది. ఏడేళ్ల క్రితం ఓ చారిటబుల్ ట్రస్టు ఆలయం నిర్మించేందుకు ముందుకు వచ్చింది. ఆలయం కోసం ఆరు ఎకరాల స్థలాన్ని సైతం కొనుగోలు చేశారు. అయితే ఆలయ నిర్మాణపనులు ముందుకుసాగడం లేదు. ప్రభుత్వం స్పందించి ఆలయ నిర్మాణం చేపట్టి పర్యాటకంగానూ అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రభుత్వం దృష్టిసారించాలి.. పురాతన కాలం నాటి ఏకశిలా వినాయక విగ్రహానికి ఆలయాన్ని నిర్మించాలి. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఏళ్లపాటు ఆలయం లేక గణనాథుడు నిరాదరణకు గురవుతున్నాడు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఆవంచ వినాయకుడిని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. – వస్పతి శివలింగం, ఆవంచ, నాగర్‌కర్నూల్ జిల్లా -
ఎకో గణేశా! ఏకదంత గణేశా!!
ఏ సామాజిక ఉద్యమానికైనా పిల్లలను మించిన సారథులు మరెవరూ ఉండరు. వాళ్ల మెదడులో ఒక బీజాన్ని నాటితే అది మొలకెత్తి మహావృక్షమై పెరుగుతుంది. ఉద్యమం ఉద్దేశం నెరవేరి తీరుతుంది. ‘మట్టి గణేశుడిని పూజిద్దాం’ అని పెద్దవాళ్లకు ఎంతగా చెప్పినా అలా విని ఇలా వదిలేస్తారు. అదే పిల్లలకు చెబితే చేసి చూపిస్తారు. గణేశ చతుర్ధి అంటేనే పిల్లల పండుగ. ఆ వేడుక కోసం పిల్లల చేతనే గణేశుడి బొమ్మను తయారు చేయిస్తే ఎలా ఉంటుంది? మట్టితో గణేశుడి విగ్రహాన్ని చేయడమెలాగో పిల్లలకు నేర్పిస్తే చాలు. ఎంతటి రంగురంగుల ఆకర్షణీయమైన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బొమ్మలు కనిపించినా సరే పిల్లలు వాటి వంక కూడా చూడరు. బెంగళూరుకు చెందిన రిషితాశర్మ కూడా అలాంటి ప్రయోగాన్నే చేస్తున్నారు. ఉద్యమ సాధనం రిషితాశర్మ జీరో వేస్ట్ యాక్టివిస్ట్. ప్రజల్లో సామాజిక చైతన్యం తీసుకురావడానికి ఆమె గత ఆరేళ్లుగా గ్రీన్ ఉత్సవ్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గణేశ విగ్రహాల మీద ప్రత్యేక దృష్టి పెట్టిన రిషిత 2017 నుంచి మట్టి గణేశుడి తయారీ వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. బెంగళూరులో తాను నివసించే వైట్ ఫీల్డ్‌లో ఉన్న అపార్ట్మెంట్ సొసైటీ నుంచే మొదలు పెట్టారామె. ఏడాదికి నలభై వర్క్‌షాప్‌లతో మొత్తం ఎనిమిది వందల మందికి మట్టి వినాయకుడి బొమ్మల తయారీ నేర్పిస్తున్నారు. అందులో ఎక్కువగా పిల్లలను భాగస్వాములను చేస్తున్నారు. అరగంటలో రెడీ వినాయకుని బొమ్మ చేయడానికి బంకమట్టి, నీరు, టూత్ పిక్‌లు(ఏదో ఒక పుల్లలు), చాకు లేదా స్పూన్ తీసుకోవాలి. మట్టిని ఫొటోలో ఉన్నట్లుగా తయారు చేసుకోవాలి. పుల్లల సహాయంతో మట్టి ముద్దలను జత చేయాలి. మట్టి ముద్దను స్పూన్‌తో వత్తి చెవుల ఆకారం వచ్చేటట్లు చేయాలి. పాదాలకు, చేతులకు వేళ్లను పుల్లతో లేదా స్పూన్ చివరతో నొక్కుతూ గీయాలి. తలపాగా కూడా అంతే. రంగులు కావాలంటే కృత్రిమ రంగుల జోలికి పోకుండా ఇంట్లో ఉండే పసుపు, బీట్రూట్ రసంతో విగ్రహానికి రంగులు అద్దాలి. ఇంకా ఆకర్షణీయంగా కావాలనుకుంటే పెసలు, మినుములు, కూరగాయల గింజలు, ఆవాల వంటి దినుసులను మట్టిలో కలుపుకోవచ్చు లేదా వినాయకుడి విగ్రహం మీద అలంకరించవచ్చు. అయితే ఇవి తప్పనిసరి కాదు. ఎప్పటికీ పండగే వినాయక చవితి వేడుకలు పూర్తయిన తర్వాత విగ్రహాన్ని నీటిలో కరిగించి ఆ మట్టిని మొక్కలకు పోసుకోవచ్చు. మట్టిలో కనుక గింజలను కలిపి ఉంటే... ఒక మడిని సిద్ధం చేసుకుని ఆ మడిలో వినాయకుడిని కరిగించిన మట్టి నీటిని పోయాలి. ఓ వారానికి మొలకల రూపంలో పచ్చదనం ఇంటి ఆవరణలో వెల్లివిరుస్తుంది. ఆ పచ్చదనం ఎప్పటికీ వాడని పండుగ. -
ప్లాస్టిక్ లైసెన్స్ రూల్స్ అమలు బాధ్యత మున్సిపల్ శాఖదే
సాక్షి, హైదరాబాద్: పర్యావరణానికి ముప్పు కలిగించే 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లు, వస్తువులు, షీట్లు, ఫిలిమ్స్ వంటి వాటిని తయారీ స్థాయిలోనే ఉత్పత్తి కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు జీవో 79 జారీ చేశామని, దీనిని తొలిసారి ఉల్లంఘించిన ఉత్పత్తిదారులకు రూ.50 వేలు, రెండోసారి అదే తప్పు చేస్తే ఉత్పత్తికిచ్చిన అనుమతులను రద్దు చేస్తామని తెలిపింది. లైసెన్స్ మంజూరుకు విధించిన కఠిన నిబంధనల్ని అమలు చేసే బాధ్యత మాత్రం మున్సిపల్ శాఖదేనని పీసీబీ సభ్య కార్యదర్శి దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్లో పేర్కొంది. వినాయక విగ్రహాలకు నిషిద్ధ ప్లాస్టిక్ కవర్లు కప్పుతున్నారని, వీటి వల్ల పర్యావరణానికి ముప్పు రాకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఎల్బీనగర్కు చెందిన వైవీ మురళీకృష్ణ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంలో హైకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు ఈ కౌంటర్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిల్ దాఖలు తర్వాత ఎల్బీనగర్, బోయినపల్లి, సుచిత్ర, గండిమైసమ్మ క్రాస్ రోడ్ నుంచి ఓఆర్ఆర్ వరకూ, కొంపల్లి, మియాపూర్, ఉప్పల్, నాగోలు వంటి ప్రాంతాల్లో వినాయక విగ్రహాలు వర్షానికి తడవకుండా కప్పిన ప్లాస్టిక్ కవర్లను తొలగించామని, వాటిని పరీక్షలకు పంపామన్నారు. 40 తయారీ సంస్థలపై తనిఖీలు నిర్వహిస్తే ఎనిమిది చోట్లే ప్రమాణాలకు విరుద్ధంగా ఉత్పత్తి అవుతున్నట్లుగా గుర్తించి రూ.50 వేలు చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు. ఇప్పటికే నాలుగు యూనిట్లను మూసివేశామని, షాపుల నుంచి రూ.32 లక్షలకుపైగా జరిమానా వసూలు చేశామని తెలిపారు. ఈ పిల్‌ను హైకోర్టు విచారించనుంది. -
గణపయ్యకూ జియోట్యాగింగ్
సాక్షి, మహబూబ్‌నగర్ : వినాయక చవితి వేడుకల్లో ఎలాంటి అపశృతి చోటుచేసుకోకుండా పోలీసుశాఖ గట్టి నిఘా ఏర్పాటుచేసింది. ప్రతీ విగ్రహానికి జియోట్యాగింగ్ చేస్తోంది. రెండ్రోజుల కిందట ఊరూరా.. వాడవాడలా గణనాథులు కొలువుదీరగా నిర్వాహకులు మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అయితే ఈ ఏడాది నుంచి పోలీసుశాఖ ఎన్ని విగ్రహాలు, ఎన్ని మండపాలు పెడుతున్నారో పూర్తిస్థాయిలో వివరాలు సేకరిస్తోంది. అనుమతి లేకుండా విగ్రహాలు పెడితే చర్యలు తీసుకుంటామని ఇదివరకే ఆదేశాలు జారీ చేయడంతో యువజన సంఘాల సభ్యులు సైతం సహకరిస్తున్నారు. జిల్లాలో అధికారికంగా 2,238 మండపాలను ఏర్పాటు చేయగా వీటి వద్ద అనుకోని ఘటనలు జరిగితే పోలీసులు నేరుగా అక్కడికి చేరుకోవడానికి జియోట్యాటింగ్ చేస్తున్నారు. అడ్రస్‌లు సరిగా తెలియక ఆలస్యం అవుతుంది. ఇప్పుడిక నిమిషాల్లో చేరుకునే విధంగా పోలీస్ శాఖ ప్రణాళిక రూపొందించింది. అనుమతి తప్పనిసరి సాంకేతికతను జోడించడానికి పోలీసులు ముందు నుంచి ప్రణాళిక ప్రకారం సాగుతున్నారు. మండపాల ఏర్పాటు చేసుకోవడానికి ముందస్తుగా అనుమతి తీసుకోవాలని చెబుతూ వచ్చారు. ఆన్లైన్లో కూడా దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఠాణాల వారీగా వచ్చిన దరఖాస్తులను పోలీసు అధికారులు పరిశీలించి