మరణించిన మూడేళ్ల శిమ్మ సాత్విక్
కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు
విషాదంలో వినాయకపల్లి
వినాయకపల్లి (శంగవరపుకోట రూరల్) : ఇంట్లో ఆడుకుంటూ పొరపాటున కిరోసిన్ తాగి చిన్నారి మరణించిన విషాదకర సంఘటన గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో వినాయకపల్లిలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వినాయకపల్లిలో శిమ్మ ఎర్నాయుడు, రమణమ్మ దంపతులు జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగే బాలుడి తండ్రి ఎర్నాయుడు కూలి పనికి వెళ్లిపోగా, తల్లి రమణమ్మ ఇంటి పనులు చేసుకుంటోంది. ఈ సమయంలో ఇంట్లో ఆడుకుంటున్న సాత్విక్ (3) పొరపాటున కిరోసిన్ డబ్బా తీసి తాగేశాడు. వెంటనే తల్లి చూసి చిన్నారిని ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యుడు ఎం. హరి ప్రథమ చికిత్స అందించారు. అయితే చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా కేంద్ర ఆస్పత్రికి రిఫర్ చేశారు. కుటుంబ సభ్యులు వెంటనే చిన్నారిని కేంద్ర ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి కన్నుమూశాడు. తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో వినాయకపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. ఎస్. కోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.