ఆర్టీఏలో రశీదుల భారం | Do not print out a slot book in rta | Sakshi
Sakshi News home page

ఆర్టీఏలో రశీదుల భారం

Published Tue, Feb 5 2019 1:13 AM | Last Updated on Tue, Feb 5 2019 5:18 AM

Do not print out a slot book in rta - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ఆపరేషన్‌ సక్సెస్‌.. పేషెంట్‌ డెడ్‌’ అన్న సామెతను గుర్తు చేస్తోందీ మన ఆర్టీఏ కార్యాయాలు, మీసేవా కేంద్రాల పరిస్థితి. పారదర్శకత కోసం రవాణా శాఖకు సంబంధించిన సేవలను ఆన్‌లైన్‌ చేసిన లక్ష్యం నెరవేరింది. కానీ చేసిన ప్రతి లావాదేవీకి సంబంధించి ప్రింటౌట్ల రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారులపై రోజుకు గరిష్టంగా రూ.5 లక్షలకు పైగా అదనపు భారం పడుతోంది. వాహనదారుల అవగాహన లేమి, అధికారులు తగు ప్రచారం కల్పించకపోవడంతో ఇలా వినియోగదారుల నెత్తిన అదనపుభారం పడుతోంది. 

నేపథ్యమేంటి? 
2016 ఆగస్టు నుంచి అప్పటి రవాణా శాఖలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు అన్ని సేవలను ఆన్‌లైన్‌ చేశారు. ఇందుకు రవాణా శాఖతో మీ–సేవా ఒప్పందం కూడా చేసుకుంది. అప్పటి నుంచి మాన్యువల్‌గా ఎలాంటి చెల్లింపులు జరగట్లేదు. లర్నింగ్‌ లైసెన్స్, పర్మినెంట్‌ లైసెన్స్, ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ఓనర్‌షిప్, చిరునామా మార్పు, ఫిట్‌నెస్, ఆర్‌సీ రెన్యువల్‌ ఇలా దాదాపు 56 సేవలకు కావాల్సిన వివిధ రకాల సేవల చార్జీలను ఆన్‌లైన్‌లోనే చెల్లిస్తున్నారు. ప్రతి లావాదేవీకి కనీస చార్జిగా రూ.35 నిర్ణయించారు. వీటిని ఆన్‌లైన్‌లో పూర్తి చేసి, నిర్ణయించిన ఫీజును సర్వీసు చార్జీ రూ.35తో కలిపి చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో చెల్లింపుల అనంతరం మీ–సేవా కేంద్రాలు రశీదులు ఇస్తారు. కానీ సంబంధిత ఫారం ప్రింటౌట్‌ను వినియోగదారులే తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకున్న ప్రింటౌట్‌కు సంబంధిత ఇతర పత్రాలు జమచేసి రవాణా శాఖ కౌంటర్లలో దరఖాస్తు చేసుకోవాలి. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రతి ప్రింటౌట్‌కు నెట్‌సెంటర్ల నిర్వాహకులు రూ.20 నుంచి రూ.30 వరకు వసూలు చేస్తున్నారు. తప్పనిసరిగా ప్రింటౌట్‌ ఇవ్వాలన్న నిబంధనేమీ లేదని మీ–సేవా కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. 

చాలా రోజులుగా సమస్య.. 
చాలా రోజులుగా మీ–సేవా కేంద్రాల్లో ప్రింటౌట్‌ సమస్య నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకట్రెండు రవాణా శాఖ కార్యాలయంలో ఉన్న మీ–సేవా కేంద్రాలు మాత్రమే ప్రింటౌట్లు ఇస్తున్నాయి. మిగిలిన చోట్ల ఎక్కడా ప్రింటౌట్‌ ఇవ్వట్లేదు. దీంతో చేసేది లేక వినియోగదారులు బయటి నుంచి రూ.20 నుంచి 30 వరకు మరోసారి చెల్లిస్తున్నారు. ఒకసారి సర్వీసు చార్జీ చెల్లించాక మరోసారి ప్రింటౌట్‌కు డబ్బులు సమర్పించుకోవడంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు రూ.5 లక్షలకుపైగా భారం పడుతోదని తెలంగాణ ఆటోమోటార్స్‌ వెల్ఫేర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి దయానంద్‌ వాపోయారు. ప్రభుత్వం రూ.35 సర్వీసు చార్జీ వసూలు చేశాక మరోసారి ప్రింటౌట్‌ కోసం చెల్లించాల్సి రావడం వినియోగదారుడి జేబుకు చిల్లు పెట్టడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని మీసేవా కేంద్రాలు ప్రింటౌట్లు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

ప్రచారం, అవగాహన  లేకపోవడమే కారణం.. 
దరఖాస్తు చేసునేందుకు వినియోగదారులు నేరుగా రవాణా కేంద్రంలోనే ఈ ఫారంలను ప్రింటౌట్‌ తీసుకోవచ్చని మీసేవా కేంద్రాల నిర్వహణ చూసే ఈఎస్‌డీ కమిషనర్‌ వెంకటేశ్వర్‌రావు స్పష్టం చేశారు. వియోగదారులు అవగాహన లేకే ప్రింటౌట్లకు అదనంగా రూ.30 చెల్లిస్తున్నారని వివరణ ఇచ్చారు.  

ఆర్టీఏ కార్యాలయాలు... లావాదేవీలు
ఒక్కో కార్యాలయంలో రోజుకు జరిగే కనీస లావాదేవీలు 300కుపైగా
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల సంఖ్య    74
ఒక రోజుకు జరిగే లావాదేవీలు    22,200 (దాదాపుగా) 
మీ–సేవాల్లో ఒకరోజు వినియోగదారులు చెల్లించే సర్వీసుచార్జీలు  రూ.7,77,000కుపైగా 
నెలలో 22 పనిదినాలకు చెల్లించే మొత్తం    రూ.1,70,94,000 
ఏటా మీ–సేవాకు అందుతున్న చార్జీల మొత్తం    రూ.20,51,28,000కుపైగా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement