మరో రాష్ట్రంలో గోమాంసం నిషేధం!
శ్రీనగర్: రాష్ట్రంలో గోమాంసం అమ్మకాలను నిషేధించాలని జమ్మూకాశ్మీర్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా తమ తీర్పును పకడ్బందీగా అమలుచేసేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హామీ పూర్వకమైన వివరణ కూడా కోర్టుకు సమర్పించాలని సూచించింది. ఇప్పటికే జైనుల పవిత్ర కార్యక్రమం పర్యుషాన్ సందర్భంగా ముంబయిలో మాంసం నిషేధిస్తూ బీజేపీ తీసుకున్న నిర్ణయంపట్ల పలువర్గాల నుంచి అసంతృప్తి వస్తున్న నేపథ్యంలో హైకోర్టు ఈ తీర్పు వెలువరించడం మరింత చర్చనీయాంశమైంది.
తమ రాష్ట్రంలో బీఫ్ మాంసం నిషేధించాలని, దాని వినియోగాన్ని నిలువరించాలని కొందరు వ్యక్తులు హైకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో ఆ మేరకు కోర్టు తీర్పునిచ్చింది. అయితే, జమ్మూకాశ్మీర్లో ఈ మాంసం ఉపయోగించేవారి సంఖ్య చాలా ఎక్కువ. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా పూర్తిగా మాంసం విక్రయాలను నిలువరించడం పూర్తిగా నిషేధించడం ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరమైన విషయమే. హైకోర్టు ఇచ్చిన మరుసటి రోజు కూడా అక్కడ బీఫ్ మాంసం దుకాణాలు తీసి ఉంచారు. హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రాలు గోమాంసం విక్రయాలపై నిషేధించారు.