East Godavari district police
-
తుపాకులా.. పప్పుబెల్లాలా?!
సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: పోలీస్ కార్యాలయంలో దాచిన ఆయుధాలను పట్టుకుపోయారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 582 పైచిలుకు ఆయుధాలను పంచేసుకున్నారు. ఈ పనిచేసింది ఎవరో దొంగలు కాదు.. ఏకంగా పోలీసులే. పోలీస్ అధికారులు స్థాయిని బట్టి ఇది నీకు.. అది నాకు.. అన్నట్టుగా తలా ఒకటి తీసేసుకున్నారు. విషయం బయటపడకుండా అంతా పక్కాగా టెండర్లు పిలిచినట్టు ఓ నాటకానికి తెరతీసి రక్తి కట్టించారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. 1969 నుంచి జిల్లా కేంద్రం కాకినాడ పోలీస్ కార్యాలయం ఆర్మర్డ్ రిజర్వులో భద్రపరిచిన 582 ఆయుధాలను నామ్‌కే వాస్తేగా వేలం వేసి పోలీస్ అధికారులు పంచేసుకోవడం ప్రకంపనలు సృష్టిస్తోంది. చట్ట విరుద్ధంగా ఆయుధాలను కలిగి ఉన్న వారి నుంచి స్వాధీనం చేసుకున్న తుపాకులు, అలాగే లైసెన్స్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్న తుపాకులను తీసుకెళ్లకపోవడం.. వంటి వాటిని ఆర్మ్డ్ రిజర్వులో భద్రపరుస్తారు. డీజీ అనుమతితో వాటిని వేలం వేస్తుంటారు. అయితే వాటిని వేలం వేయాలంటే.. డీజీపీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. డీజీ కార్యాలయం నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి. అనంతరం వేలం వేస్తున్నట్టుగా పత్రికల్లో ప్రకటన ఇవ్వాలి. ఇవన్నీ జరిగాక సీల్డ్ కమ్ ఓపెన్ టెండర్లు పిలవాలి. ఆయుధాలు ఎన్ని వేలం వేస్తున్నారు.. వాటి ఖరీదు ఎంత.. అనేది నిర్ధారించాక, నిర్దేశించిన తేదీన వేలం వేయాలి. అలాగే వేలంలో అత్యధికంగా కోడ్ చేసిన ఆయుధాలు కొనుగోలు, విక్రయ లైసెన్స్ కలిగిన వారి టెండర్‌ను ఖరారు చేయాలి. ఆ వచ్చిన సొమ్మును ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలి. నిబంధనలకు పాతర నిబంధనలన్నింటికీ పోలీసులు పాతశారు. లైసెన్స్ ఉన్న ఓ కాంట్రాక్టర్‌తో కుమ్మక్కయ్యారు. 17 చలానాలు తీయించి నామ్‌కే వాస్తేగా టెండర్లు వేయించారు. హైదరాబాద్ అబిడ్స్‌కు చెందిన రాజధాని ఆరŠమ్స్ మేనేజింగ్ పార్టనర్ అఫ్జల్ పేరుతో 2021 ఏప్రిల్‌లో టెండర్ ఖరారు చేశారు. టెండర్లో రూ.8 లక్షలు వచ్చినట్టుగా రికార్డు చేసి ఖజానాలో జమ చేశారు. అసలు టెండర్లు పిలవకుండానే, ఆయుధాలకు ధర నిర్ణయించకుండానే రూ.8 లక్షలకు ఖరారు చేయడం విస్మయానికి గురిచేస్తోంది. ఆ విధంగా రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల వరకూ ఖజానాకు కన్నం వేశారు. ఇందులో