
నారాయణరెడ్డి కారు డ్రైవర్ ఏం చెప్పాడంటే...
కర్నూలు: పత్తికొండ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరకులపాడు నారాయణ రెడ్డిని దుండగులు పథకం ప్రకారం హత్య చేశారని ఆయన కారు డ్రైవర్ ఎల్లప్ప వెల్లడించాడు. రామకృష్ణాపురంకు సమీపంలోని కల్వర్టు దగ్గర పొలంలో దుండగులు నక్కారని తెలిపాడు. దాదాపు 20 మంది ఒక్కసారిగా వేట కొడవళ్లతో దాడి చేశారని, నారాయణరెడ్డిని విచక్షణారహితంగా నరికారని చెప్పాడు. అడ్డుపడిన సాంబశివుడిని కిరాతకంగా హతమర్చారని వాపోయారు. నారాయణరెడ్డి, సాంబశివుడు చనిపోయిన తర్వాత ఘటనాస్థలం నుంచి దుండగులు పరారయ్యారని వివరించాడు. దుండగులు తరిమేయడంతో ఎల్లప్ప అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కాగా, నారాయణరెడ్డి, సాంబశివుడు మృతదేహాలకు కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో సోమవారం పోస్టుమార్టం పూర్తి చేశారు. నారాయణరెడ్డి మృతదేహాన్ని ఆయన స్వగ్రామం చెరకులపాడుకు తరలించారు. ఈ మధ్యాహ్నం చెరకులపాడు చేరుకున్న నారాయణరెడ్డి పార్థీవదేహాన్ని చూసేందుకు నియోజకవర్గ ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు.