బోరుబావిలో పడిన చిన్నారి శాన్వి మృతి
నల్లగొండ : నల్లగొండ జిల్లా శాలాగౌరారం మండలం వల్లాల గ్రామంలో బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారి శాన్వి ప్రాణాలు కోల్పోయింది. శాన్విని ప్రాణాలతో బయటికి తీసేందుకు 13 గంటలుగా సాగిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున బోరుబావి నుంచి బయటికి తీసిన చిన్నారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందినంట్లు వైద్యులు ధృవీకరించారు.
అసలు ఏం జరిగిందంటే...
మృతనిమ్మతోటలో బావి పూడిక తీసేందుకు వెళ్లిన శాన్వి తల్లిదండ్రులు చిన్నారిని తమ వెంట తీసుకెళ్లారు. అక్కడ శాన్వి తల్లిదండ్రులు తమ పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో చిన్నారి ఆడుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న బోరు బావిలో పడింది. కొన్ని నిమిషాల తర్వాత శాన్వి ఎక్కడుందని తల్లి అడగగా తనకు తెలియదని చిన్నారి తండ్రి చెప్పాడు. వారు చిన్నారి కోసం వెతకగా సుమారు 20 అడుగుల లోతు ఉన్న బావిలో పడిపోయినట్లు గుర్తించారు. వారి నుంచి సమాచారం అందుకున్న ఫైర్, రెవిన్యూ సిబ్బంది గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బావి దగ్గరికి త్వరగానే చేరుకుని పనులు ప్రారంభించారు. బోరు బావిలో నీళ్లు పడకపోవడంతో మూత మూయకుండా అలాగే వదిలేయడంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆర్డీవో వెంకటాచారి చెప్పారు.
బండరాయి యమపాశమైంది....
చిన్నారి శాన్విని బోరు బావి నుంచి బయటకు తీసేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేసి దాదాపు 18 అడుగుల లోతు వరకు బావికి సమాంతరంగా తవ్వారు. అయితే, దురదృష్టం ఆ తల్లిదండ్రులను వెంటాడింది. 108 ద్వారా శాన్వీకి ఆక్సిజన్ సరాఫరా చేస్తున్నాం.. మరో రెండు అడుగులు తవ్వి శాన్విని బయటకు తీసి ప్రాణాలతో రక్షిస్తామని అధికారులు చెప్పారు. కేవలం గంట సమయంలోనే 18 అడుగుల తవ్వేశారు. ఇక్కడే అధికారులకు పెను సవాలు ఎదురైంది. ఓ పెద్ద బండరాయి అడ్డుగా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే డ్రిల్లర్ లను తెప్పించి మళ్లీ తవ్వడం ప్రారంభించగా దాదాపు 10 గంటల తర్వాత కూడా శాన్విని బయటకు తీయలేకపోయారు. ఆ పెద్ద బండరాయి చిన్నారి పాలిట శాపమై ప్రాణాల్ని బలి తీసుకుంది. తెల్లవారు జామున మూడు గంటలకు చిన్నారిని బయటకు తీసి నకిరేకల్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే శాన్వి ప్రాణాలతో లేదని డాక్టర్లు నిర్ధారించారని ఆర్డీవో వివరించారు. చిన్నారి ఇక లేదన్న వార్త విన్న ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.