బదిలీలకు బ్రేక్
బదిలీలకు బ్రేక్
Published Fri, Dec 16 2016 11:53 PM | Last Updated on Sun, Sep 2 2018 3:51 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
సీఐల బదిలీలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈనెలలోనే బదిలీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండగా, వచ్చే ఏడాది మార్చి తరువాత చేపట్టాలని పోలీస్ బాస్‌లు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఏలూరు రేంజి పరిధిలో ఈ ఏడాది డిసెంబర్‌కే చాలామంది సీఐలు ప్రస్తుతం పనిచేస్తున్న చోట రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారు. ఈ నేపత్యంలో 40 మంది సీఐలను బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఎవరిని ఎక్కడికి బదిలీ చేయాలనే జాబితా కూడా కొలిక్కి వచ్చింది. అయితే ఇప్పుడు బదిలీ చేయడం వల్ల పిల్లల చదువులకు ఇబ్బంది కలుగుతుందంటూ కొందరి నుంచి వచ్చిన విజ్ఞాపనల మేరకు ఈ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించినట్టు సమాచారం. మరోవైపు సంక్రాంతి రోజులు సమీపిస్తున్నాయి. గోదావరి జిల్లాలతోపాటు కృష్ణాలోనూ కోడి పందాలు, ఇతర జూదాలు ఊపందుకుంటాయి. ఈ సమయంలో సీఐలను బదిలీ చేసి కొత్తవారిని తీసుకురావడం వల్ల వారికి ఆ ప్రాంత పరిస్థితులపై అవగాహన ఉండదన్న అభిప్రాయం ఉన్నతాధికారుల్లో వ్యక్తం అవుతోంది. పందేలను పూర్తిగా అడ్డుకోలేకపోయినా విచ్చలవిడిగా జరగకుండా చూసేందుకు బదిలీలను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు ప్రాంతాల్లో నియమితులైన సీఐలు బాధ్యతలు చేపట్టి ఈ నెలతో రెండేళ్లు పూర్తయ్యింది. దీంతో, కొందరు సీఐలు తమకు అనుకూలమైన పోస్టింగ్‌ల కోసం పెద్ద ఎత్తున పైరవీలు మొదలుపెట్టారు. రానున్న రెండేళ్లలో ఎన్నికలకు అత్యంత కీలక సమయం కావడంతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తమకు అనుకూలంగా ఉన్న వారిని, తమ సామాజిక వర్గాలకు చెందిన వారిని నియమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు అనుకూలంగా ఉండేవారిని తీసుకురావడం ద్వారా ప్రతిపక్షాలకు చెక్ చెప్పాలనే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆదాయం వచ్చే కీలకమైన స్టేషన్లలో పోస్టింగ్‌ల కోసం కొందరు పెద్దఎత్తున పావులు కదిపారు. ఏలూరు టూటౌన్ పోస్టింగ్ కోసం ఆరుగురు సీఐలు పోటీపడుతున్నారు. ప్రస్తుతం పోలీసు శాఖలో స్థానిక ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖ లేకుండా, అతనికి ఇష్టం లేకుండా పోస్టింగ్ తెచ్చుకోవడం అసా«ధ్యం. దీంతో సీఐల్లో పలువురు ప్రజాప్రతినిధుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరోమూడు నెలల పాటు బదిలీలు జరపకూడదని ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయం కీలక పోస్టింగ్‌లు ఆశిస్తున్న వారికి మింగుడు పడటం లేదని సమాచారం.
Advertisement