అప్పటి పోలీస్ అధికారులు చక్రం తిప్పి ఆయుధాలను సొంతం చేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. పోలీసులు పంచేసుకున్న వాటిలో ఫిస్టళ్లు, రివాల్వర్లు, ఎస్బీబీఎల్(సింగిల్ బ్యారెల్ బీచ్‌లోడెడ్), డీబీబీఎల్ (డబుల్ బ్యారెల్ బీచ్‌లోడెడ్) తుపాకులు, కార్బన్.. ఇలా పలు రకాల ఆయుధాలున్నాయి. వీటిలో రష్యా, బ్రెజిల్, బెల్జియం, యూఎస్ దేశాల్లో తయారైన అత్యంత ఆధునిక ఆయుధాలు చాలానే ఉన్నాయి. రూ.ఆరు లక్షలు, రూ.ఏడు లక్షల విలువైన ఆయుధాలూ కొన్ని ఉన్నాయి. అఫ్జల్‌తో మాట్లాడుకుని ఇవన్నీ కలిపి వేలం వేస్తున్నట్టు రికార్డులు సృష్టించి.. ఒక పోలీస్ అధికారి, స్పెషల్ బ్రాంచ్‌కు చెందిన ఓ డీఎస్పీ, ఒక ఇన్స్పెక్టర్.. ఇలా వివిధ స్థాయిల్లో పోలీసులు తమకు నచ్చినవి ఎత్తుకెళ్లిపోయారు. ఆ ఫిర్యాదుతో వెలుగులోకి.. గన్ లైసెన్సు రెన్యువల్ కోసం చేసుకున్న దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా తుపాకీ తిరిగి ఇవ్వడం లేదని అనపర్తికి చెందిన రెడ్డి అనే వ్యక్తి ఇటీవల జిల్లా పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. బెల్జియానికి చెందిన అత్యంత ఖరీదైన తుపాకీ కోసం అతను పదే పదే అడగడంతో ప్రస్తుత జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ఆరా తీస్తే.. ఈ ఆయుధాల కుంభకోణం బయటపడింది. వాస్తవంగా ఆయుధాలకు వేలం వేసే ముందు సీజ్ చేసిన ఆయుధాలు, లైసెన్స్ రెన్యువల్ కోసం దరఖాస్తుచేసుకున్న వారికి కూడా నోటీసులివ్వాలి. అలా ఎవరికీ నోటీసులిచ్చిన దాఖలాలు లేకపోవడాన్ని గుర్తించారు. ఈ కుంభకోణంలో నిజాలు నిగ్గు తేల్చే దిశగా కాకినాడ స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రాథమిక ఆధారాలతో కాకినాడ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ ఫిర్యాదుతో ఆయుధాల మాయంపై కేసు నమోదైంది. లోతుగా విచారిస్తున్నాం.. ఆయుధాల టెండర్ల వ్యవహారం మా దృష్టికొచ్చింది. అన్ని విషయాలనూ లోతుగా విచారిస్తున్నాం. – ఎం.రవీంద్రనాథ్‌బాబు, ఎస్పీ.. తూర్పుగోదావరి జిల్లా -
వెయ్యి కిలోల గంజాయి స్వాధీనం
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం వేటుకూరు జంక్షన్ వద్ద పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 1005 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి.. ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి చెందిన రెండు లారీలు, ఓ కారు, నాలుగు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. -
కన్నబిడ్డ బలికి ఓ తల్లి యత్నం!
