child line members
-
ఆడపిల్లలు మా కొద్దు... వారసులే కావాలి
నల్లగొండ, తిరుమలగిరి(నాగార్జునసాగర్) : ఆ గిరిజన దంపతులకు మొదటి, రెండు కాన్పుల్లో ఆడపిల్లలు పుట్టారు.. వారసుడి కోసం మహిళ మరోమారు గర్భం దాల్చింది. మూడో కాన్పులో కూడా ఆ దంపతులకు ఆడపిల్లలు పుట్టడంతో ఇక సాకే స్థోమత లేదని 10 రోజుల శిశువును శిశుగృహకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ సంఘటన గురువారం తిరుమలగిరి మండలంలో చోటు చేసుకుంది. ఐసీడీఎస్ సీడీపీఓ గంధం పద్మావతి తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి మండలం జువ్విచెట్టుతండాకు చెందిన సపావత్ శ్రీను, విజయ దంపతులకు మొదటి, రెండు కాన్పుల్లో ఆడపిల్లలు పుట్టారు. వారసుడి కోసం విజయ మూడో సారి గర్భం దాల్చింది. ఈనెల 2వ తేదీన మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మూడు కాన్పుల్లో ఆడపిల్లలే పుట్టారు. ఇక ఆడపిల్లలను సాకే స్థోమత తమకు లేదని శిశువును శిశుగృహకు అప్పగించాలని నిర్ణయించుకున్నారు. విషయాన్ని స్ధానిక అంగన్వాడీ టీచర్‌కు చెప్పడంతో సదరు టీచర్ విషయాన్ని సీడీపీఓ, సూపర్వైజర్లకు చేరవేయంతో గురువారం అధికారులు తండాకు చేరుకొని శ్రీను, విజయ దంపతులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రభుత్వం ఆడపిల్లలకు అనేక ప్రోత్సాహకాలు అందజేస్తుందన్నారు. ఆడపిల్ల పుడితే రూ. 13వేలు, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, ఆడపిల్లల రక్షణకు షీటీంలు, ఉచిత నాణ్యమైన విద్య, గిరిజనులకు ఉచితంగా రూ. లక్ష తో పాటు తదితర పథకాలు అందజేస్తుందని వివరించడంతో ఆ తల్లిదండ్రులు తమ వైఖరిని మార్చుకొని శిశువును సాకుతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. గర్కనేట్‌తండాలో.. మండలంలోని గర్కనేట్‌తండాకు చెందిన సఫావత్ ధాను, స్వామి దంపతులకు మొదటి కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చారు. మరోమారు ధాను రెండో సారి గర్భం దాల్చడంతో ఈనెల 2వ తేదీన హాలియాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తమది నిరుపేద కుటుంబం, ఇద్దరు ఆడపిల్లలను సాకే స్థోమత తమకులేదని ఆడపిల్లలను శిశుగృహకు అప్పగించాలని నిర్ణయించుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు దంపతులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో ఆ దంపతులు మనస్సు మార్చుకొని శిశువును సాకుతామని హామీ ఇచ్చినట్లు సీడీపీఓ పద్మావతి తెలిపారు. కార్యక్రమంలో సూపర్వైజర్ నాగమణి, యాదమ్మ, మోతీలాల్, వెంకటేశ్వర్లు, సరిత ఉన్నారు. -
బాల్యవివాహ ప్రయత్నానికి బ్రేక్
కవిటి: మండలంలోని తీరప్రాంత మత్స్యకార గ్రామం కళింగపట్నంలో మైనర్ బాలికకు వివాహం చేసే ప్రయత్నాన్ని ఇచ్ఛాపురం ప్రాంతీయ గెస్ట్ చైల్డ్‌లైన్ సంస్థ ప్రతినిధులు అడ్డుకున్నారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలివీ... కళింగపట్నంలో 15 ఏళ్ల వయస్సు ఉన్న అమ్మాయికి వివాహం చేయాలని ఇంటి పెద్దలు ప్రయత్నిస్తున్నట్లు 1098కు అందిన సమాచారం మేరకు చైల్డ్‌లైన్ ప్రతినిధి ప్రసాద్బిసాయి అక్కడకు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టి అమ్మాయి వయస్సును నిర్ధారించుకున్నారు. అనంతరం వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ శాఖలకు సంబంధించిన అధికారులతో బాల్య వివాహానికి సిద్ధమవుతున్న వారి ఇంటికి వెళ్లి పెద్దలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇటువంటి వివాహాలను ప్రోత్సహిస్తే బాల్య వివాహాల నిరోధక చట్టానికి లోబడి ఇరువర్గాల కుటుంబాలకు కఠిన శిక్షలు పడతాయని వివరించారు.దీంతో ఇరువర్గాల వారు తమ ప్రయత్నాన్ని విరమించుకొంటున్నామని లిఖిత పూర్వకంగా అంగీకరించారు. కార్యక్రమంలో వీఆర్ఓ కూర్మనాయకులు, పంచాయతీ కార్యదర్శి విజయకుమార్, ఐసీడీఎస్ సూపర్ వైజర్ సీహెచ్ నాగలక్ష్మీ, పోలీసులు పాల్గొన్నారు. -
బాలిక వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
ధారూరు(రంగారెడ్డి): బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయాలని అధికార యంత్రాంగం ఎన్ని విధాలుగా యత్నించినా విఫలమవుతున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ ఇది. పద్నాలుగేళ్ల బాలికకు పెద్దలు చేయతలపెట్టిన వివాహాన్ని మంగళవారం అధికారులు అడ్డుకుని, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ధారూరు మండలం కుక్కింద గ్రామానికి చెందిన చాకలి అనంతయ్య, బాలమణి దంపతుల కూతురు (14)ను పెద్దెముల్ మండలం ఇందూరు గ్రామానికి చెందిన నరేష్ అనే యువకుడితో ఈనెల 24న వివాహం చేసేందుకు రెండు కుటుంబాల వారు నిర్ణయించారు. ఇందులో భాగంగానే బాలిక తల్లిదండ్రులు రూ.లక్ష కట్నం ఇవ్వటంతోపాటు మరో రూ.30 వేలతో దుస్తులు, రూ.20 వేలతో ఇంటి సామాను కొనుగోలు చేసి సిద్దంగా ఉంచారు. ఇందుకోసం బాలిక తండ్రి అనంతయ్య ఎకరా పొలాన్ని విక్రయించి వివాహం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా, 1098 చైల్డ్‌లైన్‌కు కొందరు వ్యక్తులు ఫోన్ చేసి బాల్య వివాహంపై సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన చైల్డ్‌లైన్ సభ్యులు, తహసీల్దార్ శ్రీనివాస్, ఐసీడీఎస్ సూపర్వైజర్ సుశీలతో పాటు పోలీసులకు సమాచారం అందజేశారు. వారంతా బుధవారం బాలిక తల్లిదండ్రులను మండల రెవెనూ కార్యాలయానికి రప్పించి కౌన్సెలింగ్ ఇచ్చారు. కట్నంగా ఇచ్చిన రూ.లక్ష తిరిగి బాలిక తల్లిదండ్రులకు ఇప్పించేందుకు అధికారులు ఒప్పించారు. బాలికను నగరంలోని నిబోలిఅడ్డ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ హోంకు తరలించారు.