కొండకెక్కిన కోడి
కొండకెక్కిన కోడి
Published Fri, May 26 2017 11:44 PM | Last Updated on Tue, Sep 5 2017 12:03 PM
- చికెన్ కిలో రూ. 240
- స్కిన్‌సెల్ రూ.260
- సామాన్యులు కొనలేని పరిస్థితి
- కోళ్ల పెంపకం తగ్గడమే కారణమంటున్న వ్యాపారులు
కర్నూలు (వైఎస్‌ఆర్ సర్కిల్): మార్కెట్‌లో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. కిలో రూ.240 పలుకుతోంది. మాంసాహారులు చికెన్ ధరలు విని బెంబేలెత్తిపోతున్నారు. రెండు నెలల క్రితం రూ. కిలో రూ.100 నుంచి రూ.120 పలికిన చికెన్ ధర ప్రస్తుతం రెట్టింపు అయింది. సామాన్యులు తినలేని పరిస్థితి ఏర్పడింది. స్కిన్ లెస్ చికెన్ కిలో రూ.260 అమ్ముతుండటంతో వినియోగదారులు వెనకాడుతున్నారు. చాలా మంది ఆదివారమే కాకుండా వారంలో రెండు మూరు సార్లు చికెన్ వండుకోవడం పరిపాటి. అలాంటిది ధరలు పెరగడంతో చికెన్ దుకాణాల వైపు వెళ్లడం లేదు. ఓ వైపు రేట్లుపెరగడంతో చికెన్ అమ్మకాలు కూడా తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. కర్నూలు, నంద్యాల, ఆదోని, డోన్ పట్టణాల్లో అత్యధికంగా కిలో రూ. 240 - రూ. 260 వరకు అమ్ముతున్నారు. పశుసంవర్ధక శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో ఫారం కోళ్లు గుడ్లు పెట్టేవి సుమారు 5 లక్షలు ఉండగా, పెరటి కోళ్లు 14,00,000 వరకు ఉన్నాయి. జిల్లాలో కరువు కారణంగా నాటు కోళ్ల పెంపకం తగ్గిపోవడం వలన కోడి మాంసం ధరలు ఏటా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పెరటి కోళ్ల పథకం కింద యూనిట్లు మంజూరు చేసినప్పటికీ అవగాహన కొరవడటంతో వాటి పెంపకంపై ప్రజల్లో ఆసక్తి సన్నగిల్లింది.
కోళ్ల పరిశ్రమకు ప్రోత్సాహం కరువు:
కోళ్ల పరిశ్రమకు ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడమే కోడి మాంసం ధరల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం కోళ్ల ఫారాల్లో ఉన్న కోళ్లు కూడా సీజనల్ వ్యాధులతో వేల సంఖ్యలో చనిపోతున్నాయి. ప్రతి ఆదివారం మార్కెట్లో వేల సంఖ్యలో కోళ్లను విక్రయిస్తుంటారు. దీంతో గుడ్లు పెట్టే కోళ్లు కూడా తగ్గిపోతున్నాయి. జిల్లా ఏటేటా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అటు మాసంగానీ, గుడ్లు, పాల ఉత్పత్తి లో రెండెంకెల వృద్ధి సాధించాలన్న ప్రభుత్వం లక్ష్యం నెరవేరడం లేదు. ఇవన్నీ కలిసి చికెన్ ధరల పెరుగుదలకు కారణమైనట్లు వ్యాపారులు చెబుతున్నారు.
ప్రోత్సాహం కరువవ్వడంతోనే నష్టాలు... – రాజారెడ్డి, శివ చికెన్ పౌల్ట్రీస్, డోన్ :
ప్రభుత్వ ప్రోత్సాహం కరువవ్వడంతోనే చికెన్ వ్యాపారులు నష్టాల పాలవుతున్నారు. ప్రస్తుతం వేసవి సీజన్‌లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రావడంతో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో డిమాండ్‌కు తగ్గట్టుగా కోళ్ల ఉత్పత్తి తగ్గడంతోనే అమాంతంగా ధరలు పెరిగాయి. రూ.220 నుంచి రూ.240 వరకు ధర పెరగడం ఎన్నడూ చూడలేదు. ప్రభుత్వం ప్రోత్సహించి పౌల్ట్రీ పరిశ్రమలను మరిన్ని ఏర్పాటు చేస్తే ఇలాంటి కష్టాలు, నష్టాలు పునరావృతం కావు.
Advertisement
Advertisement