అనుమతులు ఇచ్చారు. వీటిల్లో కొలువుదీరిన విగ్రహాలకు జియోట్యాగింగ్ చేస్తున్నారు. సమస్త వివరాలు తమ కనుసన్నల్లో ఉంచుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. మండపాల దగ్గర కానీ, నిమజ్జన ఊరేగింపు సమయంలో గానీ అనుకోని ఘటనలు జరిగితే క్షణాల్లో అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే అవకాశం ఉంటుంది. ఇలా చేస్తున్నారు పోలీస్ శాఖలో బ్లూకోల్ట్స్‌గా పని చేస్తున్న సిబ్బంది వద్ద ట్యాబ్‌లు ఉన్నాయి. పట్టణాలు, గ్రామాల్లోని గణపతి మండపాలను పరిశీలిస్తారు. కమిటీ నిర్వాహకుల పేర్లు, ఫోను నెంబర్లు, మండపం ఏ ప్రాంతంలో ఉందో అనే పూర్తి వివరాలను రాసుకుంటారు. ఆ తర్వాత ట్యాబ్‌లో గణపయ్య విగ్రహాన్ని ఫొటో తీస్తారు. ఆన్లైన్ ద్వారా జియోట్యాగింగ్ చేస్తారు. అందులోని లొకేషన్ ఆప్షన్‌ను నొక్కగానే వెంటనే మండపం ఏర్పాటు చేసిన ప్రాంతంలోని గుర్తులు నమోదవుతాయి. అలాగే నిమజ్జనం ఏ రోజున, ఏ చెరువులో చేస్తారనే వివరాలను తీసుకుంటారు. ఆన్లైన్ దరఖాస్తులు ఇలా.. ఒకప్పుడు పోలీస్ శాఖకు రాత పూర్వకంగా దరఖాస్తు చేసుకునే వారు. ఇప్పుడు ఆన్లైన్ విధానం వచ్చింది. జిల్లాలో వచ్చిన 2238 దరఖాస్తులకు ఓ పోర్టల్‌ను ఓపెన్ చేసి అందులో వివరాలను పొందుపరుస్తున్నారు. ఇంకా చేసుకోనివారు స్మార్ట్‌ఫోన్‌లో కూడా చేసుకోవచ్చు. దరఖాస్తులను సంబంధిత పోలీస్‌స్టేషన్ సీఐ పరిశీలించి, డీఎస్పీ లేదా ఏఎస్పీకి పంపిస్తారు. అక్కడి నుంచి ఎస్పీ వద్దకు వెళ్తాయి. ప్రతీ విగ్రహానికి జియోట్యాగింగ్ జిల్లాలో ఉన్న ప్రతి విగ్రహం దగ్గరకు మా సిబ్బంది వెళ్లి విగ్రహం ఫొటో తీసి ఆన్లైన్లో పెడుతున్నారు. దీని వల్ల భద్రత పరంగా ఎలాంటి సమస్య ఉండదు. రాత్రి వేళ గస్తీ ముమ్మరం చేశాం. బ్లూకోర్ట్స్, పెట్రోలింగ్, రక్షక్ ఇలా ప్రతి ఒక్కరు మండపం దగ్గరకు వెళ్లి పరిశీలిస్తారు. జిల్లాలో 2238 విగ్రహాలకు దరఖాస్తులు వచ్చాయి. –భాస్కర్, డీఎస్పీ మహబూబ్‌నగర్ -
స్వచ్ఛ గణేష్ సాక్షిగా.
-
స్వచ్ఛ గణేష్ సాక్షిగా
-
రసాయన విగ్రహాలు హానికరం:జనార్ధన్ రెడ్డి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: మానవాళికి హాని కల్గించే వినాయక విగ్రహాన్ని తయారుచేసి పూజించటం సరికాదని జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్థన్‌రెడ్డి అన్నారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జనవిజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రసాయన వినాయకుడు వద్దు – మట్టి వినాయకుడే ముద్దు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కమిషనర్ మాట్లాడుతూ.. ఏ పండగనైనా పర్యావరణానికి అనుకూలంగా నిర్వహించుకోవాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. విద్యార్థులు క్రీడల పట్ల మక్కువ కనబరచాలని, బాడ్మింటన్ క్రీడాకారిణి సింధు ఆత్మ విశ్వాసాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సభకు ముందు ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీగేటు నుంచి సుందరయ్య పార్కు వరకు మట్టి విగ్రహాల ప్రయోజనాలపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర మహిళా సభ కళాశాల విద్యార్థులు కమిషనర్‌కు మట్టి విగ్రహాలను బహూకరించారు. జేవీవీ నగర అధ్యక్షులు నాగేశ్వర్రావ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, జేవీవీ జాతీయ కార్యదర్శి టి. రమేష్ తదితరులు పాల్గొన్నారు.