సంక్షోభంలో చేనేత రంగం
సంక్షోభంలో చేనేత రంగం
Published Sun, Aug 7 2016 9:17 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
పిల్లలమర్రి నాగేశ్వరరావు
పట్టణంలో ఘనంగా చేనేత దినోత్సవం
మంగళగిరి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే చేనేత పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతోందని రాష్ట్ర చేనేత కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు పిల్లలమర్రి నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం పట్టణంలోని రాష్ట్ర చేనేత కార్మిక సంఘ కార్యాలయంలో చేనేత జెండాను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సదస్సులో నాగేశ్వరరావు మాట్లాడారు. పరిశ్రమను రక్షించేందుకు ప్రయత్నాలు చేయని పాలకులు, దాన్ని నాశనం చేసేందుకు విదేశీ వస్త్రాలను దిగుమతి చేస్తున్నారని మండిపడ్డారు. మరమగ్గాలు రంగ ప్రవేశం చేయడంతో చేనేత కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు మర్రి సాంబశివరావు, బత్తూరి మోహనరావు, రావుల శివారెడ్డి, చిన్ని తిరుపతయ్య, జాలాది జాన్‌బాబు, గంజి శ్రీనివాసరావు, ఉడతా వెంకటేశ్వర్లు, నందం బ్రహ్మేశ్వరావు, గంజి వెంకయ్య, కొల్లి కిషోర్, మానం శ్రీను తదితరలు పాల్గొన్నారు.
మార్కెట్ సెంటర్‌లో..
ఏరియా చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ సెంటర్లోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం పాలకులకు మంచి బుద్ది ప్రసాదించాలని మహాత్ముడి విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకష్ణ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేనేత కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానాన్ని నెరవేర్చకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కౌతారపు వెంకటేశ్వరావు, డోకిపర్తి రామారావు, చిట్టేల సీతారామాంజనేయులు, కారంపూడి అంకమ్మరావు, జంజనం శివభవన్నారాయణ, ఉద్దంటి తిరుమలస్వామి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో..
బీజేపీ కార్యాలయంలో అంతర్జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం చేనేత వస్త్రదుకాణాలు, మగ్గాల వద్దకు వెళ్లి పరిశీలించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ హ్యాండ్లూమ్ బోర్డు సభ్యుడు జగ్గారపు శ్రీనివాసరావు, నాయకులు జగ్గారపు రామ్మోహనరావు, సానా చౌడయ్య తదితరులు పాల్గొన్నారు.
వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో..
స్థానిక షరాఫ్ బజార్‌లోని కార్యాలయంలో వస్త్ర ఉత్పత్తి సంఘం ఆధ్వర్యంలో చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు చేనేత కార్మికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆప్కో మాజీ చైర్మన్ మురుగుడు హనుమంతరావు, మున్సిపల్ చైర్‌పర్సన్ గంజి చిరంజీవి, సంఘం నాయకులు జొన్నాదుల వరప్రసాదరావు (గాంధీ), మురుగుడు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement