slot Book
-
ఆర్టీఏలో రశీదుల భారం
సాక్షి, హైదరాబాద్: ‘ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్’ అన్న సామెతను గుర్తు చేస్తోందీ మన ఆర్టీఏ కార్యాయాలు, మీసేవా కేంద్రాల పరిస్థితి. పారదర్శకత కోసం రవాణా శాఖకు సంబంధించిన సేవలను ఆన్లైన్ చేసిన లక్ష్యం నెరవేరింది. కానీ చేసిన ప్రతి లావాదేవీకి సంబంధించి ప్రింటౌట్ల రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారులపై రోజుకు గరిష్టంగా రూ.5 లక్షలకు పైగా అదనపు భారం పడుతోంది. వాహనదారుల అవగాహన లేమి, అధికారులు తగు ప్రచారం కల్పించకపోవడంతో ఇలా వినియోగదారుల నెత్తిన అదనపుభారం పడుతోంది. నేపథ్యమేంటి? 2016 ఆగస్టు నుంచి అప్పటి రవాణా శాఖలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు అన్ని సేవలను ఆన్లైన్ చేశారు. ఇందుకు రవాణా శాఖతో మీ–సేవా ఒప్పందం కూడా చేసుకుంది. అప్పటి నుంచి మాన్యువల్‌గా ఎలాంటి చెల్లింపులు జరగట్లేదు. లర్నింగ్ లైసెన్స్, పర్మినెంట్ లైసెన్స్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్, చిరునామా మార్పు, ఫిట్నెస్, ఆర్సీ రెన్యువల్ ఇలా దాదాపు 56 సేవలకు కావాల్సిన వివిధ రకాల సేవల చార్జీలను ఆన్లైన్లోనే చెల్లిస్తున్నారు. ప్రతి లావాదేవీకి కనీస చార్జిగా రూ.35 నిర్ణయించారు. వీటిని ఆన్లైన్లో పూర్తి చేసి, నిర్ణయించిన ఫీజును సర్వీసు చార్జీ రూ.35తో కలిపి చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో చెల్లింపుల అనంతరం మీ–సేవా కేంద్రాలు రశీదులు ఇస్తారు. కానీ సంబంధిత ఫారం ప్రింటౌట్ను వినియోగదారులే తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకున్న ప్రింటౌట్‌కు సంబంధిత ఇతర పత్రాలు జమచేసి రవాణా శాఖ కౌంటర్లలో దరఖాస్తు చేసుకోవాలి. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రతి ప్రింటౌట్‌కు నెట్‌సెంటర్ల నిర్వాహకులు రూ.20 నుంచి రూ.30 వరకు వసూలు చేస్తున్నారు. తప్పనిసరిగా ప్రింటౌట్ ఇవ్వాలన్న నిబంధనేమీ లేదని మీ–సేవా కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. చాలా రోజులుగా సమస్య.. చాలా రోజులుగా మీ–సేవా కేంద్రాల్లో ప్రింటౌట్ సమస్య నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకట్రెండు రవాణా శాఖ కార్యాలయంలో ఉన్న మీ–సేవా కేంద్రాలు మాత్రమే ప్రింటౌట్లు ఇస్తున్నాయి. మిగిలిన చోట్ల ఎక్కడా ప్రింటౌట్ ఇవ్వట్లేదు. దీంతో చేసేది లేక వినియోగదారులు బయటి నుంచి రూ.20 నుంచి 30 వరకు మరోసారి చెల్లిస్తున్నారు. ఒకసారి సర్వీసు చార్జీ చెల్లించాక మరోసారి ప్రింటౌట్‌కు డబ్బులు సమర్పించుకోవడంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు రూ.5 లక్షలకుపైగా భారం పడుతోదని తెలంగాణ ఆటోమోటార్స్ వెల్ఫేర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దయానంద్ వాపోయారు. ప్రభుత్వం రూ.35 సర్వీసు చార్జీ వసూలు చేశాక మరోసారి ప్రింటౌట్ కోసం చెల్లించాల్సి రావడం వినియోగదారుడి జేబుకు చిల్లు పెట్టడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని మీసేవా కేంద్రాలు ప్రింటౌట్లు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రచారం, అవగాహన లేకపోవడమే కారణం.. దరఖాస్తు చేసునేందుకు వినియోగదారులు నేరుగా రవాణా కేంద్రంలోనే ఈ ఫారంలను ప్రింటౌట్ తీసుకోవచ్చని మీసేవా కేంద్రాల నిర్వహణ చూసే ఈఎస్డీ కమిషనర్ వెంకటేశ్వర్రావు స్పష్టం చేశారు. వియోగదారులు అవగాహన లేకే ప్రింటౌట్లకు అదనంగా రూ.30 చెల్లిస్తున్నారని వివరణ ఇచ్చారు. ఆర్టీఏ కార్యాలయాలు... లావాదేవీలు ఒక్కో కార్యాలయంలో రోజుకు జరిగే కనీస లావాదేవీలు 300కుపైగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల సంఖ్య 74 ఒక రోజుకు జరిగే లావాదేవీలు 22,200 (దాదాపుగా) మీ–సేవాల్లో ఒకరోజు వినియోగదారులు చెల్లించే సర్వీసుచార్జీలు రూ.7,77,000కుపైగా నెలలో 22 పనిదినాలకు చెల్లించే మొత్తం రూ.1,70,94,000 ఏటా మీ–సేవాకు అందుతున్న చార్జీల మొత్తం రూ.20,51,28,000కుపైగా -
ఆన్‘లైన్ క్లియర్
ఆర్టీఏ ఆన్లైన్ సేవలు షురూ నేటి నుంచే ప్రారంభం అందుబాటులో 53 రకాల సేవలు సంగారెడ్డి టౌన్:శివ్వంపేటకు చెందిన అవినాష్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్నాడు. నిర్దేశించిన తేదీన సంగారెడ్డి మండలం కందిలోని ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాడు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్యూలో నిల్చున్నాడు. ఎంతకీ తన వంతు రాలేదు. కానీ, కొందరు వరుసలో నిల్చోకుండానే దర్జాగా క్షణాల్లో పని కానిచ్చేసుకుని వెళ్లిపోయారు. ఆరా తీస్తే దళారుల ద్వారా వారు పని చక్కబెట్టుకున్నారని తెలిసింది. ఆన్లైన్ అంటూ ఆర్భాటం చేసినా ఎందుకు ఉపయోగం అని అవినాష్ వంటి వారంతా పెదవి విరుస్తున్నారు. ఇదంతా నిన్నటి వ్యథ.. నేటి నుంచి రవాణా శాఖలో పూర్తి స్థాయి ఆన్లైన్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఇకనైనా ఇటువంటి వ్యథలు తప్పేనా అని వాహన చోదకులు ఆశగా ఎదురు చూస్తున్నారు.జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి రవాణా శాఖ (ఆర్టీఏ)కు సంబంధించిన అన్ని సేవలు ఆన్లైన్లోనే అందనున్నాయి. సంగారెడ్డిలోని కంది, పటాన్చెరు, జహీరాబాద్, మెదక్, సిద్దిపేటలలో గల ప్రాంతీయ రవాణా కేంద్రాలను ఇందుకునుగుణంగా తీర్చిదిద్దారు. ఇకపై దరఖాస్తులు నింపడం, ఏ సేవకు ఏ ఫారం నింపాలో గందరగోళపడటం వంటి ఇబ్బందులు తప్పనున్నాయి. ఆర్టీఏ ఆన్లైన్ వెబ్సైట్ (www.transport.telangana.gov.in) లోకి లాగిన్ అయ్యి కావాల్సిన సేవలకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకోవాలి. దీనిని స్లాట్ బుకింగ్ అంటారు. అనంతరం కంప్యూటర్ ఒక అప్లికేషన్ నెంబరును సదరు అభ్యర్థికి కేటాయిస్తుంది. దాని సమాచారం సదరు వ్యక్తి మొబైల్ నంబరుకు ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది. సంబంధిత ఫీజు ఆన్లైన్లో కాని, ఈసేవ, మీ సేవలో కానీ చెల్లించి, నిర్ణీత స్లాట్ (కేటాయించిన తేదీ) రోజున అవసరమైన ధ్రువపత్రాలను కార్యాలయానికి వెళ్లి సమర్పిస్తే సరిపోతుంది. కార్యాలయంలో అభ్యర్థి ఫొటో, సంతకం, వేలిముద్రలు తీసుకొని అభ్యర్థికి కావలసి సేవలు అందిస్తారు. 53 రకాల సేవలు.. లర్నింగ్, డ్రైవింగ్ లైసెన్సుల మాదిరిగానే వాహన రిజిస్ట్రేషన్లు, యాజమాన్య బదిలీ, చిరునామా మార్పిడి, రెన్యువల్, డూప్లికేట్ తదితర సేవల్ని ఆన్లైన్లో పొందవచ్చు. రవాణా శాఖకు సంబంధించిన 9 విభాగాలలో 53 రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. లర్నింగ్ లైసెన్స్‌కు సంబంధించి 5 సేవలు, డ్రైవింగ్ లైసెన్సు-9, రిజిస్ట్రేషన్-12, కండక్టర్ లైసెన్స్-4, కొత్త పర్మిట్ మంజూరుకు సంబంధించి-9, ఫిట్నెస్ సర్టిఫికెట్-4, రికమండేషన్ లెటర్-5, టాక్స్ పేమెంట్-2, ట్రేడ్ సర్టిఫికెట్-3.. తదితర 53 సేవలు అందుబాటులోకి వచ్చాయి.