మత్తు..బాల్యం చిత్తు!
♦ విచ్చలవిడిగా వైట్‌నర్, మత్తు మందుల విక్రయాలు
♦ కొరవడిన అధికారుల పర్యవేక్షణ
♦ చిన్నారుల ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు
కర్నూలు(హాస్పిటల్):
కర్నూలు నగరంతో పాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, కోడుమూరు, డోన్, ఆళ్లగడ్డ వంటి ప్రాంతాల్లో బాలలు, యువత అధికంగా మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. అనారోగ్యం బారినుంచి కాపాడేందుకు తయారు చేసిన మందులు కాస్తా వీరికి వ్యసనంగా మారుతున్నాయి. జిల్లాలో 2వేల వరకు మందుల దుకాణాలు ఉన్నాయి. పట్టణాల్లోని యువత కంటే గ్రామీణ, మండల స్థాయిలోని యువత ఎక్కువగా మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని వైద్యులు చెబుతున్నారు.
దగ్గు సిరప్.. మత్తుకు స్టార్టప్!
ప్రధానంగా దగ్గును తగ్గించే పలు రకాల సిరప్‌లను అధిక మోతాదులో సేవిస్తూ యువత మత్తుకు బానిసలవుతున్నారు. గతంలో ఓ కంపెనీ తయారు చేసిన దగ్గు మందును విచ్చలవిడిగా ఉపయోగించేవారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దీనిని రద్దు చేయగా, సదరు కంపెనీ కొన్ని నిబంధనలతో తిరిగి దానిని పునరుద్ధరించుకున్నట్లు సమాచారం. అయితే ఇందులో మత్తును కలిగించే ఔషదాన్ని డోసు తగ్గించి విక్రయిస్తున్నారు. దీంతో పాటు ప్రస్తుతం లభించే మరో కంపెనీ మందును స్టెరాయిడ్ మాత్రలతో కలిపి సేవిస్తూ యువత మత్తుకు బానిసలవుతున్నారు. దీనికితోడు ఆపరేషన్ సమయంలో రోగులకు వాడే ఫోర్ట్‌విన్ అనే మత్తు ఇంజెక్షన్లు సైతం ఆసుపత్రుల నుంచి బయటకు వస్తున్నాయి.
వీటిని బయటి మెడికల్ షాపుల్లో విక్రయించకపోయినా నర్సింగ్‌హోమ్‌లు ఉండే ఆసుపత్రుల్లో మాత్రం లభిస్తున్నాయి. వాటిని ఆసుపత్రుల పారామెడికల్ సిబ్బందే కొందరు రోగుల పేరుతో అధికంగా కొనుగోలు చేసి, అధిక మొత్తానికి యువతకు విక్రయిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ ఇంజెక్షన్లు వేసుకున్న యువత గంటల తరబడి మత్తులో ఉంటోంది. ఇవేగాక నిద్ర మాత్రలు, ఒత్తిడి, డిప్రెషన్‌ను తగ్గించే మాత్రలు సైతం మందుల దుకాణాల్లో విచ్చలవిడిగా లభిస్తున్నాయి. అధికారుల దాడులకు బయపడి పట్టణాల్లో వీటి విక్రయంపై భయం ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌ఎంపీలు యథేచ్ఛగా విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
మత్తు పదార్థాలతో బాల్యం చిత్తవుతోంది. మొదట సరదాగానే మత్తు పదార్థాలు తీసుకున్నా చివరకు వాటికి బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ధనార్జనే ధ్యేయంగా జీవించే కొందరు వ్యాపారులు, వ్యక్తులు మత్తును కలిగించే పదార్థాలను పిల్లలకు, యువతకు అంటగట్టి వారి జీవితాల్లో అంధకారం నింపుతున్నారు.
నిఘా అవసరం
పిల్లలు, యువత, నిరుద్యోగుల వ్యవహారశైలిపై నిత్యం నిఘా ఉంచాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కళాశాలకు వెళ్లిన పిల్ల్లలు ఇంటికి ఆలస్యంగా రావడం, కొత్త స్నేహితులతో పరిచయం, వారిలో వస్తున్న మార్పులను గమనిస్తూ తల్లిదండ్రులు కనిపెడుతూ ఉండాలని పేర్కొంటున్నారు. అయితే వారిపై నిఘా కొరవడంతోనే మత్తుకు అలవాటు పడిపోతున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వైట్‌నర్ మత్తులో బాల్యం
స్టేషనరి, బుక్‌షాప్‌లలో లభించే ఇంకు మరకలను చెరిపి వేసే వైట్‌నర్‌లే పలువురు బాలలు మత్తు పదార్థాలుగా వినియోగిస్తున్నారు. ఈ మందును చేతి రుమాలుపై వేసుకుని, ఆ వాసనను పీలుస్తూ గంటల తరబడి మత్తులో జోగుతున్నారు. బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, మార్కెట్‌ల వద్ద కనిపించే వీధి బాలలతో పాటు కొందరు యువకులు, భిక్షాటన చేసే మహిళలు సైతం వైట్‌నర్ మత్తుకు దాసోహమవుతున్నారు.