- అందుబాటులో లేని విద్యార్థిని
- ఆమె తండ్రిని విచారించిన సీఐడీ టీం
- బెల్లంపల్లిలో మరో విద్యార్థిని తండ్రి..?
భూపాలపల్లిలోనూ సీఐడీ విచారణ
Published Wed, Jul 27 2016 11:36 PM | Last Updated on Fri, Nov 9 2018 4:32 PM
భూపాలపల్లి: ఎంసెట్–2 పేపర్ లీకేజీతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ విద్యార్థిని తండ్రిని సీఐడీ పోలీసులు బుధవారం విచారించారు. వరంగల్ జిల్లా భూపాలపల్లి పట్టణానికి చెందిన వంగర శ్రీనివాస్ కూతురు జాహ్నవి, సింగరేణి సెక్యూరిటీ గార్డు శంకర్‌రెడ్డి కూతురు సోనాలికి ఎంసెట్–2లో అసాధారణ ర్యాంకులు వచ్చాయి. ఈ విషయమై అనుమానాలు తలెత్తాయి.
ఈ మేరకు పేపర్ లీకేజీ అయినట్లు పలువురు తల్లితండ్రులు భావించారు. దీంతో విచారణ ప్రారంభించిన సీఐడీ పోలీసులు బుధవారం మధ్యాహ్నం విచారణ నిమిత్తం భూపాలపల్లికి వచ్చారు. శ్రీనివాస్, అతని కూతురు జాహ్నవిని విచారించేందుకు ప్రయత్నించగా జాహ్నవి అందుబాటులో లేదు. పరకాల పట్టణంలోని బంధువుల ఇంట్లో ఉన్నట్లు సమాచారం.
దీంతో సీఐడీ అధికారులు శ్రీనివాస్‌ను పూర్తి స్థాయిలో విచారించారు. తనకు ఆరోగ్యం బాగా లేదని, షుగర్ పెరిగిందని శ్రీనివాస్ పోలీసులకు తెలిపాడు. అయితే విచారణ నిమిత్తం తాము పిలిచిన సమయంలో వరంగల్ పట్టణానికి రావాలని సీఐడీ అధికారులు ఆదేశించారు. అలాగే పట్టణంలోని హనుమాన్‌నగర్‌కాలనీలో నివాసం ఉండే సింగరేణి సెక్యూరిటీ గార్డు శంకర్‌రెడ్డి ఇంటికి వెళ్ళగా ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో సీఐడీ అధికారులు వెనుదిరిగారు. అయితే శంకర్‌రెడ్డి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి సమీపంలోని జిల్లెడ గ్రామంలో ఉన్నట్లు తెలిసింది.
Advertisement
Advertisement