రాజమహేంద్రవరంలో ‘గుప్త నిధుల’ కలకలం సాక్షి, రాజమహేంద్రవరం: గుప్తనిధుల కోసం కన్నబిడ్డను బలివ్వడానికి ఓ మహిళ ప్రయత్నించిందంటూ వచ్చిన ఆరోపణలు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కలకలం రేపాయి.కడియం మండలం బుర్రిలంక గ్రామానికి చెందిన తడాల గణపతి రాజమహేంద్రవరంలోని నారాయణపురంలో అద్దెకు ఉంటున్నాడు. రంపచోడవరం మండలం బి.వెలమకోటకు చెందిన పార్వతి తన భర్తను వదిలేసి దేవీపట్నం మండలం గంగపాలేనికి చె ందిన కోసు వెంకన్నదొరతో ఉంటోంది. వీరికి అమలాపురానికి చెందిన ఏసీ మెకానిక్ కాళీ రామ్‌కుమార్, గణపతితో పరిచయముంది. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి పార్వతి తనకు ఒంట్లో బాగోలేదంటూ మొదటి భర్త ద్వారా పుట్టిన కుమార్తె పావని(6), వెంకన్నదొర, కాళీ రామ్‌కుమార్‌లతో కలసి గణపతి ఇంటికి వచ్చింది. అర్ధరాత్రి ఇంట్లో ఏవో పూజలు చేశారు. అనంతరం ఇంటి వెనుక ఉన్న ఎఫ్‌సీఐ గోడౌన్ ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. ఇది గమనించిన స్థానికులు క్షుద్రపూజలు జరుగుతున్నాయని, బాలికను బలి ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అరెస్ట్ చేశారు. గణపతి ఇంట్లో తనిఖీలు చేసి పూజా సామగ్రి, కత్తి, పార, గునపం స్వాధీనం చేసుకున్నారు. బాలికను ప్రశ్నించగా తనకేమీ తెలియదని, తల్లితో వచ్చినట్లు తెలిపింది. ఎం.శ్రీనివాస్, మరో ఇద్దరు నిందితులు పరారయ్యారని సీఐ సుబ్రహ్మణ్యేశ్వరరావు చెప్పారు. -
గుప్త నిధుల కోసం బాలికను బలివ్వబోయారా..?
రాజమండ్రి క్రైమ్: గుప్తనిధుల కోసం క్షుద్ర పూజలు చేస్తున్న నలుగురిని రాజమండ్రిలో పోలీసులు శనివారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కడియం మండలం గుర్లంక గ్రామానికి చెందిన గణపతి రాజమండ్రి నారాయణపురంలో ఎఫ్‌సీఐ గోదాముల వెనుక ఓ గది అద్దెకు తీసుకుని ఆరు నెలలుగా నివాసం ఉంటున్నాడు. ఇతడి దగ్గరకు వెంకన్నదొర (దేవీపట్నం), అమలాపురం పట్టణానికి చెందిన రామ్‌కుమార్, రంపచోడవరం మండలానికి చెందిన కాణెం పార్వతీదేవి, ఆమె కుమార్తె పావని (7) శనివారం వచ్చారు. అర్ధరాత్రి వీరి గదిలో క్షుద్ర పూజలు జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వారు ఆ ప్రాంతానికి చేరుకుని నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో బాలిక మగత స్థితిలో ఉండడం, క్షుద్ర పూజలకు సంబంధించిన సామగ్రితోపాటు కత్తి, రెండు గడ్డపారలు కనిపించడంతో బాలికను బలిచ్చే ప్రయత్నంలో ఉన్నట్టు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే సామానులు కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. విచారణ అనంతరం మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. -
మీకు దమ్ముంటే..
కొత్తపేట నియోజకవర్గంలోని వాడపాలెం గ్రామంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై పోలీసు జులుంను ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గట్టిగా ఖండించారు. టీడీపీ నేతల చెప్పుచేతల్లో నడుస్తూ అమాయకులపై ప్రతాపం చూపిస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే తనను అరెస్టు చేయాలని ఎస్సైని సవాల్ చేశారు. కొత్తపేట : ‘ఎస్సై గారు.. వాడపాలెంలో గొడవేంటి? గొడవకు కారణమైన వ్యక్తి ఏడీ? అతడిని అరెస్టు చేశారా? చేయరు, ఎందుకంటే అతడు టీడీపీ వ్యక్తి కాబట్టి. మీరు చేసిందేమిటి? మీ ప్రతాపం ప్రదర్శించడానికి.. ఫిర్యాదు చేసిన వైఎస్సార్ సీపీకి చెందిన యువకులు, అయ్యప్ప భక్తులే కనిపించారా?’ అంటూ కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి.. ఎస్సై డి.విజయకుమార్‌ను నిలదీశారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. వాడపాలెం గ్రామంలో ఆదివా రం కనకదుర్గాదేవి ఊరేగింపు సందర్భంగా వైఎ స్సార్ సీపీకి చెందిన యువకుడు ఉత్సవ కమిటీ అనుమతితో సౌండ్‌సిస్టం ఏర్పాటుచేశాడు. ఆ వ్యాన్‌కు అతడి పేరున ఫ్రెండ్ సర్కిల్ ఫ్లెక్సీ తగి లించారు. అది ఇష్టం లేని టీడీపీకి చెందిన వ్యక్తి దానిని చింపేయడంతో వివాదం తలెత్తింది. వైఎస్సార్ సీపీకి చెందిన యువకుడు ఫోన్ చేయగా, పోలీసులు వచ్చి అక్కడున్న వారిని చెదరగొట్టా రు. గుర్తు తెలియని వ్యక్తి విసిరిన రాయి తగిలి ఎస్సైకి స్వల్ప గాయమైంది. దాంతో పోలీసులు వారికి సమీపంలో ఉన్న ఫిర్యాదుదారుడు, వైఎ స్సార్ సీపీకి చెందిన అయ్యప్ప భక్తులపై తమ ప్ర తాపం చూపించారు. సంఘటన స్థలంలో లేనివారినీ అదుపులోకి తీసుకున్నారనేది ఆరోపణ. బాధితులకు పరామర్శ కాగా మంగళవారం హైదరాబాద్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి వాడపాలెం వెళ్లి బాధిత యువకుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. నాయకులతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ఎస్సై పక్షపాత ధోరణిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘టీడీపీకి వ్యతిరేకంగా, తనకు అనుకూలంగా ఓటు వేశారనే కక్షతో ఆ నాయకులు చెప్పిన వారిని అరెస్టు చేస్తారా? మీరు ఉద్యోగమనేది చేస్తున్నారా? మీకు, మీ పోలీస్ అధికారులకు దమ్ము, ధైర్యం ఉంటే నన్ను అరెస్టు చేయండి’ అని సవాల్ విసిరారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించి తమ వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడితే.. చూస్తూ ఊరుకోనని స్పష్టం చేశారు. వాడపాలెంలో తమ వారిని వదిలేది లేదంటే.. వారి తరఫున తానే వస్తానని చెప్పారు. తనపై ప్రతాపం చూపండంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎప్పుడూ తప్పును సమర్ధించేది లేదని స్పష్టం చేశారు. గొడవకు కారణమైన వ్యక్తిని, మిమ్మల్ని కొట్టిన వ్యక్తిని ఎప్పుడు అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. అతడికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేస్తారా అని నిలదీశారు. అతడి కోసం గాలిస్తున్నామని, ఊర్లో లేడని, ఎట్టి పరిస్థితుల్లోను రెండు రోజుల్లో అరెస్టు చేస్తామని ఎస్సై చెప్పారు. అనంతరం జగ్గిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ఇంతటితో వదలనని చెప్పారు. డీజీపీ దృష్టికి తీసుకువెళతానని, అలాగే పార్టీ రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకువెళ్లి.. కొత్తపేటలో అధికార పార్టీ ఆగడాలు, వారికి తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులపై ప్రతిఘటన కార్యక్రమం చేపడతానని హెచ్చరించారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, మండల అధ్యక్షుడు ముత్యాల వీరభద్రరావు, జిల్లా సభ్యుడు బండారు కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు -
పోలీసుల తీరుపై కోర్టుకు వెళ్తాం
రాజమండ్రి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆ పార్టీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మీ ఆరోపించారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జక్కంపూడి విజయలక్ష్మీ మాట్లాడుతూ... మహిళనని కూడా చూడకుండా పోలీసులు అగౌరవంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పోలీసుల తీరుపై కోర్టుకు వెళ్తామని ఆమె స్పష్టం చేశారు. ప్రశాంతంగా బంద్ చేస్తున్న తమ పార్టీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని జక్కంపూడి విజయలక్ష్మి విమర్శించారు. -
కొత్తపల్లి వద్ద భారీగా గంజాయి స్వాధీనం
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి వద్ద పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 62 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టే చేశారు. అలాగే వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని కూడా సీజ్ చేశారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దొంగలు అరెస్ట్ : భారీగా కార్లు స్వాధీనం
