దైవభక్తితో రాజకీయాలు తగదు
చినజీయర్ స్వామి
సీతానగరం (తాడేపల్లి రూరల్): దైవ భక్తితో రాజకీయాలు చేయకుండా మన సంప్రదాయాలను, కట్టుబాట్లను కాపాడాలని చినజీయర్ స్వామి అన్నారు. సీతానగరం ఆశ్రమంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా దైవ కార్యక్రమాల్లో రాజకీయ నాయకులు ప్రవేశించి తమ రాజకీయాలు చూపిస్తున్నారని అన్నారు. ఉత్తర భారతదేశంలో ఈ మధ్య జరిగిన కుంభమేళాలో ప్రతి రోజూ కోటి మంది పుణ్యస్నానాలు ఆచరించినా ఎలాంటి వివాదాలకు తావులేకుండా నిర్వహించారన్నారు. దక్షిణ భారతదేశంలో మాత్రం చిన్న కార్యక్రమం నిర్వహించినా వివాదాలకు కారణమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులు కృష్ణా పుష్కరాలలో 12 రోజులలో ఎప్పుడైనా స్నానం ఆచరించవచ్చని చెప్పారు. విజయవాడ, సీతానగరం ఘాట్లలోనే స్నానం ఆచరించాల్సిన అవసరం లేదని, కృష్ణా తీరం వెంబడి ఎక్కడైనా స్నానమాచరించవచ్చని స్పష్టం చేశారు.