‘వైట్నర్’ను ఎందుకు నిషేధించకూడదు?
- దాని లభ్యతపై నియంత్రణ విధించండి
- ఉభయ రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాత, టైపింగ్ సందర్భంగా దొర్లే తప్పిదాలను సరిదిద్దేందుకు ఉపయోగించే ‘వైట్నర్’ మత్తు పదార్థంగా మారుతున్న నేపథ్యంలో దానిపై నిషేధం ఎందుకు విధించకూడదని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ప్రశ్నించింది. కనీసం వైట్నర్ లభ్యతపై నియంత్రణ విధించాలని, ఈ విషయంపై ఆలోచన చేయాలని స్పష్టం చేసింది. తద్వారా భవిష్యత్ తరాలకు సాయం చేయాలని సూచించింది.
ఈ వ్యవహారంలో ఏ నిర్ణయాన్ని తమకు తెలియచేయాలని ఇరు ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది.
2012లో పిల్: వీధి బాలలు వైట్నర్‌ను మత్తు పదార్థంగా ఉపయోగిస్తూ తమ బాల్యాన్ని, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని, వైట్నర్, థిన్నర్‌లను పిల్లలకు విక్రయించకుండా చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ నెల్లూరు జిల్లాకు చెందిన వసంత లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ 2012లో హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం రెండు రోజుల క్రితం మరోసారి విచారించింది.
ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ ద్రవ రూపంలో కాకుండా పెన్ రూపంలో వైట్నర్ అందుబాటులో ఉందని, ద్రవ రూపంతోనే ప్రమాదం ఎక్కువని ఆమె వివరించారు. ఏపీ ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు సమాధానమిస్తూ, డ్రగ్స్ అండ్ కాస్మిటిక్స్ చట్ట పరిధిలో వైట్నర్ లేదని, అందువల్ల నిషేధం లేదన్నారు.