కాకినాడ: వాహనాల చోరీ చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును తూర్పు గోదావరి జిల్లా పోలీసులు మంగళవారం రట్టు చేశారు. ముఠాకు చెందిన నలుగురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా నగదుతోపాటు లారీ, టాటా ఇండికా కారు, ఐదు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని సీజ్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా దొంగలను పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. -
ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించండి... ప్లీజ్
ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించాలని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. అయితే ఆమెకు న్యాయం జరగకపోగా.. యువకుడి బంధువులు ఆమెపై దాడికి తెగబడ్డారు. బాధితురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సఖినేటిపల్లి మండలం లక్కవరానికి చెందిన రుద్ర సత్యనారాయణ మూర్తి ధాన్యం కొనుగోలు వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం కోసం రామేశ్వరానికి చెందిన అడబాల జ్యోతి తండ్రి వద్దకు అతడు వచ్చేవాడు. ఈ క్రమంలో సత్యనారాయణమూర్తి, జ్యోతి మధ్య పరిచయం ప్రేమగా మారింది. 2011 డిసెంబర్ నుంచి వీరు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అతడు జ్యోతిని వంచించాడు. పెళ్లి చేసుకోమని ఆమె నిలదీయగా.. తన తల్లిదండ్రులు ఒప్పుకోవాలని బదులిచ్చాడు. ఈ విషయాన్ని ఆమె తన పెద్దలకు చెప్పింది. రూ.5 లక్షలు కట్నంగా ఇస్తే పెళ్లికి ఒప్పుకుంటామని యువకుడి తల్లిదండ్రులు పెద్దల సమక్షంలో అంగీకరించారు. ఆమె తండ్రి అప్పు చేసి, కట్నం సొమ్ము సిద్ధం చేయగా, సత్యనారాయణ మూర్తి ముఖం చాటేశాడు. ఐదు నెలలుగా పెద్దల వద్దకు తిరిగినా ఫలితం లేకపోవడంతో.. ఆమె రెండు నెలల క్రితం సఖినేటిపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అతడు ఉండే గ్రామం తమ పరిధిలోనిది కాదని చెప్పడంతో, మలికిపురం పోలీసులను ఆశ్ర యించింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ నెల ఏడో తేదీన పెద్దలతో కలిసి సత్యనారాయణ మూర్తి ఇంటికి వెళ్లిన బాధితురాలిపై అతడి బంధువులు దాడి చేసి గాయపరిచారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని బాధితురాలితో పాటు ఆమె తల్లి నాగవేణి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మలికిపురం ఎస్సై ఎస్కే సాదిఖ్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా, యువతి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. -
స్టీల్ బిందెల లారీ లోడ్‌ను సీజ్ చేసిన పోలీసులు
ఎన్నికల నేపథ్యంలో కడియం మండలం పొట్టిలంక చెక్‌పోస్ట్ వద్ద శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అందులోభాగంగా వెయ్యి స్టీల్ బిందెల లోడ్‌తో వెళ్తున్న లారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టీల్ బిందెలపై పోలీసులు లారీ డ్రైవర్‌ను ప్రశ్నించగా పొంత లేని సమాధానాలు చెప్పుతుండటంతో లారీతోపాటు స్టీల్ బిందెలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం లారీని పోలీస్ స్టేషన్‌కు తరలించి సీజ్ చేశారు.డ్రైవర్, క్లీనర్లను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పట్టుబడిన బిందెలు ఓటర్లకు పంచేందుకు తీసుకువెళ్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఎన్నిక సమీస్తున్న తరుణంలో ఓటర్లకు గాలం వేసేందుకు రాజకీయ నాయకులు తమ చర్యలు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. అందులోభాగంగా గత రెండు రోజుల క్రితం విజయవాడ నగర టీడీపీ సీనియర్ నేత గద్దె రామ్మోహన్ నివాసంలో భారీగా చీరలు స్వాధీనం చేసుకున్న విషయం విదితమే.మహిళ ఓటర్ల పంచే క్రమంలో వాహనాలలో తరలించేందుకు ఆ సిద్దంగా ఉంచిన చీరలను సదరు టీడీపీ నేత నివాసంలో నగర పోలీసులు పట్టుకున్నారు.