బాత్రూము బండ విరిగిపడి బాలుడి మృతి
ఓడీ చెరువు : ఇంటిముందు బాత్రూము కోసం ఏర్పాటు చేసుకున్న నల్లబండ విరిగి మీద పడటంతో బాలాజీ అనే ఐదేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఓడీచెరువు మండలంలోని మహమ్మదాబాద్ క్రాసింగ్‌లో శనివారం చోటుచేసుకున్న ఈ దుర్ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు నెలకొన్నాయి. స్థానికుల కథనం మేరకు.. క్రాసింగ్‌లో నివాసముంటున్న నాగరాజు, అనూష దంపతులకు బాలాజీ, కార్తీక్ అనే ఇద్దరు కుమారులున్నారు. నలుగురూ కలిసి శనివారం ఉదయం టిఫిన్ చేశారు. నాగరాజు కూలి పని నిమిత్తం బయటకు వెళ్లిపోయాడు. ఇంటిముందు చుట్టూ బండలు పాతి ఏర్పాటు చేసుకున్న బాత్రూము వద్ద పెద్ద కుమారుడు బాలాజీ ఆడుకుంటున్నాడు.
ఆ బండల వద్ద కూర్చోవడానికి వీలుగా పెట్టిన ఓ రాయి ఎక్కి బండను పట్టుకుని ఆ పక్కనే ఉన్న చిన్న కానుగచెట్టు ఎక్కబోయాడు. ఆ బండ విరిగి మీదపడింది. ఆ శబ్ధం విన్న అనూష అరుస్తూ పరుగున బయటకు వచ్చింది. ఆమె అరుపుతో చుట్టుపక్కలవారు కూడా అక్కడికి వచ్చి బాలుడిపై పడిన బండను తొలగించారు. తలకు గాయమై తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న బాలాజీని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు.