'కొత్త జిల్లాల విభజనపై ప్రజల్లో ఆందోళన'
నల్లగొండ: తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కొత్త జిల్లాల విభజన విషయంలో ప్రజలు ఆందోళనలో ఉన్నారని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాలో శనివారం ఆయన మాట్లాడుతూ...ప్రభుత్వ నిర్ణయంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అఖిలపక్షాన్ని సంప్రదించి కొత్త జిల్లాలను ఏర్పాటుచేయాలని జానారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ఒక వేళ పరిపాలనా సౌలభ్యం కోసం విభజించినట్లైతే...శాస్త్రీయంగా, రాజ్యాంగ బద్ధంగా ప్రజా, ఉద్యోగ సంఘాల అభిప్రాయాన్ని సేకరించి విభజన చేయాలని ఆయన చెప్పారు. నల్లగొండ జిల్లాను నాలుగు ముక్కలుగా చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి ఉన్న యాదగిరిగుట్టను నల్లగొండ జిల్లాలోనే ఉంచాలని... లేదంటే యాదాద్రిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని జానారెడ్డి పేర్కొన్నారు.