ఆ..డ పిల్ల
గర్భాన తొమ్మిది నెలలు మోసిన ఆ తల్లికి వచ్చిన కష్టమేమో కానీ.. ఓ పురిటి బిడ్డ చెత్తకుప్ప పాలయైంది. ఇదంతా కన్నపేగుకు తెలిసి జరిగిందా? లేక ఆమె అనుమతితోనే కుటుంబసభ్యులు ఇంతటి నిర్ధయకు ఒడిగట్టారా అనేది ప్రశ్నార్థకమైంది. వివరాల్లోకి వెళితే.. ఉరవకొండలోని ఇందిరానగర్ ఆరవ లైన్.. గురువారం తెల్లవారుజామున... స్థానికంగా ఉంటున్న కళావతి తన ఇంటిలోని చెత్తను తీసుకెళ్లి సమీపంలోని చెత్త కుప్పలో పడేసి వెనుదిరిగింది. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ వ్యక్తి అదె చెత్త కుప్పలో ఓ పసికందును పడేసి వెళ్లాడు.
ఇది గమనించిన కళావతి పిలిచే లోపు అతను వెళ్లిపోయాడు. ఆమె అరుపులు విన్న చుట్టుపక్కల వారు అక్కడ గుమికూడి చూస్తే.. పురుటి నెత్తుటిని సైతం తుడవని ఓ ఆడశిశువు చెత్త కుప్పలో కనిపించింది. కాలనీ వాసులు ఆ పసికందును చేరదీసి సమాచారం అందించడంతో ఎస్‌ఐ సురేష్‌బాబు అక్కడకు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. కేసు నమోదు చేశారు. పసిగుడ్డను స్వాధీనం చేసుకుని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. పసికందును అనంతపురంలోని బాలభవన్‌కు తరలించనున్నట్లు ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రాబియా తెలిపారు.
- ఉరవకొండ