మీకు దమ్ముంటే..
కొత్తపేట నియోజకవర్గంలోని వాడపాలెం గ్రామంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై పోలీసు జులుంను ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గట్టిగా ఖండించారు. టీడీపీ నేతల చెప్పుచేతల్లో నడుస్తూ అమాయకులపై ప్రతాపం చూపిస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే తనను అరెస్టు చేయాలని ఎస్సైని సవాల్ చేశారు.
కొత్తపేట : ‘ఎస్సై గారు.. వాడపాలెంలో గొడవేంటి? గొడవకు కారణమైన వ్యక్తి ఏడీ? అతడిని అరెస్టు చేశారా? చేయరు, ఎందుకంటే అతడు టీడీపీ వ్యక్తి కాబట్టి. మీరు చేసిందేమిటి? మీ ప్రతాపం ప్రదర్శించడానికి.. ఫిర్యాదు చేసిన వైఎస్సార్ సీపీకి చెందిన యువకులు, అయ్యప్ప భక్తులే కనిపించారా?’ అంటూ కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి.. ఎస్సై డి.విజయకుమార్‌ను నిలదీశారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.
వాడపాలెం గ్రామంలో ఆదివా రం కనకదుర్గాదేవి ఊరేగింపు సందర్భంగా వైఎ స్సార్ సీపీకి చెందిన యువకుడు ఉత్సవ కమిటీ అనుమతితో సౌండ్‌సిస్టం ఏర్పాటుచేశాడు. ఆ వ్యాన్‌కు అతడి పేరున ఫ్రెండ్ సర్కిల్ ఫ్లెక్సీ తగి లించారు. అది ఇష్టం లేని టీడీపీకి చెందిన వ్యక్తి దానిని చింపేయడంతో వివాదం తలెత్తింది.
వైఎస్సార్ సీపీకి చెందిన యువకుడు ఫోన్ చేయగా, పోలీసులు వచ్చి అక్కడున్న వారిని చెదరగొట్టా రు. గుర్తు తెలియని వ్యక్తి విసిరిన రాయి తగిలి ఎస్సైకి స్వల్ప గాయమైంది. దాంతో పోలీసులు వారికి సమీపంలో ఉన్న ఫిర్యాదుదారుడు, వైఎ స్సార్ సీపీకి చెందిన అయ్యప్ప భక్తులపై తమ ప్ర తాపం చూపించారు. సంఘటన స్థలంలో లేనివారినీ అదుపులోకి తీసుకున్నారనేది ఆరోపణ.
బాధితులకు పరామర్శ
కాగా మంగళవారం హైదరాబాద్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి వాడపాలెం వెళ్లి బాధిత యువకుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. నాయకులతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ఎస్సై పక్షపాత ధోరణిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘టీడీపీకి వ్యతిరేకంగా, తనకు అనుకూలంగా ఓటు వేశారనే కక్షతో ఆ నాయకులు చెప్పిన వారిని అరెస్టు చేస్తారా? మీరు ఉద్యోగమనేది చేస్తున్నారా? మీకు, మీ పోలీస్ అధికారులకు దమ్ము, ధైర్యం ఉంటే నన్ను అరెస్టు చేయండి’ అని సవాల్ విసిరారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించి తమ వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడితే.. చూస్తూ ఊరుకోనని స్పష్టం చేశారు. వాడపాలెంలో తమ వారిని వదిలేది లేదంటే.. వారి తరఫున తానే వస్తానని చెప్పారు.
తనపై ప్రతాపం చూపండంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎప్పుడూ తప్పును సమర్ధించేది లేదని స్పష్టం చేశారు. గొడవకు కారణమైన వ్యక్తిని, మిమ్మల్ని కొట్టిన వ్యక్తిని ఎప్పుడు అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. అతడికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేస్తారా అని నిలదీశారు. అతడి కోసం గాలిస్తున్నామని, ఊర్లో లేడని, ఎట్టి పరిస్థితుల్లోను రెండు రోజుల్లో అరెస్టు చేస్తామని ఎస్సై చెప్పారు. అనంతరం జగ్గిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ఇంతటితో వదలనని చెప్పారు. డీజీపీ దృష్టికి తీసుకువెళతానని, అలాగే పార్టీ రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకువెళ్లి.. కొత్తపేటలో అధికార పార్టీ ఆగడాలు, వారికి తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులపై ప్రతిఘటన కార్యక్రమం చేపడతానని హెచ్చరించారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, మండల అధ్యక్షుడు ముత్యాల వీరభద్రరావు, జిల్లా సభ్యుడు బండారు కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు