‘గ్రూప్‌–2’ తిరిగి మూల్యాంకనం | High Court Gives Green Signal For Group 2 Recruitment Process | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 12 2018 4:05 PM | Last Updated on Sat, Oct 13 2018 2:09 AM

High Court Gives Green Signal For Group 2 Recruitment Process - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–2 పరీక్షల్లో కొందరు అభ్యర్థులు వైట్‌నర్‌ వినియోగం, డబుల్‌ బబ్లింగ్‌కు పాల్పడిన వివాదంపై హైకోర్టు తీర్పు వెలువరించింది. మూల్యాంకనంలో సమస్యలు తలెత్తకుండా పలు మార్గదర్శకాలను సూచించింది. రెండు సార్లు బబ్లింగ్‌ చేసి అభ్యర్థులు గుర్తించిన జవాబులను, వైట్‌నర్‌ వినియోగించిన అభ్యర్థుల పత్రాలను పరిగణనలోకి తీసుకోరాదని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)ను ఆదేశించింది. 19 వివాదాస్పద ప్రశ్నలకు సమాధానం రాసిన అభ్యర్థులందరికీ మార్కులు ఇవ్వాలని, ఆ తర్వాతే తిరిగి మూల్యాంకనం చేపట్టి 1:2 నిష్పత్తిలో జాబితా రూపొందించాలని న్యాయమూర్తి జస్టిస్‌ పి. నవీన్‌రావు శుక్రవారం తీర్పు వెలువరించారు.

జాబితా తయారీని వీడియో చిత్రీకరించాలని, అందులోని అభ్యర్థుల పత్రాల్ని పరిశీలించి వైట్‌నర్‌ వినియోగించిన వాటిని ఆ జాబితా నుంచి తొలగించాలన్నారు. ప్రశ్నపత్రంలోని 113కు మూడో జవాబు సరైనదని ప్రకటించారు. గ్రూప్‌–2 ద్వారా 1,032 పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 2015 డిసెంబర్‌ 30న/2016 సెప్టెంబర్‌ మాసాల్లో రెండు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసింది. మొత్తం 600 ప్రశ్నలకుగాను 19 ప్రశ్నలు తప్పుగా వచ్చినట్లు కమిషన్‌ తేల్చి వాటిని మూల్యాంకనంలో పరిగణనలోకి తీసుకోలేదు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఓఎంఆర్‌ షీట్లలో డబుల్‌ బబ్లింగ్, వైట్‌నర్‌ వినియోగం చేసిన వారినే కాకుండా అభ్యర్థుల వివరాల నమోదులో తప్పులు చేసిన వారికీ అవకాశం కల్పించడంపై దాఖలైన పలు వ్యాజ్యాలపై హైకోర్టు సమగ్ర విచారణ జరిపింది. ఓఎంఆర్‌ షీట్ల పరిశీలనకు సీనియర్‌ న్యాయవాదులు పి. శ్రీరఘురాం, ఆర్‌. రఘునందన్‌రావు, ఎస్‌. నిరంజన్‌రెడ్డిలతో కమిటీని ఏర్పాటు చేసి టాప్‌ 5 వేల మంది అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లను పరిశీలన చేయించింది. వైట్‌నర్‌ వినియోగించిన, డబుల్‌ బబ్లింగ్‌ చేసిన, వ్యక్తిగత వివరాల నమోదులో పొరపాట్లు చేసిన వారిని కూడా టీఎస్‌పీఎస్సీ అర్హులుగా గుర్తించడం వల్ల అర్హులైన అభ్యర్థులు నష్టపోతారంటూ హైదరాబాద్‌కు చెందిన రామచంద్రారెడ్డి సహా పలువురు దాఖలు చేసిన కేసులో గతంలోనే వాదనలు ముగించిన హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. గ్రూప్‌–2 పరీక్షల్లో 3,147 మంది అభ్యర్థులు అర్హత సాధించారని, 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూలు నిర్వహించాలని కమిషన్‌ నిర్ణయించింది. అయితే హైకోర్టు తాజా తీర్పుతో 19 వివాదాస్పద ప్రశ్నలకు సమాధానాలు రాసిన అభ్యర్థులందరికీ మార్కులు ఇచ్చి ఆ తర్వాత తిరిగి మూల్యాంకనం చేపట్టనుంది. అలాగే వైట్‌నర్‌ వినియోగించిన, డబుల్‌ బబ్లింగ్‌ చేసిన పత్రాల్ని తొలగించి 1:2 నిష్పత్తిలో జాబితా రూపొందించాకే అర్హులను ఆ పోస్టులకు ఎంపిక చేయనుంది.   


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement