జానుమల్లువలసలో నీరులేక ఎండుతున్న వరిచేలు
అన్నదాతల ఆందోళన
సీతానగరం: అప్పులు చేసి సాగు చేస్తున్నారు. వర్షాలు కురవక విలవిల్లాడిపోతున్నారు. పంటలు ఎండిపోవడంతో బావురుమంటున్నారు. మండలంలో వర్షాధార పంటలను పండిస్తున్న జానుమల్లువలస, కోటసీతారాంపురం, దయానిధిపురం, పూనుబుచ్చింపేట, గాదెలవలస తదితర గ్రామాల్లో రైతులు జూన్ నెలలో వరినారు వేశారు. జూలై రెండో వారంలో వర్షాలు కురవడంతో ఉభాలకు వరినారు అందుకురావడంతో అప్పులు చేసి వరినాట్లు వేశారు. దశాబ్దాల కాలంగా రైతులు ఏటా వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. 2000వ సంవత్సరంలో వెంగళరాయ సాగర్ ప్రాజెక్ట్ ద్వారా రూ.3.5 కోట్ల వ్యయంతో మిగులు జలాలను కోటసీతారాంపురం, జాను మల్లువలస, పూనుబుచ్చింపేట, దయానిధిపురం, గాదెలవలస గ్రామాలకు చెందిన 5 వేల ఎకరాలకు సాగు నీరందించే పనులకు భూమిపూజ నిర్వహించారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో కాలువ పనులు జరగలేదు. దీంతో నీరులేక వరిచేలు ఎండిపోవడంతో రైతుల కష్టాలు మొదలయ్యాయి.
ఎండిపోయిన వరినారు : సిహెచ్.సత్యనారాయణ, రైతు, కేఎస్ పురం.
మాది సన్నకారు రైతు కుటుంబం. వర్షాలు కురవకపోవడంతో వేసిన వరినారు ఎండిపోయింది. వ్యవసాయం లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. తక్షణమే వెంగళరాయ సాగర్ నుంచి నీరు మళ్లించాలి.
వీఆర్‌ఎస్ నీళ్లివ్వాలి : పి.ఆనంద్, రైతు, కేఎస్ పురం
కుటుంబమంతా నిరంతరం శ్రమించి వరిఉభాలు చేశాం. అప్పులు చేసి తొలివిడత ఎరువులు వేశాం. పదిహేను రోజులుగా వర్షాల్లేక, వెంగళరాయ సార్‌నుంచి నీరు రాక పంటలు ఎండి పోతున్నాయి. తక్షణమే వీఆర్‌ఎస్ నుంచి నీరు విడుదల చేయాలి.