గర్కనేట్‌తండాలో దంపతులకు అవగాహన కల్పిస్తున్న ఐసీడీఎస్ అధికారులు
నల్లగొండ, తిరుమలగిరి(నాగార్జునసాగర్) : ఆ గిరిజన దంపతులకు మొదటి, రెండు కాన్పుల్లో ఆడపిల్లలు పుట్టారు.. వారసుడి కోసం మహిళ మరోమారు గర్భం దాల్చింది. మూడో కాన్పులో కూడా ఆ దంపతులకు ఆడపిల్లలు పుట్టడంతో ఇక సాకే స్థోమత లేదని 10 రోజుల శిశువును శిశుగృహకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ సంఘటన గురువారం తిరుమలగిరి మండలంలో చోటు చేసుకుంది. ఐసీడీఎస్ సీడీపీఓ గంధం పద్మావతి తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి మండలం జువ్విచెట్టుతండాకు చెందిన సపావత్ శ్రీను, విజయ దంపతులకు మొదటి, రెండు కాన్పుల్లో ఆడపిల్లలు పుట్టారు. వారసుడి కోసం విజయ మూడో సారి గర్భం దాల్చింది. ఈనెల 2వ తేదీన మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మూడు కాన్పుల్లో ఆడపిల్లలే పుట్టారు. ఇక ఆడపిల్లలను సాకే స్థోమత తమకు లేదని శిశువును శిశుగృహకు అప్పగించాలని నిర్ణయించుకున్నారు. విషయాన్ని స్ధానిక అంగన్‌వాడీ టీచర్‌కు చెప్పడంతో సదరు టీచర్ విషయాన్ని సీడీపీఓ, సూపర్‌వైజర్‌లకు చేరవేయంతో గురువారం అధికారులు తండాకు చేరుకొని శ్రీను, విజయ దంపతులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రభుత్వం ఆడపిల్లలకు అనేక ప్రోత్సాహకాలు అందజేస్తుందన్నారు. ఆడపిల్ల పుడితే రూ. 13వేలు, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, ఆడపిల్లల రక్షణకు షీటీంలు, ఉచిత నాణ్యమైన విద్య, గిరిజనులకు ఉచితంగా రూ. లక్ష తో పాటు తదితర పథకాలు అందజేస్తుందని వివరించడంతో ఆ తల్లిదండ్రులు తమ వైఖరిని మార్చుకొని శిశువును సాకుతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
గర్కనేట్‌తండాలో..
మండలంలోని గర్కనేట్‌తండాకు చెందిన సఫావత్ ధాను, స్వామి దంపతులకు మొదటి కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చారు. మరోమారు ధాను రెండో సారి గర్భం దాల్చడంతో ఈనెల 2వ తేదీన హాలియాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తమది నిరుపేద కుటుంబం, ఇద్దరు ఆడపిల్లలను సాకే స్థోమత తమకులేదని ఆడపిల్లలను శిశుగృహకు అప్పగించాలని నిర్ణయించుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు దంపతులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో ఆ దంపతులు మనస్సు మార్చుకొని శిశువును సాకుతామని హామీ ఇచ్చినట్లు సీడీపీఓ పద్మావతి తెలిపారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ నాగమణి, యాదమ్మ, మోతీలాల్, వెంకటేశ్వర్లు, సరిత ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment