ధారూరు(రంగారెడ్డి): బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయాలని అధికార యంత్రాంగం ఎన్ని విధాలుగా యత్నించినా విఫలమవుతున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ ఇది. పద్నాలుగేళ్ల బాలికకు పెద్దలు చేయతలపెట్టిన వివాహాన్ని మంగళవారం అధికారులు అడ్డుకుని, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ధారూరు మండలం కుక్కింద గ్రామానికి చెందిన చాకలి అనంతయ్య, బాలమణి దంపతుల కూతురు (14)ను పెద్దెముల్ మండలం ఇందూరు గ్రామానికి చెందిన నరేష్ అనే యువకుడితో ఈనెల 24న వివాహం చేసేందుకు రెండు కుటుంబాల వారు నిర్ణయించారు. ఇందులో భాగంగానే బాలిక తల్లిదండ్రులు రూ.లక్ష కట్నం ఇవ్వటంతోపాటు మరో రూ.30 వేలతో దుస్తులు, రూ.20 వేలతో ఇంటి సామాను కొనుగోలు చేసి సిద్దంగా ఉంచారు.
ఇందుకోసం బాలిక తండ్రి అనంతయ్య ఎకరా పొలాన్ని విక్రయించి వివాహం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా, 1098 చైల్డ్‌లైన్‌కు కొందరు వ్యక్తులు ఫోన్ చేసి బాల్య వివాహంపై సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన చైల్డ్‌లైన్ సభ్యులు, తహసీల్దార్ శ్రీనివాస్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సుశీలతో పాటు పోలీసులకు సమాచారం అందజేశారు. వారంతా బుధవారం బాలిక తల్లిదండ్రులను మండల రెవెనూ కార్యాలయానికి రప్పించి కౌన్సెలింగ్ ఇచ్చారు. కట్నంగా ఇచ్చిన రూ.లక్ష తిరిగి బాలిక తల్లిదండ్రులకు ఇప్పించేందుకు అధికారులు ఒప్పించారు. బాలికను నగరంలోని నిబోలిఅడ్డ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ హోంకు తరలించారు.
బాలిక వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
Published Wed, Apr 20 2016 4:38 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
Advertisement
Advertisement