ఆన్‘లైన్ క్లియర్
- ఆర్టీఏ ఆన్‌లైన్ సేవలు షురూ
- నేటి నుంచే ప్రారంభం
- అందుబాటులో 53 రకాల సేవలు
సంగారెడ్డి టౌన్:శివ్వంపేటకు చెందిన అవినాష్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకున్నాడు. నిర్దేశించిన తేదీన సంగారెడ్డి మండలం కందిలోని ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాడు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్యూలో నిల్చున్నాడు. ఎంతకీ తన వంతు రాలేదు. కానీ, కొందరు వరుసలో నిల్చోకుండానే దర్జాగా క్షణాల్లో పని కానిచ్చేసుకుని వెళ్లిపోయారు. ఆరా తీస్తే దళారుల ద్వారా వారు పని చక్కబెట్టుకున్నారని తెలిసింది. ఆన్‌లైన్ అంటూ ఆర్భాటం చేసినా ఎందుకు ఉపయోగం అని అవినాష్ వంటి వారంతా పెదవి విరుస్తున్నారు.
ఇదంతా నిన్నటి వ్యథ..
నేటి నుంచి రవాణా శాఖలో పూర్తి స్థాయి ఆన్‌లైన్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఇకనైనా ఇటువంటి వ్యథలు తప్పేనా అని వాహన చోదకులు ఆశగా ఎదురు చూస్తున్నారు.జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి రవాణా శాఖ (ఆర్‌టీఏ)కు సంబంధించిన అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే అందనున్నాయి. సంగారెడ్డిలోని కంది, పటాన్‌చెరు, జహీరాబాద్, మెదక్, సిద్దిపేటలలో గల ప్రాంతీయ రవాణా కేంద్రాలను ఇందుకునుగుణంగా తీర్చిదిద్దారు.
ఇకపై దరఖాస్తులు నింపడం, ఏ సేవకు ఏ ఫారం నింపాలో గందరగోళపడటం వంటి ఇబ్బందులు తప్పనున్నాయి. ఆర్టీఏ ఆన్‌లైన్ వెబ్‌సైట్ (www.transport.telangana.gov.in) లోకి లాగిన్ అయ్యి కావాల్సిన సేవలకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకోవాలి. దీనిని స్లాట్ బుకింగ్ అంటారు. అనంతరం కంప్యూటర్ ఒక అప్లికేషన్ నెంబరును సదరు అభ్యర్థికి కేటాయిస్తుంది. దాని సమాచారం సదరు వ్యక్తి మొబైల్ నంబరుకు ఎస్‌ఎంఎస్ రూపంలో వస్తుంది.
సంబంధిత ఫీజు ఆన్‌లైన్‌లో కాని, ఈసేవ, మీ సేవలో కానీ చెల్లించి, నిర్ణీత స్లాట్ (కేటాయించిన తేదీ) రోజున అవసరమైన ధ్రువపత్రాలను కార్యాలయానికి వెళ్లి సమర్పిస్తే సరిపోతుంది. కార్యాలయంలో అభ్యర్థి ఫొటో, సంతకం, వేలిముద్రలు తీసుకొని అభ్యర్థికి కావలసి సేవలు అందిస్తారు.
53 రకాల సేవలు..
లర్నింగ్, డ్రైవింగ్ లైసెన్సుల మాదిరిగానే వాహన రిజిస్ట్రేషన్లు, యాజమాన్య బదిలీ, చిరునామా మార్పిడి, రెన్యువల్, డూప్లికేట్ తదితర సేవల్ని ఆన్‌లైన్‌లో పొందవచ్చు. రవాణా శాఖకు సంబంధించిన 9 విభాగాలలో 53 రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. లర్నింగ్ లైసెన్స్‌కు సంబంధించి 5 సేవలు, డ్రైవింగ్ లైసెన్సు-9, రిజిస్ట్రేషన్-12, కండక్టర్ లైసెన్స్-4, కొత్త పర్మిట్ మంజూరుకు సంబంధించి-9, ఫిట్‌నెస్ సర్టిఫికెట్-4, రికమండేషన్ లెటర్-5, టాక్స్ పేమెంట్-2, ట్రేడ్ సర్టిఫికెట్-3.. తదితర 53 సేవలు అందుబాటులోకి వచ్చాయి.