- వైద్యుల నిర్లక్ష్యమేనంటూ బంధువుల ఆరోపణ
- ప్రభుత్వాస్పత్రి ఎదుట నిరసన
రాయదుర్గం టౌన్ : రాయదుర్గంలోని ఆత్మకూరు వీధిలో నివాసముంటున్న మాబున్నీ బళ్లారి ప్రభుత్వాస్పత్రిలో శనివారం రాత్రి ప్రసవమైంది. అయితే గర్భంలోనే శిశువు మృతి చెందింది. రాయదుర్గం ప్రభుత్వాస్పత్రిలో అంతకు ముందు వేసిన ఇంజక‌్షన్ వికటించడంతోనే ఈ సంఘటన జరిగిందంటూ బంధువులు బుధవారం ఆందోళనకు దిగారు. వైద్యులతో వాగ్వాదం చేశారు. రెండోసారి గర్భం దాల్చిన మాబున్నీని గత శుక్రవారం పొత్తికడుపులో నొప్పి, యూరినరీ ఇన్ఫెక‌్షన్‌తో రాయదుర్గం ప్రభుత్వాస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. డ్యూటీ డాక్టర్ వసంతలక్ష్మీ డైక్లోఫెనాక్ ఇంజక‌్షన్ ఇచ్చారు.
శనివారం ఉదయం కూడా మరోమారు ఇంజక‌్షన్ ఇచ్చినట్లు బంధువులు తెలిపారు. సాయంత్రం 4 గంటలవుతున్నా వైద్యులు పట్టించుకోకపోవడంతో చేసేది లేక గర్భిణిని బళ్లారి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అదే రోజు రాత్రి ఆమె డెలివరీ కాగా.. గర్భంలోనే బిడ్డ మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. రాయదుర్గం ఆస్పత్రిలో ఇచ్చిన ఇంజక‌్షన్ల వల్లే బిడ్డ గర్భంలోనే మృతి చెందాడని మాబున్నీ బంధువులు ఆరోపించారు. దీంతో వారు మూకుమ్మడిగా కలసి రాయదుర్గం ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారి డాక్టర్ సత్యనారాయణతో వాగ్వాదానికి దిగారు. వైద్యాధికారి స్పందిస్తూ డాక్టర్ వసంతలక్ష్మీ ఇచ్చిన ఇంజక‌్షన్ వల్ల తల్లికీ, బిడ్డకూ ఎటువంటి ప్రమాదం జరగలేదన్నారు. తాము సిఫార్సు చేయకున్నా వారే బళ్లారికి వెళ్లారన్నారు.
గర్భంలోనే శిశువు మృతి
Published Wed, Jun 21 2017 10:47 PM | Last Updated on Tue, Sep 5 2017 2:08 PM
Advertisement
Advertisement