whitener
-
వైట్నర్ మత్తులో రోడ్డుపై కొట్టుకున్న యువకులు
-
వైట్నర్ మత్తులో మహిళల హల్చల్
సాక్షి, హైదరాబాద్ : పాతబస్తీలో ఇన్నాళ్లూ యువకులు మాత్రమే వైట్నర్కు బానిసై జీవితాలు నాశనం చేసుకోగా.. ప్రస్తుతం ఈ వ్యసనం మహిళలకు కూడా పాకింది. వైట్నర్ తాగిన మత్తులో ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ వద్ద శనివారం రాత్రి నలుగురు మహిళలు వీరంగం సృష్టించారు. పోలీసులపై దాడికి యత్నించారు. ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు వివరాల ప్రకారం.. ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన షబానా, పర్వీనా, జబానా, అయేషాలు వైట్నర్ సేవనానికి బానిసలయ్యారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా వీరు మదీనా కాలనీ, ఫలక్‌నుమా జైతున్ హోటల్, ఇంజన్‌బౌలి ప్రాంతాలలో రోడ్లపై ట్రాఫిక్‌ను అడ్డగించడం.. చెప్పులు విసరడం.. బూతులు తిట్టడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఈ విషయమై రెండు మూడు రోజులుగా 100 డయల్‌కు ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో ఫలక్‌నుమా ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు ఎస్సైలు రమేష్ నాయక్, గొకారీ నేతృత్వంలో వైట్నర్లపై శనివారం ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించారు. ఫాతిమా నగర్‌కు చెందిన గోరీ బీ అనే మహిళ శనివారం రాత్రి పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని తన 12 ఏళ్ల చిన్న కూతురు సభా బేగాన్ని వైట్నర్ సేవించిన నలుగురు మహిళలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేసింది. ఇంట్లోనీ వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు ‘నీ పెద్ద కుమార్తె ముంతాజ్ బేగం తన భర్త హాజీతో అక్రమ సంబంధం పెట్టుకుందని.. నీ పెద్ద కుమార్తె వస్తేనే చిన్న కుమార్తె సభా బేగాన్ని విడిచి పెడతామంటూ పర్వీనా అనే మహిళ బెదిరించి మిగిలిన ముగ్గురితో కలిసి తీసుకెళ్లిందని’ ఫిర్యాదులో పేర్కొంది. వెంటనే స్పందించిన పోలీసులు నలుగురు మహిళలు నివాసం ఉన్న ప్రాంతానికి వెళ్లి బాలికను వారి చెర నుంచి విడిపించి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఇదే సమయంలో నలుగురు మహిళలు కూడా పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేసిన గోరీ బీని పోలీసుల సమక్షంలోనే కొట్టడం ప్రారంభించారు. వెంటనే స్పందించిన పోలీసులు వారి స్థితిని గమనించి పోలీస్‌స్టేషన్ నుంచి బయటికి వంపించారు. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ మహిళలు పోలీసులను దుర్భాషలాడుతూ.. చెప్పులు విసరసాగారు. అంతటితో ఆగకుండా ప్రధాన రహదారిపైకి వచ్చి వాహనదారులకు ఆటంకం కల్పించారు. మహిళా పోలీసులు వారిని పట్టుకొని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కిడ్నాప్, న్యూసెన్స్ కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
‘గ్రూప్–2’ తిరిగి మూల్యాంకనం
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–2 పరీక్షల్లో కొందరు అభ్యర్థులు వైట్నర్ వినియోగం, డబుల్ బబ్లింగ్‌కు పాల్పడిన వివాదంపై హైకోర్టు తీర్పు వెలువరించింది. మూల్యాంకనంలో సమస్యలు తలెత్తకుండా పలు మార్గదర్శకాలను సూచించింది. రెండు సార్లు బబ్లింగ్ చేసి అభ్యర్థులు గుర్తించిన జవాబులను, వైట్నర్ వినియోగించిన అభ్యర్థుల పత్రాలను పరిగణనలోకి తీసుకోరాదని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)ను ఆదేశించింది. 19 వివాదాస్పద ప్రశ్నలకు సమాధానం రాసిన అభ్యర్థులందరికీ మార్కులు ఇవ్వాలని, ఆ తర్వాతే తిరిగి మూల్యాంకనం చేపట్టి 1:2 నిష్పత్తిలో జాబితా రూపొందించాలని న్యాయమూర్తి జస్టిస్ పి. నవీన్‌రావు శుక్రవారం తీర్పు వెలువరించారు. జాబితా తయారీని వీడియో చిత్రీకరించాలని, అందులోని అభ్యర్థుల పత్రాల్ని పరిశీలించి వైట్నర్ వినియోగించిన వాటిని ఆ జాబితా నుంచి తొలగించాలన్నారు. ప్రశ్నపత్రంలోని 113కు మూడో జవాబు సరైనదని ప్రకటించారు. గ్రూప్–2 ద్వారా 1,032 పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2015 డిసెంబర్ 30న/2016 సెప్టెంబర్ మాసాల్లో రెండు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసింది. మొత్తం 600 ప్రశ్నలకుగాను 19 ప్రశ్నలు తప్పుగా వచ్చినట్లు కమిషన్ తేల్చి వాటిని మూల్యాంకనంలో పరిగణనలోకి తీసుకోలేదు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఓఎంఆర్ షీట్లలో డబుల్ బబ్లింగ్, వైట్నర్ వినియోగం చేసిన వారినే కాకుండా అభ్యర్థుల వివరాల నమోదులో తప్పులు చేసిన వారికీ అవకాశం కల్పించడంపై దాఖలైన పలు వ్యాజ్యాలపై హైకోర్టు సమగ్ర విచారణ జరిపింది. ఓఎంఆర్ షీట్ల పరిశీలనకు సీనియర్ న్యాయవాదులు పి. శ్రీరఘురాం, ఆర్. రఘునందన్‌రావు, ఎస్. నిరంజన్‌రెడ్డిలతో కమిటీని ఏర్పాటు చేసి టాప్ 5 వేల మంది అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను పరిశీలన చేయించింది. వైట్నర్ వినియోగించిన, డబుల్ బబ్లింగ్ చేసిన, వ్యక్తిగత వివరాల నమోదులో పొరపాట్లు చేసిన వారిని కూడా టీఎస్పీఎస్సీ అర్హులుగా గుర్తించడం వల్ల అర్హులైన అభ్యర్థులు నష్టపోతారంటూ హైదరాబాద్‌కు చెందిన రామచంద్రారెడ్డి సహా పలువురు దాఖలు చేసిన కేసులో గతంలోనే వాదనలు ముగించిన హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. గ్రూప్–2 పరీక్షల్లో 3,147 మంది అభ్యర్థులు అర్హత సాధించారని, 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూలు నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. అయితే హైకోర్టు తాజా తీర్పుతో 19 వివాదాస్పద ప్రశ్నలకు సమాధానాలు రాసిన అభ్యర్థులందరికీ మార్కులు ఇచ్చి ఆ తర్వాత తిరిగి మూల్యాంకనం చేపట్టనుంది. అలాగే వైట్నర్ వినియోగించిన, డబుల్ బబ్లింగ్ చేసిన పత్రాల్ని తొలగించి 1:2 నిష్పత్తిలో జాబితా రూపొందించాకే అర్హులను ఆ పోస్టులకు ఎంపిక చేయనుంది. -
మత్తు..బాల్యం చిత్తు!
♦ విచ్చలవిడిగా వైట్నర్, మత్తు మందుల విక్రయాలు ♦ కొరవడిన అధికారుల పర్యవేక్షణ ♦ చిన్నారుల ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు కర్నూలు(హాస్పిటల్): కర్నూలు నగరంతో పాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, కోడుమూరు, డోన్, ఆళ్లగడ్డ వంటి ప్రాంతాల్లో బాలలు, యువత అధికంగా మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. అనారోగ్యం బారినుంచి కాపాడేందుకు తయారు చేసిన మందులు కాస్తా వీరికి వ్యసనంగా మారుతున్నాయి. జిల్లాలో 2వేల వరకు మందుల దుకాణాలు ఉన్నాయి. పట్టణాల్లోని యువత కంటే గ్రామీణ, మండల స్థాయిలోని యువత ఎక్కువగా మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. దగ్గు సిరప్.. మత్తుకు స్టార్టప్! ప్రధానంగా దగ్గును తగ్గించే పలు రకాల సిరప్‌లను అధిక మోతాదులో సేవిస్తూ యువత మత్తుకు బానిసలవుతున్నారు. గతంలో ఓ కంపెనీ తయారు చేసిన దగ్గు మందును విచ్చలవిడిగా ఉపయోగించేవారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దీనిని రద్దు చేయగా, సదరు కంపెనీ కొన్ని నిబంధనలతో తిరిగి దానిని పునరుద్ధరించుకున్నట్లు సమాచారం. అయితే ఇందులో మత్తును కలిగించే ఔషదాన్ని డోసు తగ్గించి విక్రయిస్తున్నారు. దీంతో పాటు ప్రస్తుతం లభించే మరో కంపెనీ మందును స్టెరాయిడ్ మాత్రలతో కలిపి సేవిస్తూ యువత మత్తుకు బానిసలవుతున్నారు. దీనికితోడు ఆపరేషన్ సమయంలో రోగులకు వాడే ఫోర్ట్విన్ అనే మత్తు ఇంజెక్షన్లు సైతం ఆసుపత్రుల నుంచి బయటకు వస్తున్నాయి. వీటిని బయటి మెడికల్ షాపుల్లో విక్రయించకపోయినా నర్సింగ్‌హోమ్‌లు ఉండే ఆసుపత్రుల్లో మాత్రం లభిస్తున్నాయి. వాటిని ఆసుపత్రుల పారామెడికల్ సిబ్బందే కొందరు రోగుల పేరుతో అధికంగా కొనుగోలు చేసి, అధిక మొత్తానికి యువతకు విక్రయిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ ఇంజెక్షన్లు వేసుకున్న యువత గంటల తరబడి మత్తులో ఉంటోంది. ఇవేగాక నిద్ర మాత్రలు, ఒత్తిడి, డిప్రెషన్‌ను తగ్గించే మాత్రలు సైతం మందుల దుకాణాల్లో విచ్చలవిడిగా లభిస్తున్నాయి. అధికారుల దాడులకు బయపడి పట్టణాల్లో వీటి విక్రయంపై భయం ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలు యథేచ్ఛగా విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మత్తు పదార్థాలతో బాల్యం చిత్తవుతోంది. మొదట సరదాగానే మత్తు పదార్థాలు తీసుకున్నా చివరకు వాటికి బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ధనార్జనే ధ్యేయంగా జీవించే కొందరు వ్యాపారులు, వ్యక్తులు మత్తును కలిగించే పదార్థాలను పిల్లలకు, యువతకు అంటగట్టి వారి జీవితాల్లో అంధకారం నింపుతున్నారు. నిఘా అవసరం పిల్లలు, యువత, నిరుద్యోగుల వ్యవహారశైలిపై నిత్యం నిఘా ఉంచాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కళాశాలకు వెళ్లిన పిల్ల్లలు ఇంటికి ఆలస్యంగా రావడం, కొత్త స్నేహితులతో పరిచయం, వారిలో వస్తున్న మార్పులను గమనిస్తూ తల్లిదండ్రులు కనిపెడుతూ ఉండాలని పేర్కొంటున్నారు. అయితే వారిపై నిఘా కొరవడంతోనే మత్తుకు అలవాటు పడిపోతున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైట్నర్ మత్తులో బాల్యం స్టేషనరి, బుక్‌షాప్‌లలో లభించే ఇంకు మరకలను చెరిపి వేసే వైట్నర్లే పలువురు బాలలు మత్తు పదార్థాలుగా వినియోగిస్తున్నారు. ఈ మందును చేతి రుమాలుపై వేసుకుని, ఆ వాసనను పీలుస్తూ గంటల తరబడి మత్తులో జోగుతున్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, మార్కెట్ల వద్ద కనిపించే వీధి బాలలతో పాటు కొందరు యువకులు, భిక్షాటన చేసే మహిళలు సైతం వైట్నర్ మత్తుకు దాసోహమవుతున్నారు. -
వైట్నర్ తాగితే ఆగడు
► 6 నెలల్లో 13 చోరీలు ► చోరీ సొత్తుతో లాటరీ టికెట్ల కొనుగోలు ► ఘరానా దొంగ అరెస్టు కుత్బుల్లాపూర్: అతనో ఘరానా దొంగ వైట్నర్ తాగాడంటే ఏదో ఒక ఇళ్లు కొళ్లగొట్టాల్సిందే. చోరీ సొత్తుతో లాటరీ టిక్కెట్లు కొని అదృష్టాన్ని పరీక్షించుకుంటాడు. తాగుడుకు బానిసై దొంగతనాలు, హత్యలకు పాల్పడుతూ పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినా అదే పంథాను అనుసరిస్తున్న పాత నేరస్తుడిని పేట్‌బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ రంగారెడ్డి మంగళవారం వివరాలు వెల్లడించారు. నాందేడ్‌కు చెందిన సయ్యద్ అజీజ్ నగరానికి వలసవచ్చి సూరారం కాలనీ ఓం జెండా వద్ద ఉంటూ ఆటో డ్రైవర్‌గా జీవనం కొనసాగించేవాడు. గతంలో అతనిపై పలు పోలీస్స్టేషన్ల పరిధిలో చోరీ కేసులు ఉన్నాయి జీడిమెట్ల పోలీసులు అతడిని అరెస్టు చేసి పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు పంపారు. గత డిసెంబర్లో బయటికి వచ్చిన అబ్బాస్ఆరు నెలల వ్యవధిలో జీడిమెట్ల పరిధిలో 6, పేట్ బషీరాబాద్ పరిధిలో 6, చందానగర్ ఒక దొంగతనానికి పాల్పడ్డాడు. సోమవారం సాయంత్రం గోదావరి హోమ్స్ వద్ద పోలీసులు అబ్బాస్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించాడు. అతడి నుంచి 32 తులాల బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. -
‘వైట్నర్’ను ఎందుకు నిషేధించకూడదు?
- దాని లభ్యతపై నియంత్రణ విధించండి - ఉభయ రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాత, టైపింగ్ సందర్భంగా దొర్లే తప్పిదాలను సరిదిద్దేందుకు ఉపయోగించే ‘వైట్నర్’ మత్తు పదార్థంగా మారుతున్న నేపథ్యంలో దానిపై నిషేధం ఎందుకు విధించకూడదని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ప్రశ్నించింది. కనీసం వైట్నర్ లభ్యతపై నియంత్రణ విధించాలని, ఈ విషయంపై ఆలోచన చేయాలని స్పష్టం చేసింది. తద్వారా భవిష్యత్ తరాలకు సాయం చేయాలని సూచించింది. ఈ వ్యవహారంలో ఏ నిర్ణయాన్ని తమకు తెలియచేయాలని ఇరు ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. 2012లో పిల్: వీధి బాలలు వైట్నర్ను మత్తు పదార్థంగా ఉపయోగిస్తూ తమ బాల్యాన్ని, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని, వైట్నర్, థిన్నర్లను పిల్లలకు విక్రయించకుండా చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ నెల్లూరు జిల్లాకు చెందిన వసంత లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ 2012లో హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం రెండు రోజుల క్రితం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ ద్రవ రూపంలో కాకుండా పెన్ రూపంలో వైట్నర్ అందుబాటులో ఉందని, ద్రవ రూపంతోనే ప్రమాదం ఎక్కువని ఆమె వివరించారు. ఏపీ ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు సమాధానమిస్తూ, డ్రగ్స్ అండ్ కాస్మిటిక్స్ చట్ట పరిధిలో వైట్నర్ లేదని, అందువల్ల నిషేధం లేదన్నారు.